పండగలోగా పనులు పూర్తయ్యేనా?
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:33 PM
సాలూరు గ్రామదేవత శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాలు మరో నెల రోజుల్లో ప్రారంభంకానున్నాయి.
- శ్యామలాంబ ఉత్సవాలకు నెలరోజులే సమయం
- సాలూరు మునిసిపాలిటీలో కానరాని రోడ్ల నిర్మాణం
-నిధులున్నా నిర్లక్ష్యమెందుకో?
- భక్తుల్లో ఆందోళన
సాలూరు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): సాలూరు గ్రామదేవత శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాలు మరో నెల రోజుల్లో ప్రారంభంకానున్నాయి. మే 18,19,20 తేదీల్లో అమ్మవారి పండగను జరిపేందుకు ముహూర్తలు సైతం తీశారు. 15 ఏళ్ల తరువాత శ్యామలాంబ ఉత్సవాలు జరగనుండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ముఖ్యంగా రహదారుల నిర్మాణం జరగడం లేదు. నిధులున్నా పనులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 2022-23లో మొదటి విడత అన్‌ట్రైడ్ గ్రాంట్ కింద రూ.68 లక్షలతో పది తారు రోడ్ల నిర్మాణానికి ప్రతి పాదించారు. గతేడాది నవంబరులో పాలకవర్గం కూడా ఆమోదించింది. అత్యవసర పనులుగా భావించి అధికారులు కార్యనిర్వాహక ఇంజనీర్‌కు పంపించారు. అనుమతులు ఆలస్యంగా రావటంతో ఇప్పటి వరకు టెండర్లు కూడా పిలవలేదు. శ్యామలాంబ ఉత్సవాలకు నెలరోజులే గడువు ఉండడంతో అప్పటి లోగా పనులు పూర్తిచేస్తారా? లేదా అని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ పరిస్థితి..
సాలూరు శివాజీ బొమ్మ కూడలి నుంచి నాయుడువీధి, వేదసమాజం మీదుగా గాంధీనగర్ వరకు తారు రోడ్డు నిర్మాణానికి ఆరు నెలల కిందట శంకుస్థాపన చేశారు. దీనికి మూడేళ్ల కిందటే రూ.24 లక్షలు కేటాయించారు. కానీ, ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. ఈ మార్గంలో అమ్మవారి సిరిమానోత్సవం జరగనుంది. రోడ్డు పనులు ఇప్పటి వరకు చేయకపోవడంతో గుంతల దారిలో సిరిమాను తిప్పక తప్పదా..?అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. రూ.16 లక్షలతో ఎన్టీఆర్ కూడలి నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు జంక్షన్ వరకు, రూ.10 లక్షలతో రైల్వేస్టేషన్ కూడలి నుంచి మక్కువ బైపాస్ రోడ్డు వరకు, రూ.9 లక్షలతో పెదకోమటిపేట రోడ్డు నుంచి చిట్లువీధికి, రూ.16 లక్షలతో శివాజీ బొమ్మ జంక్షన్ నుంచి జూనియర్ కాలేజీకి, రూ.12 లక్షలతో రామాకాలనీ, క్రిస్టియన్‌కాలనీ నుంచి వివేకానంద స్కూల్ వరకు, రూ.10లక్షలతో బంగారమ్మకాలనీ అంజనేయస్వామి అలయం నుంచి మజ్జులపేట రిజర్వాయర్ వరకు, రూ.10 లక్షలతో రామాకాలనీ నుంచి లక్ష్మీ అపార్ట్‌మెంట్స్ వరకు, రూ.10 లక్షలతో అటవీశాఖ కార్యాలయం నుంచి నీటి పథకం వరకు రోడ్లు నిర్మించాల్సి ఉంది. అయితే, నిధులు ఉన్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా పనులు ప్రారంభం కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ఐదేళ్లూ నిర్లక్ష్యం..
గత వైసీపీ ప్రభుత్వం సాలూరు పట్టణ అభివృద్ధిని పట్టించుకోలేదు. ఐదేళ్ల పాలనలో పట్టణ రోడ్ల అభివృద్ధికి రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. కాలువల్లో పూడికలు తీసిన దాఖలాలు లేవు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తారు, సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మునిసిపాల్టీ రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చింది. పూడికలతో నిండిపోయిన కాలువలను శుభ్రం చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా పట్టణంలో 12 హెవీ కెపాసిటీ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను బిగిస్తున్నారు. సుమారు 52 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.
త్వరలో పనులు ప్రారంభిస్తాం
మునిసిపాల్టీలో బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించి ప్రతిపాదనలు చేశాం. పాలకవర్గం ఆమోదం కూడా పొందాయి. టెండర్లు పిలవాలి. ఖరారైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఒకటి రెండు రోజుల్లో కొత్త కమిషనర్ వచ్చి విధుల్లో చేరుతారు.
-బీవీ ప్రసాద్, ఇన్‌చార్జి కమిషనర్, సాలూరు మునిసిపాల్టీ