Share News

stand on Pulikonda పులికొండపై తిష్ఠ

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:24 PM

stand on Pulikonda చౌడవాడ పంచాయతీ పరిధిలోని కోనయ్యపాలెంలో ఉన్న పులికొండను ఆక్రమించేశారు. కొండపోరంబోకు భూమి కదా... ఎవరు ప్రశ్నిస్తారులే అనుకుని సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకుల అండతో అప్పట్లోనే ఇందుకు తెగపడ్డారు.

stand on Pulikonda పులికొండపై తిష్ఠ
కోనయ్యపాలెంలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిలో కొబ్బరి మొక్కలు

పులికొండపై తిష్ఠ

ప్రభుత్వ భూమిని చదును చేసి ఆక్రమించేసిన నాయకులు

గత ప్రభుత్వంలో కీలక నేతల అండ

నాడు రెవెన్యూశాఖ బోర్డులను సైతం పీకేసిన ఆక్రమణదారులు

దర్జాగా కొబ్బరి మొక్కల సాగు

పూసపాటిరేగ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి):

చౌడవాడ పంచాయతీ పరిధిలోని కోనయ్యపాలెంలో ఉన్న పులికొండను ఆక్రమించేశారు. కొండపోరంబోకు భూమి కదా... ఎవరు ప్రశ్నిస్తారులే అనుకుని సొంతం చేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకుల అండతో అప్పట్లోనే ఇందుకు తెగపడ్డారు. ఫిర్యాదు రావడంతో అధికారులు పరిశీలించి ఆ భూమి ప్రభుత్వానికి చెందినదని, ఆక్రమించరాదని బోర్డు పెట్టారు. అయినా ఏమాత్రం జంకు గొంకు లేని ఆ వ్యక్తులు బోర్డు పీకేసి దర్జాగా తిష్టవేశారు. నేతల నుంచి ఫోన్‌లు రావడంతో అధికారులు ఆ తర్వాత అటువైపు చూడడం మానుకున్నారు.

చౌడవాడ పంచాయతీలోని కోనయ్యపాలెం గ్రామంలో రెండు కొండలు విస్తరించి ఉన్నాయి. పది ఎకరాలకు పైగా కొండపోరంబోకు భూమిగా ఉండడంతో మూడేళ్ల కిందటి వరకు ఎవరూ అటువైపు చూడలేదు. అయితే సొంత ఇల్లు లేని స్థానిక పేదలు కొందరు కొండ దిగువ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని రంగంలోకి దిగిన ఆక్రమణదారులు నాలుగు ఎకరాల్లో ఉన్న కొండను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఎత్తుగడ వేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలక నేతల అండ తీసుకున్నారు. ఇంకేముంది సర్వే నెంబరు 17లోని పులికొండలో సుమారు నాలుగు ఎకరాల కొండ పోరంబోకు భూమిని చదును చేసి ఆక్రమించారు. ఎవరైనా ప్రశ్నిస్తే ముందు ఇళ్లను తొలగించండి ఆ తర్వాత ఆక్రమణల సంగతి చూద్దామనేవారు. దీనిపై మీడియాలోనూ అనేక కథనాలు రావడంతో నాటి రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఈ కొండ ప్రభుత్వానికి చెందినదని, ఆక్రమించకూడదని బోర్డులు పెట్టారు. అయితే ఆక్రమణదారులు ఏమాత్రం తగ్గకపోగా పట్టు బిగించి కీలక నేతలను ప్రసన్నం చేసుకున్నారు. వారి చేత ఫోన్‌లు చేయించి అధికారులపై ఒత్తిడి పెంచారు. ఈ తలనొప్పి తమకెందుకు అనుకున్నారేమో ఆ తర్వాత అధికారులు అటువైపు చూడలేదు. ఇక కబ్జాదారులు సొంత స్థలంగా భావించుకుని కొబ్బరి తోట వేశారు. నేటికీ ఆ భూమి వారి ఆధీనంలోనే ఉంది. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఇదే విషయమై తహసీల్దారు గోవింద్‌ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 11:24 PM