Tension in Bantuvanivalsa బంటువానివలసలో ఉద్రిక్తత
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:38 PM
Tension in Bantuvanivalsa పార్వతీపురం మండలం బంటువానివలసలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామమందిరం ఖాళీ స్థలంపై పోలీసులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆక్రమణల తొలగింపు
పోలీసులు, రెవెన్యూ యంత్రాంగంతో గ్రామస్థుల వాగ్వాదం
పార్వతీపురం రూరల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం బంటువానివలసలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామమందిరం ఖాళీ స్థలంపై పోలీసులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ఉన్న తోటపల్లి నిర్వాసితులకు గతంలో రామమందిర నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. అయితే వాస్తు ప్రకారం అక్కడ కాకుండా వేరే ప్రాంతంలో రామమందిరం నిర్మించారు. కొన్నేళ్ల తర్వాత ఖాళీగా ఉన్న రామమందిరం స్థలంలో ఇద్దరికి తహసీల్దార్ పట్టాలు మంజూరు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించేందుకు రంగంలో దిగారు. ఈ మేరకు ఆదివారం వారు పోలీసుల సహకారంతో అక్కడకు చేరుకున్నారు. గతంలో కేటాయించిన రామమందిరం స్థలంలో వేరొకరికి పట్టాలు ఎలా మంజూరు చేశారని గ్రామస్థులు ప్రశ్నించారు. ఆ స్థలంలో చెట్లు ఎందుకు తొలగిస్తున్నారంటూ నిలదీశారు. దీంతో పోలీసులు, గ్రామస్థుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మరోవైపు సీపీఎం నాయకుడు బంటు దాసు రామమందిరానికి ఆనుకుని ఉన్న కొంత ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రహరీని తొలగించేందుకు రెవెన్యూ అధికారులు యంత్రాలతో అక్కడకు వచ్చారు. ఈ రెండు ఘటనలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. తన ఇంటి ప్రహరీ మూడు అడుగుల ప్రభుత్వ స్థలం ఉందని నిరూపిస్తే..తానే దానిని తొలగిస్తానని బంటు దాసు స్పష్టం చేశారు. గతంలో రామమందిరానికి కేటాయించిన స్థలంలో అర్హులకు పట్టాలు మంజూరు చేస్తే అది ప్రభుత్వ స్థలమంటూ అధికారులు యంత్రాలతో వచ్చి చెట్లు తొలగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సీపీఎం నాయకుడు కృష్ణమూర్తి మాట్లాడుతూ... పట్టా ఇచ్చిన తర్వాత వారి స్థలంలో కొంత భాగం వేరకొరికి ఇస్తే అధికారులకు అభ్యంతరమేమిటని అడిగారు. ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారులు రామమందిరానికి కేటాయించిన స్థలంలో ఉన్న చెట్లును, సీపీఎం నాయకుడు బంటు దాసు ఇంటి రక్షణ గోడ కొంత భాగాన్ని యంత్రాలతో తొలగించారు. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం దారుణమని సీసీఎం నాయకులు అన్నారు. దీనిపై సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. అనంతరం కొంతమంది సీపీఎం నాయకులు, మరికొందరిని వ్యాన్ ఎక్కించి పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే తమను అరెస్టు చేసినట్టు సీపీఎం నాయకులు చెబుతుండగా.. దీనిపై పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు.