మార్గదర్శకులదే ఆలస్యం
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:00 AM
The pioneers are late అట్టడుగున ఉన్న పేద ప్రజలకు చేయూత అందించి ఉన్నత స్థితికి తీసుకొచ్చే సంకల్పంతో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గదర్శి - బంగారు కుటుంబం కార్యక్రమం జిల్లాలోనూ విజయవంతంగా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే మార్గదర్శకులెవరూ ఇంతవరకు రిజిస్టర్ కాలేదు. పీ-4 సర్వే ద్వారా పేద కుటుంబాల గుర్తింపు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది.
మార్గదర్శకులదే ఆలస్యం
లాగిన్ కావడానికి తాజాగా వెబ్‌సైట్ ఏర్పాటు
రిజిస్టర్ చేసుకుంటారని ఎదురుచూస్తున్న అధికారులు
జిల్లాలో 67,010 కుటుంబాలు కనీస అవసరాలకు దూరం
పీ-4 సర్వేలో గుర్తింపు
విజయనగరం కలెక్టరేట్ ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): అట్టడుగున ఉన్న పేద ప్రజలకు చేయూత అందించి ఉన్నత స్థితికి తీసుకొచ్చే సంకల్పంతో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గదర్శి - బంగారు కుటుంబం కార్యక్రమం జిల్లాలోనూ విజయవంతంగా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అయితే మార్గదర్శకులెవరూ ఇంతవరకు రిజిస్టర్ కాలేదు. పీ-4 సర్వే ద్వారా పేద కుటుంబాల గుర్తింపు ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది.
ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం (పీ-4)తో ప్రతి ఇంటికీ అభివృద్ధి, ప్రతి జీవితానికీ ప్రగతి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి - బంగారు కుటుంబం కార్యక్రమం తీసుకొచ్చింది. మంచి ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా కాస్త ఆర్థికంగా ఉన్న వారు(మార్గదర్శకులు) పేద ప్రజలకు స్వచ్ఛందంగా సాయం అందించాలి. గ్రామాల్లో అట్టడుగున ఉన్న వర్గాలను గుర్తించేందుకు నెల రోజులు క్రితం సచివాలయ సిబ్బంది సర్వే చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆర్థిక పరిస్థితులను నమోదు చేసుకున్నారు. మౌలిక వసతులు కల్పించుకోలేని వారితో పాటు పేద కుటుంబాల వివరాలను తీసుకున్నారు. ఆయా కుటుంబాల్లో పోషణ కోసం ఆధారమైన వ్యక్తి లేనివారిని కూడా గుర్తించారు.
జిల్లా వ్యాప్తంగా 6.10 లక్షల కుటుంబాలు ఉంటే వారిలో అట్టడుగున ఉన్నట్లు 67,010(20ఽ శాతం) కుటుంబాలను గుర్తించారు. వారి వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ కుటుంబా లకు మార్గదర్శకులు సాయం అందించాల్సి ఉంది. ఒక కుటుంబానికి దీర్ఘకాలిక మార్గదర్శకత్వం, ఆర్థిక సహాయం అందించి వారిని స్వయం సమృద్ధి పైపు నడిపించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. విద్య, ఉపాధి, ఆర్థిక స్థిరత్వం తీసుకొచ్చేందుకు పేదలకు మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. అలాగే అవసరానికి నిధులు సమకూర్చడంతో పాటు పిల్లల విద్య, వ్యాపారానికి సహకారం అందించవచ్చు. గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికీ ముందుకు రావొచ్చు. అయితే కుటుంబాన్ని దత్తత తీసుకోవడానికి ముందుగా పోర్టల్‌లో సైన్‌అప్ కావాలి. అందుబాటులో ఉన్న కుటుంబాలను కులం, ప్రాంతం, లింగ, సామాజిక స్థితి ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా ఎంపిక చేసుకున్న కుటుంబాల్లో పిల్లలు ఉన్నారా? సీనియర్ సిటిజిన్లు, ఆడపిల్లలు ఉన్నారా? తెలుసుకుని సహాయాన్ని అందించవచ్చు. కెరీర్ నిర్ణయాలు, నైపుణ్యం అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం తదితర అంశాలపై సహకారం అందించవచ్చు. కాగా జిల్లాలో ఇప్పటివరకు మార్గదర్శకులు సైన్‌ఇన్ కాలేదు. వారి కోసం అధికారులు చూస్తున్నారు.