Share News

Third time, we’re first again! మూడోసారి మనమే ఫస్ట్‌!

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:36 PM

Third time, we’re first again! పదో తరగతి ఫలితాల్లో జిల్లా మూడోసారి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది. 93.90 శాతం ఉత్తీర్ణతతో హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. వరుసగా మూడు సంవత్సరాల పాటు జిల్లాకు చెందిన టెన్త్‌ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి

Third time, we’re first again! మూడోసారి మనమే ఫస్ట్‌!
సాలూరు : 592 మార్కులు సాధించిన తేజస్విని అభినందిస్తున్న మంత్రి సంధ్యారాణి, ఉపాధ్యాయులు

93.90 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

హ్యాట్రిక్‌ విజయం అందుకున్న జిల్లా

ప్రతిభ చూపిన విద్యార్థులు

పార్వతీపురం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో జిల్లా మూడోసారి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది. 93.90 శాతం ఉత్తీర్ణతతో హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. వరుసగా మూడు సంవత్సరాల పాటు జిల్లాకు చెందిన టెన్త్‌ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా 2023 విద్యా సంవత్సరంలో 10,689 విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 9,350 మంది పాసై 87.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2024లో 10,443 మందికి గాను 10,064 మంది పాసై 96.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత రెండేళ్లు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో జిల్లా తాజాగా విడుదలైన ఫలితాల్లో కూడా తన సత్తా చాటింది. ఈ ఏడాదిలో 10,286 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 9,659 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 8,639 మంది ప్రథమ డివిజన్‌లో పాసయ్యారు. 775 మంది రెండో డివిజన్‌లో, 245 మంది మూడో డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించారు. వారిలో 5009 మంది బాలురు , 5277 మంది బాలికలు ఉన్నారు. ఈ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. మొత్తంగా పదో తరగతి ఫలితాల్లో 93.90 శాతం ఉత్తీర్ణత సాధించి మూడోసారి జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంతో రాష్ట్ర స్థాయిలో ‘మన్యం’ పేరు మార్మోగుతోంది.

అత్యధిక మార్కులు కైవసం...

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన టెన్త్‌ విద్యార్థులు అత్యధిక మార్కులను కైవసం చేసుకున్నారు. సాలూరు బాలికల హైస్కూల్‌కు చెందిన పి.తేజస్వి 592 మార్కులు సాధించింది. పార్వతీపురం పట్టణానికి చెందిన టీఆర్‌ఎం హైస్కూల్‌కు చెందిన తుంబలి చికీర్ష 591 మార్కులు, కురుపాం జడ్పీ పాఠశాలకు చెందిన ఎం.రిషిత 591 మార్కులు, భామిని మండలం ఏపీ మోడల్‌ స్కూల్‌కు చెందిన పి.జగదీష్‌ 590 మార్కులు సాధించారు.

సత్తా చాటిన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు

పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో 2,218 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 2,150 మంది పాసయ్యారు. ఇందులో 37 ఆశ్రమ పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 24 ఆశ్రమ పాఠశాలలు, సీతంపేట ఐటీడీఏలో 17 ఆశ్రమ పాఠశాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. గురుకుల పాఠశాలలో 638 మంది పరీక్షలకు హాజరుకాగా 624 మంది పాసయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరిలో ఉన్న బాలుర, కొమరాడ బాలికల, సీతంపేట మండలం మల్లి, గురుకుల పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి.

ఫలించిన కృషి..

ఉత్తమ ఫలితాల సాధనలో జిల్లా అధికారుల కృషి ఫలించింది. ప్రతీ పాఠశాలకు ప్రత్యేక అధికారులను నియమించడం, వారి పర్యవేక్షణలో టెన్త్‌ విద్యార్థుల విద్యా ప్రమాణాలను ఎప్పటి కప్పుడు పరిశీలించడం వంటి చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. వంద రోజుల ప్రణాళిక, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ఉపాధ్యాయులు, విధ్యాశాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో వడంతో టెన్త్‌ ఫలితాల్లో వరుసగా మూడోసారి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని నిలబెట్టుందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మన్యం జిల్లా ఈ ఘనత సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. జిల్లా విద్యార్థులు మంచి మార్కులతో పాసై జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో నిలిపారన్నారు. విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల ప్రత్యేకాధికారులు సంయుక్త కృషి వల్ల మంచి ఫలితాలను సాధించా మని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. పదో తరగతిలో విజయం సాధించిన విద్యార్థులను అభి నందించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మంచి ఫలితాలు సాధించామమని ఇన్‌చార్జి డీఈవో రమాజ్యోతి తెలిపారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో శతశాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందని డీడీ కృష్ణవేణి చెప్పారు.

Updated Date - Apr 23 , 2025 | 11:36 PM