భానుడు భగభగ
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:10 AM
జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నా యి. ఉదయం 8 గంటల నుంచే భానుడు సెగలు కక్కుతున్నాడు. 11 గంటలకే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి.
- జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
పాలకొండ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నా యి. ఉదయం 8 గంటల నుంచే భానుడు సెగలు కక్కుతున్నాడు. 11 గంటలకే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. గురువారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనాలు రోడ్ల మీదకు వచ్చేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సూర్య ప్రతాపానికి అన్ని వర్గాల ప్రజలు, మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో మినహా బయట తిరిగేందుకు ఎవరూ సాహసించడం లేదు. దీంతో పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జన సంచారం లేక ప్రధాన రహదారులు, ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అన్ని వయస్కుల వారు చల్లని ప్రాంతంలో సేదతీరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుబాటులో ఉన్న కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల వద్ద సేదతీరుతున్నారు. రేకు ఇళ్లు, డాబా గృహాల్లో ఉండేవారు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు వేడిని తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి మూగజీవాలను రక్షించుకొనేందుకు పాడిరైతులు, పశువుల కాపర్లు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. కొంతమంది పాడి రైతులు ఎండ నుంచి ఉపశమనం కలిగించేందుకు పైపులతో పశువులపై నీళ్లు చల్లుతున్నారు. మేకలు, గొర్రెలు మధ్యాహ్నం సమయంలో చెట్లు నీడన సేదతీరేలా చర్యలు చేపడుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విపత్తుల సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, వడగాల్పులు వీచే అవకాశం ఉందని, తలకు టోపీ ధరించాలని, రుమాలు పట్టుకోవాలని, చలువ కళ్లద్దాలు వాడాలని, ఎక్కువగా మంచినీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరినీరు, ఓఆర్‌ఎస్ వంటివి తాగాలని సూచించింది.