Three Weeks of Agitation మూడు వారాలుగా మొరాయింపు
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:42 PM
Three Weeks of Agitation జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ సమస్య నెలకొంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత మూడు వారాలుగా ఈ సమస్య వేధిస్తుండడంతో రెవెన్యూ కార్యాలయాల్లో ఏ పనులూ కావడం లేదు.
రైతులకు తప్పని ఇబ్బందులు
గరుగుబిల్లి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ సమస్య నెలకొంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత మూడు వారాలుగా ఈ సమస్య వేధిస్తుండడంతో రెవెన్యూ కార్యాలయాల్లో ఏ పనులూ కావడం లేదు. భూముల రికార్డులు, రైతుల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో కనిపించడం లేదు. ప్రధానంగా మ్యూటేషన్లు, మార్పులు, చేర్పులు, అడంగళ్ సవరణతో పాటు ఫోన్ నెంబర్లు అనుసంధానం వంటి కార్యక్రమాలు నిలిచాయి. వెబ్‌ల్యాండ్‌లో ఆన్‌లైన్ సర్వర్ సమస్య కారణంగా సకాలంలో రైతులు సంబంధిత బ్యాంకుల్లో రుణాలు పొందలేని పరిస్థితి నెలకొంది. భూములకు సంబంధించి 1బీలు అందుబాటులో లేకపోవడంతో రుణాలు చెల్లింపులు, రెన్యువల్ వంటి అవకాశాలకు దూరమవు తున్నారు. రైతులు తమ రుణాలకు వడ్డీ, చక్ర వడ్డీలు కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తహసీల్దార్ కార్యాలయాల్లో సిబ్బంది నిత్యం కంప్యూటర్లు ముందు కుస్తీ పడుతున్నారు. అయినా సర్వర్ సమస్య తేలకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యూటేషన్లకు తహసీల్దార్లు బయోమెట్రిక్ వేస్తున్నా ఫలితం ఉండడం లేదు. దీనిపై గరుగుబిల్లి తహసీల్దార్ పి.బాలను వివరణ కోరగా.. సర్వర్ సమస్య కారణంగా పలు రకాల ఫైళ్లు ముందుకు వెళ్లడం లేదన్నారు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.