Ganja Route ఇదే గంజాయి మార్గం
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:18 PM
This is the Ganja Route గంజాయి రవాణాదారులకు ఒడిశా రాష్ట్రం కోరాపుట్ రహదారి రాజమార్గంగా మారింది. పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టును తప్పిం చుకుని.. విశాఖ-రాయ్‌పూర్ నూతన హైవే మీదుగా ఒడిశాకు వారు గంజాయి రవాణా చేస్తున్నారు.

ఒడిశా రాష్ట్రం నుంచి దిగుమతి
పాచిపెంట, సాలూరు మీదుగా విశాఖకు తరలింపు
ప్రత్యేక నిఘాతో దూకుడు పెంచిన జిల్లా పోలీసులు
మూడు నెలల్లో భారీగా కేసుల నమోదు
చెక్‌పోస్టులు పెంచితేనే మరింత కట్టడి
పార్వతీపురం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణాదారులకు ఒడిశా రాష్ట్రం కోరాపుట్ రహదారి రాజమార్గంగా మారింది. పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టును తప్పిం చుకుని.. విశాఖ-రాయ్‌పూర్ నూతన హైవే మీదుగా ఒడిశాకు వారు గంజాయి రవాణా చేస్తున్నారు. అదే మార్గంలో తిరుగు ప్రయాణమై.. సాలూరు మీదుగా విశాఖ వరకు అక్రమ రవాణా చేస్తున్నారు. నూతన హైవేలో పెద్దగా తనిఖీలు లేకపోవడంతో గంజాయి రవాణాదారులు ఇష్టారాజ్యంగా తమ దందా కొనసాగిస్తున్నారు.
పోలీసుల ప్రత్యేక నిఘా
గత వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో గంజాయి రవాణా కొందరికి ప్రధాన ప్రధాన వృత్తిగా మారింది. దీంతో పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా రవాణా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. సర్కారు ఆదేశాలతో పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేక నిఘా పెట్టి రవాణాదారుల ఆటకట్టిస్తున్నారు. జిల్లాలో ఇటీవల నమోదైన కేసులే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
నమోదైన కేసులు..
- గంజాయి రవాణాకు సంబంధించి 2023లో 14 కేసులు నమోదు చేశారు. 205 కేజీలను స్వాఽధీనం చేసుకొని 28 మందిని అరెస్టు చేశారు. ఐదు వాహనాలను సీజ్ చేశారు.
- 2024లో 39 కేసులు నమోదు చేసి 736 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిని అరెస్టు చేసి పది వాహనాలను సీజ్ చేశారు.
- ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేసి 1115 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పాచిపెంట మండలంలో స్వాధీనం చేసుకున్న గంజాయి ఎక్కువగా ఉంది. జనవరిలో పాచిపెంటలో 670 కేజీలు, పాచిపెంట-సాలూరు మండలాల్లో ఫిబ్రవరి నెలలో 157 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెలలో 288 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే 1115 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉందంటే పోలీసులు ఏ విధంగా నిఘా పెంచారో స్పష్టంగా కనిపిస్తుంది.
చెక్‌పోస్టులు పెంచితే ...
గంజాయి రవాణా కట్టడికి జిల్లాలో చెక్‌పోస్టులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం జిల్లాలోని పాచిపెంట మండంలోని పి.కోనవలస, కొమరాడ మండలం కూనేరు, భామిని మండలం బత్తిలి, గుమ్మలక్ష్మీపురంలో చెక్ పోస్టులు ఉన్నాయి. వాటికి అదనంగా పార్వతీపురం మండలం ఆర్‌కే బట్టివలస వద్ద, సాలూరు నుంచి ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌కు వెళ్లే మార్గంలో, విశాఖ-రాయ్‌పూర్ నూతన రహదారి ప్రాంతంలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా చోట్ల పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాల్సి ఉంది. అత్యధికంగా గంజాయి రవాణా దారులు పాచిపెంట రహదారి గుండానే అక్రమ రవాణా సాగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో నిఘా మరింత పెంచాల్సి ఉంది.
రెండు కార్లు.. 134 ప్యాకెట్లు
పాచిపెంట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండల పరిధి గ్రీన్‌ఫీల్డ్ రహదారి గోగాడవలస జంక్షన్ వద్ద శనివారం 258 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దాని విలువ రూ.25.85 లక్షలు ఉంటుందని వారు అంచనా వేశారు. కాగా తొలుత ఆ ప్రాంతంలో అనుమానా స్పదంగా రెండు కార్లు ఉన్నట్లు ఇన్‌చార్జి వీఆర్‌వో డి.రవిరాజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ వెంకటసురేష్, సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే రవాణాదారులు పరారయ్యారు. రెండు కార్లులో 134 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని వాహనాలనూ సీజ్ చేశారు. రెండు కార్లులో కొన్ని పేపర్లు దొరికాయని, వాటి ఆధారంగా రవాణాదారులను పట్టుకుంటామని సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ తెలిపారు. ఒడిశా ప్రాంతం మల్కన్‌గిరి, పాడువ గ్రామాల నుంచి ఆంధ్రాకు గంజాయిని దిగుమతి చేస్తున్నారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నాలుగు కేసుల్లో 1100 కేజీల గంజాయి పట్టుబడిం దని వీటి విలువ రూ. 1.40 కోట్లు వరకు ఉంటుందని వెల్లడించారు. ఐదు ఫోర్ వీలర్ వాహనాలను సీజ్ చేశామని, 12 మంది ముద్దాయిలను అరెస్టు చేశామని చెప్పారు. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు వద్ద చెక్‌పోస్టు ఉన్నప్పటికీ గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై, కొఠియా వైపు కూడా నిఘా పెట్టామని తెలిపారు.
కట్టడికి చర్యలు
గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా పెట్టాం. చెక్‌పోస్టులు, పెట్రోలింగ్ ద్వారా ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నాం.
- మాధవరెడ్డి, ఎస్పీ, పార్వతీపురం మన్యం జిల్లా