Rain కురిసింది వాన
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:04 PM
The Rain Has Fallen పార్వతీపురం పట్టణంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ వేడి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం
పార్వతీపురం/బెలగాం/మక్కువ/కొమరాడ, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పట్టణంలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ వేడి నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. వాస్తవంగా మధ్యాహ్నం వరకు ఉన్న ఎండకు జిల్లాకేంద్రవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ తర్వాత ఆకాశం మేఘావృతమైంది. చిరు జల్లులతో మొదలై సుమారు అరగంట పాటు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్‌గేటు వద్ద కూడా వర్షపు నీరు నిల్వ ఉండి పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దానిని దాటుకుంటూ బస్సులు ఎక్కేందుకు నానా అవస్థలు పడ్డారు. కొన్నేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోకపోవడంపై స్థానికులు పెదవి విరిచారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాంప్లెక్స్ ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మక్కువ, కొమరాడ మండలాల్లోనూ బుధవారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మక్కువ ప్రధాన రహదారికి ఇరువైపులా మురుగునీరు ప్రవ హించింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో మెయిన్‌రోడ్డు జంక్షన్‌లో కూరగాయల వ్యాపారులు తమ సరకులను షెడ్‌లోకి తీసుకెళ్లడానికి అవస్థలు పడ్డారు.