Share News

Tribal People గిరిజనుల గొంతెండుతోంది!

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:53 PM

Tribal People Throats Are drying! సీతంపేట ఏజెన్సీలో గిరిపుత్రుల గొంతులెండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఊట బావులు, చలమల్లో నీరు ఎండిపోయింది.

Tribal People గిరిజనుల గొంతెండుతోంది!
కొండ దిగువ ప్రాంతం నుంచి నీరు తీసుకొస్తున్న అంటిమానుగూడ గ్రామ మహిళలు

చుక్కనీరివ్వని గ్రావిటేషన్లు

కొన్నిచోట్ల పనిచేయని బోర్లు, సోలార్‌ వాటర్‌ స్కీములు

ఎండల తీవ్రత దృష్ట్యా ఎండిన ఊటలు, చలమలు

వేసవి ప్రారంభంలోనే గిరిపుత్రులకు తప్పని ఇబ్బందులు

సమస్య పరిష్కరించాలని విన్నపం

సీతంపేట రూరల్‌, మార్చి23(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో గిరిపుత్రుల గొంతులెండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఊట బావులు, చలమల్లో నీరు ఎండిపోయింది. గ్రావిటేషన్లు చుక్కనీరివ్వడం లేదు. కొన్ని చోట్ల బోర్లు, సోలార్‌ వాటర్‌ స్కీములు పనిచేయడం లేదు. దీంతో బిందెడు నీటి కోసం వారు కొండ ఎక్కి దిగాల్సి వస్తోంది. కొండ దిగువన ఉన్న గిరిజన గ్రామాల్లో కొంత వరకు పరిస్థితి మెరుగ్గానే ఉంది. గిరిశిఖర గ్రామాలకు మాత్రం వేసవి కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు వేసవితాపం మరోవైపు రహదారి కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

సీతంపేట మన్యంలో 53 పంచాయతీల పరిధిలో 516 గిరిజన గ్రామాలు ఉన్నాయి. గ్రావిటేషన్‌ ఫ్లో పథకం ద్వారా ఇంతవరకు ఆయా గ్రామాలకు నీరు అందుతూ వస్తోంది. అయితే ఎండలు మండుతుండడంతో ప్రస్తుతం చుక్కనీరు రావడం లేదు. కాగా ఏజెన్సీ ప్రాంతంలో సుమారు వందకు పైగా గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. మార్చి నెలలోనే ఈ పరిస్థితి ఉందంటే రానున్న ఏప్రిల్‌, మే నెలలో ఇంకెలా ఉంటుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలు

కొండాడ, దారపాడు, పూతికవలస, చినబగ్గ, పెదరామ, చింతాడ, శంభాం, చాకలిగూడ, కిండంగి పంచాయతీల పరిధిలో అంటిమానుగూడ, చీడిమానుగూడ, గెద్దగూడ, జేపి లాడ, లాడ, గొలుకుప్ప, దబర, పూతికగూడ, ఈతమానుగూడ, బీరపాడు, లోకొత్తవలస, జాతాపు పొంజాడ తదితర గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ గ్రామాల్లో చాలా వరకు ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉన్నాయి.

అధికారిక లెక్కలు ఇలా..

సీతంపేట మన్యంలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గిరిజన గ్రామాలు తక్కువగానే ఉన్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ నివేదికల ద్వారా తెలుస్తోంది. మండలంలో 16 పంచాయతీల్లోని 475 హేబిటేషన్లలో కేవలం 16 గ్రామాల్లో మాత్రమే నీటి ఎద్దడి ఉన్నట్లు రికార్డుల్లో చూపారు. కానీ వాస్తవానికి చాలా గిరిజన గ్రామాల్లో గిరిజనులు చుక్క నీటి కోసం అల్లాడుతున్నారు. సోలార్‌ వాటర్‌ ట్యాంక్‌లు, గ్రావిటేషన్‌ ఫ్లో పథకాల నుంచి నీరు రావడం లేదు. దీంతో గిరిజన మహిళలు, చిన్నారులు సుదూర ప్రాంతాలకు వెళ్లి గెడ్డలు, బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.

అధికారులు గుర్తించిన గ్రామాలు..

దారపాడు, కిరప, నాయకమ్మగూడ, చిన్నబగ్గ, దారబ, దారపాడు, దేవనాపురం, హడ్డుబంగి, పెద్దగూడ, పెదరామ పంచాయతీల పరిధిలో గొలుకుప్పగూడ, పెద్దగూడ, మర్రిమానుగూడ, ఎగువ సంకిలి, ఎగువ దారబ, చింతమానుగూడ, రామానగరం పెద్దగూడ, జేపి జంతలగూడ, జేపి మధ్యగూడ, జేపి రామన్నగూడ, అయ్యప్పగూడ, లంబగూడ, దబర, ఒవ్వుమానుగూడ, బూతాయిగూడ, మొగదారగూడలో నీటి ఎద్దడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే వేరేలా ఉంది. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి గ్రామాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

ఎందుకీ తాత్సారం

- గిరిపుత్రులు ఏటా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అటు ఐటీడీఏ, ఇటు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ అధికారులు విఫలమవు తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై గిరిజనులు ఐటీడీఏ గ్రీవెన్స్‌లో ఎన్నిసార్లు వినతులు ఇచ్చిన స్పందించే వారే కరువయ్యారు.

- ఏటా మండు వేసవిలో గిరిశిఖర గ్రామాలకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే వారు. అయితే ఈ ఏడాది అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఉన్న కొద్దిపాటి నీటి లభ్యత కూడా పూర్తిగా అడుగంటే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఉన్నతాధికారులు స్పందించి గిరిశిఖర గ్రామాలకు శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం..

తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామంలో గ్రావిటేషన్‌ ఫ్లో పథకం పనిచేయడం లేదు. కొండదిగువన ఉన్న బావి వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. దీనిపై ఐటీడీఏ అధికారులు స్పందించాలి.

- సవర సురేష్‌, అంటిమానుగూడ

===========================

శాశ్వత పరిష్కారం చూపాలి..

గిరిజన ప్రాంతాల్లో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. బోర్లు, సోలార్‌ వాటర్‌ స్కీంలకు మరమ్మతులు చేయించాలి. మిగిలిన గ్రామాలకు ఐటీడీఏ ద్వారా ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాలి.

- జి.శ్రీరాములు, గిరిజన సంఘం నాయకుడు, కోసంగి

===========================

ప్రతిపాదనలు పంపించాం..

నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గిరిజన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు గాను రూ.4.9లక్షల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. సర్పంచ్‌ల సహకారంతో పంచాయతీ నిధులతో కూడా ఆయా గ్రామాల పరిధిలో ఉన్న బోర్లు, గ్రావిటేషన్‌ ఫ్లోలు, సోలార్‌ వాటర్‌ స్కీంలకు మరమ్మతులు చేయిస్తాం.

- మధుసూదనరావు, డీఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

Updated Date - Mar 23 , 2025 | 11:53 PM