What's the Use of Working? పనిచేసినా.. ఏం లాభం?
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:38 PM
What's the Use of Working? ఉపాధి పనులు చేస్తున్నా.. మస్తర్లలో హాజరు వేయడం లేదని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తురకనాయుడువలస పనుల ప్రదేశంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
జియ్యమ్మవలస, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఉపాధి పనులు చేస్తున్నా.. మస్తర్లలో హాజరు వేయడం లేదని వేతనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తురకనాయుడువలస పనుల ప్రదేశంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు, మేట్లు నిర్వాహకం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ పి.నాగమణి తెలిపారు. ‘ గ్రామంలో మొత్తం 550 మందికి పైగా కూలీలు ఉన్నారు. వీరి కోసం గ్రామ సమీపంలో తోటపల్లి ఎడమ ప్రధాన కాలువలో, దాని పక్కనే ఉన్న జన్ని బందలో పనులు కల్పించారు. సోమవారం దాదాపు 400 మంది వరకు కూలీలు ఉపాధి పనులకు వెళ్లారు. అయితే ఇందులో కొందరు పనికి వెళ్లినా మేట్లు అటెండెన్స్ వేయలేదు.’ అని సర్పంచ్ చెప్పారు. క్షేత్ర సహాయకుడు, మేట్లు ఒక్కటై.. కూలీల నుంచిడబ్బులు వసూలు చేస్తున్నట్లు సామాజిక తనిఖీ బృందానికి, కలెక్టర్, ఉపాధి హామీ పథకం పీడీ, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వేతనదారులు డిమాండ్ చేశారు. లేకుంటే బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.