Share News

High Drama! మూడు గంటలు.. హైడ్రామా!

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:07 AM

Three Hours of High Drama! పాలకొండ మండల ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం హైడ్రామా నెలకొంది. సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ వైసీపీ ఎంపీటీసీలతో హాజరయ్యారు. దీనిపై కూటమి ఎంపీటీసీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

  High Drama! మూడు గంటలు.. హైడ్రామా!
ఎంపీడీవోతో వాగ్వివాదం చేస్తున్న ఎమ్మెల్సీ

కూటమి ఎంపీటీసీలు, అధికారుల అభ్యంతరం

నిబందనలకు విరుద్ధమని వెల్లడి

లిఖితపూర్వకంగా తెలపడంతో వెనుదిరిగిన వైనం

పాలకొండ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): పాలకొండ మండల ప్రజా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం హైడ్రామా నెలకొంది. సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ వైసీపీ ఎంపీటీసీలతో హాజరయ్యారు. దీనిపై కూటమి ఎంపీటీసీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎంపీడీవో వి.రంగారావు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా.. తనకు లిఖితపూర్వకంగా ఇస్తే సమావేశం నుంచి వెనుదిరుగుతానని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 44 ప్రకారం.. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేకు ఎటువంటి హక్కులు ఉంటాయో, తనకూ కూడా అవే వర్తిస్తాయని చెప్పారు. ‘ అయితే పాలకొండ మండలంలో ఎమ్మెల్సీకి ఓటు హక్కు లేదు. వీరఘట్టం మండలంలో ఉన్నందున అక్కడ సమావేశంలో మాత్రమే హాజరవ్వొచ్చు. పంచాయతీరాజ్‌ చట్ట ప్రకారం.. ఎమ్మెల్సీ పాలకొండ సర్వసభ్య సమావేశానికి హాజరవ్వడం నిబంధనలకు విరుద్ధం.’ అని ఎంపీడీవో, కూటమి ఎంపీటీసీ సభ్యులు వెల్లడించారు. ఏదేమైనా తనకు తనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఎమ్మెల్సీ పట్టుపట్టారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశానికి హాజరైన అధికారులు, ఎంపీటీసీలు నిరీక్షించారు. ఆ తర్వాత ఎంపీడీవో లిఖితపూర్వకంగా ఎమ్మెల్సీకు సమాధానం ఇచ్చారు. మరోవైపు సీఐ చంద్రమౌళి, ఎస్‌ఐలు ప్రయోగమూర్తి, కళాధర్‌ అక్కడుకు చేరుకుని సమావేశ మందిరం నుంచి వెళ్లాలని ఎమ్మెల్సీ విక్రాంత్‌కు సూచించారు. లేకుంటే లాఅండ్‌ ఆర్డర్‌ సమస్య తలెత్తే అవకాశం ఉందని వివరించారు. ఈక్రమంలో వైసీపీ, కూటమి ఎంపీటీసీల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వైసీపీ ఎంపీటీసీలతో కలిసి ఎమ్మెల్సీ సమావేశ మందిరం నుంచి వెనుదిరిగారు. అనంతరం ఎంపీపీ బొమ్మాళి భాను ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మండల సమావేశం నిర్వహించారు.

సమయాన్ని వృథా చేశారు..

పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన లేకుండా ఎమ్మెల్సీ విక్రాంత్‌ పాలకొండ మండల పరిషత్‌ సమావేశానికి హాజరై ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సమయాన్ని వృథా చేశారని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. సమావేశానికి హాజరయ్యే అర్హత, ఆహ్వానం లేనప్పటికీ ఎమ్మెల్సీ వచ్చి రసాభాస చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ తీరు అభ్యంతరకరమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని, వాటిని చూసి తట్టుకోలేక ఎమ్మెల్సీ విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే కళావతి రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీ అనిల్‌కుమార్‌, ప్రత్యేక ఆహ్వానితులు జాడ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2025 | 12:07 AM