కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:55 PM
మండలంలోని రావాడ పంచాయతీ గొల్లపేటకు చెందిన ఇప్పిలి వెంకయ్యమ్మ(39) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది.
భోగాపురం, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రావాడ పంచాయతీ గొల్లపేటకు చెందిన ఇప్పిలి వెంకయ్యమ్మ(39) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల మేరకు.. మండలంలోని రాజాపులోవకు చెందిన ఇప్పిలి వెంకయ్యమ్మకు, రావాడ గొల్లపేటకు చెందిన ఇప్పిలి రమణకు 2006లో వివాహమైంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. రమణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొన్నాళ్ల కిందట ఆటోను అమ్మేశాడు. మద్యానికి బానిసయ్యాడు. దాంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కొంత భూమి అమ్మేస్తానని పలువురి దగ్గర డబ్బులు తీసుకుని రమణ జల్సా చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు మొదలు కావడంతో వెంకయ్యమ్మ భవన నిర్మాణ పనులకు వెళ్తోంది. తల్లికి పెద్ద కుమారుడు మాధవ్ చేదోడుగా ఉంటున్నాడు. అయితే కుటుంబ కలహాలు పెరుగుతుండటంతో వెంకయ్యమ్మ మనస్తాపానికి గురైంది. గురువారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న సీఐ ఎన్వీ ప్రభాకర్, ఎస్‌ఐలు వి.పాపారావు, పిసూర్యకుమారి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి అన్నదమ్ములు చందక అప్పలనాయుడు, రామయ్య, సత్యనారాయణ.. కుటుంబ సభ్యులే చంపేశారని అనుమానం వ్యక్తం చేయడంతో క్లూస్ టీంను రప్పించారు. మృతురాలి భర్త రమణ, బావ నరసింహ వేధింపులు తాళలేక కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లి చందక పైడమ్మ ఆరోపించింది. పైడమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సూర్యకుమారి తెలిపారు.