తాగునీటి సమస్య ఉండరాదు
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:30 PM
తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు.
- ఇసుక నిల్వలు సిద్ధం చేసుకోవాలి
-పార్వతీపురం, శ్రీకాకుళం అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశం
పార్వతీపురం, ఏప్రిల్17(ఆంధ్రజ్యోతి): తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. తాగునీరు, ఇసుక, ఎంఎస్ ఎంఈ సర్వే, స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీటి అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఎక్కడ సమస్య తలెత్తినా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. ‘వేసవి దృష్ట్యా పశువుల తాగునీటిపైనా శ్రద్ధ వహించాలి. పీఎం సూర్య ఘర్ క్రింద సౌర విద్యుత్ ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించాలి. ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వస్తే ఏడాదికి ఒక ఎకరాకు రూ.31 వేలను అద్దెగా చెల్లిస్తాం. వర్షాకాలం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఇసుక నిల్వలు సిద్ధం చేసుకోవాలి. శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలి. ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా వంటి కనీస సదుపాయాలపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. మన మిత్ర, శక్తి యాప్‌లపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. ఎంఎస్ ఎంఈ సర్వేను త్వరగా పూర్తి చేయాలి. ఎంఎస్ ఎంఈ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించాలి. ప్రతీ మూడో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాలి. ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ఈవేస్ట్ రీసైక్లింగ్ థీమ్‌తో ఈ నెల కార్యక్రమం చేపడుతున్నాం. అన్ని శాఖల్లో ఉన్న ఈ వేస్ట్‌ను గుర్తించాలి.’ అని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శోభిక, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, ఈపీడీసీఎస్ పర్యవేక్షక ఇంజనీర్ కోడా చలపతిరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, డీపీవో కొండలరావు, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీరరాజు, పార్వతీపురం మునిసిపల్ కమిషనర్ వెంటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల అధికారి పి.సీతారాము తదితరులు పాల్గొన్నారు.