What about those 47 acres? ఆ 47 ఎకరాలు ఏమైనట్టో?
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:00 AM
What about those 47 acres? విజయనగరం రాజుల కాలంలో ధర్మవరంలో నిర్మితమైన చెన్నకేశవస్వామి ఆలయం అంటే ఎస్.కోట చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలియని వారుండరు. ఈ ఆలయానికి ఎంతో వైభవం ఉండేది. ఆలయ నిర్వహణకు అప్పట్లో రాజులు 141 ఎకరాలు ఇచ్చారు. వాటిపై వచ్చే ఆదాయంతో స్వామికి ధూపదీప నైవేద్యాలు.. అభిషేకాలు.. యజ్ఞాలు.. పురోహితులకు వేతనాలు దక్కేవి. కాలక్రమంలో స్వామికే దయనీయ పరిస్థితి తలెత్తింది. ఆలయ భూములను వివాదాలు చుట్టుముట్టాయి. కోర్టు కేసుల్లో 53 ఎకరాలుంది. 47 ఎకరాల సంగతేంటో అంతు చిక్కడం లేదు. ఎవరెవరి ఆక్రమణలో ఉన్నాయో అధికారులు తేల్చడం లేదు. ఆఖరికి అంత పేరున్న ఆలయంలో అర్చకులకు ఐదేళ్లుగా వేతనాలు అందడం లేదు.
ఆ 47 ఎకరాలు ఏమైనట్టో?
చెన్నకేశవ స్వామి ఆలయ భూముల్లో ఆక్రమణలు
దశాబ్దకాలంగా కానరాని రికార్డులు
కోర్టులో మరో 53 ఎకరాల వివాదం
41 ఎకరాలకే శిస్తు వసూలు
ఆర్చకులకు ఐదేళ్లుగా అందని వేతనాలు
విజయనగరం రాజుల కాలంలో ధర్మవరంలో నిర్మితమైన చెన్నకేశవస్వామి ఆలయం అంటే ఎస్.కోట చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలియని వారుండరు. ఈ ఆలయానికి ఎంతో వైభవం ఉండేది. ఆలయ నిర్వహణకు అప్పట్లో రాజులు 141 ఎకరాలు ఇచ్చారు. వాటిపై వచ్చే ఆదాయంతో స్వామికి ధూపదీప నైవేద్యాలు.. అభిషేకాలు.. యజ్ఞాలు.. పురోహితులకు వేతనాలు దక్కేవి. కాలక్రమంలో స్వామికే దయనీయ పరిస్థితి తలెత్తింది. ఆలయ భూములను వివాదాలు చుట్టుముట్టాయి. కోర్టు కేసుల్లో 53 ఎకరాలుంది. 47 ఎకరాల సంగతేంటో అంతు చిక్కడం లేదు. ఎవరెవరి ఆక్రమణలో ఉన్నాయో అధికారులు తేల్చడం లేదు. ఆఖరికి అంత పేరున్న ఆలయంలో అర్చకులకు ఐదేళ్లుగా వేతనాలు అందడం లేదు.
శృంగవరపుకోట రూరల్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి):
ధర్మవరం చెన్నకేశవస్వామి మహిమ కలవారని భావించి ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి అప్పట్లో ఎడ్లబళ్లుపై వచ్చి స్వామిని దర్శించుకొని పూజలు చేసుకునేవారు. ప్రత్యేక రోజుల్లో ఆలయం భక్తులతో కోలాహలంగా ఉండేది. ఆదాయం రావడంతో స్వామికి అన్ని రకాల కైంకర్యాలు వైభవోపేతంగా సాగేవి. ధర్మవరం గ్రామంలో నిత్యం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేది. కాలక్రమంలో ఆ కళ తప్పింది. దశాబ్దాల కిందట కొంత ఆలయ భూమిని విశాఖ జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు చౌక ధరకు చేజెక్కించుకున్నారు. ఇంకొన్ని భూములు ఆక్రమణల్లో ఉన్నాయి. అయితే దశాబ్దం క్రితం ఈ ఆలయ భూములపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురించింది. అప్పట్లో దేవదాయశాఖ స్పందించి ప్రత్యేకంగా సర్వే చేయించి 41 ఎకరాలు గుర్తించింది. ప్రస్తుతం ఈ భూముల నుంచి మాత్రమే ఎకరం వద్ద రూ.1500 చొప్పున శిస్తు వసూలవుతోంది. కాగా 53 ఎకరాలకు సంబంధించి ఆయా వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో ఆ భూమి కేసుల్లో ఉండిపోయింది. అప్పట్లో 41 ఎకరాలను గుర్తించిన దేవదాయశాఖ వివాదం లేని మిగతా 47 ఎకరాల సంగతి తేల్చలేదు. రాజకీయ ఒత్తిడితో వదిలేశారన్న విమర్శ ఉంది. ఆ తర్వాత ఆ భూముల రికార్డులను మార్చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే ఈవోలు సన్యాసేశ్వర స్వామి ఆలయ ఆదాయం, ఖర్చులపై శ్రద్ధ పెడుతున్నారు కానీ చెన్నకేశవస్వామి ఆలయ భూములను గుర్తించే ప్రయత్నం చేయడం లేదు.
పరుల చేతిలో 53 ఎకరాలు
స్వామివారికి చెందిన 141 ఎకరాల్లో కొంతమంది వ్యక్తులు ఈ భూములు తమవని, అర్చకుల దగ్గర కొన్నామని చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు. సుమారు 20ఏళ్లుగా ఈకథ నడుస్తోంది. అసలు దేవదాయశాఖ భూములు ఎలా కొంటారు.. ఎవరు అమ్ముతారు అనేది దేవదాయశాఖ అధికారులే తేల్చాలి. ఇదిలా ఉండగా ఆంధ్రజ్యోతి కథనాలతో అప్పట్లో గుర్తించిన 41 ఎకరాల నుంచి శిస్తును సక్రమంగా వసూలు చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
వేతనాలకు నోచని అర్చకులు
చెన్నకేశవస్వామి ఆలయాన్ని ఏడాదికి ఒక అర్చక కుటుంబం చూస్తోంది. ఈ ఏడాది పేరంబధూర్ తేజావతి కుటుంబం నిర్వహిస్తోంది. అయితే గడిచిన నాలుగేళ్లుగా ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న తమ కుటుంబానికి ఒక్కరూపాయి జీతం ఇవ్వలేదని తేజోవతి వాపోయారు. జీతాల విషయంపై విజయవాడ వెళ్లి కమిషనర్‌కు మొరపెట్టుకున్నా మార్పులేదని, జిల్లా అధికారులూ పట్టించుకోలేదని, స్థానిక ఈవోలను అడిగితే రిపోర్టులు రాస్తాం జీతం అకౌంట్‌లో పడుతుందని చెప్పుకొస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
- చెన్న కేశవస్వామి ఆలయ భూముల విషయంపై ఆలయ ఈవో ప్రసాదరావు వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానని, అవగాహన లేదని అన్నారు. త్వరలోనే సర్వే చేసి అన్యాక్రాంతంలో ఉన్న 47 ఎకరాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆలయ అర్చకుల జీతాల అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.