Share News

3,600

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:45 AM

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పింఛన్‌ దారులకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించింది. జిల్లాకు సంబంధించి కొత్తగా 3,600 వితంతు పింఛన్లు మంజూరయ్యాయి.

3,600

జిల్లాకు కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లు

ఇప్పటి వరకు జిల్లాలో 68,200

కొత్తవి కలిస్తే మొత్తం 71,800

మే నుంచి పంపిణీకి ఏర్పాట్లు

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 25 (ఆంరఽధజ్యోతి): ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పింఛన్‌ దారులకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించింది. జిల్లాకు సంబంధించి కొత్తగా 3,600 వితంతు పింఛన్లు మంజూరయ్యాయి. వీటిని మే నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు డిసెంబరు నుంచి పింఛన్‌ పొందుతున్న భర్త మరణిస్తే భార్యకు ఆ పింఛన్‌ను మంజూరు చేయడం వల్ల వితంతు పింఛన్లు జిల్లాకు అధికంగా మంజూరైయ్యాయి. 2023, డిసెంబరు నుంచి 2024 అక్టోబరు వరకు దాదాపు 10 నెలల పాటు వితంతు పించన్‌ దరఖాస్తులను పరిశీలించి కొత్తవాటిని మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులై ఉండి వితంతు పింఛన్‌ రాని లబ్ధిదారులకు మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా కొంత మందికి పింఛన్లు తొలగించారు. అటువంటి వారికి కూడా మంజూరు చేయాలని బాధిత లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.మరోవైపు జిల్లాలో పీజీఆర్‌ఎస్‌లో ఇప్పటికీ కొత్త పింఛన్ల కోసం అర్హులైన లబ్దిదారులు దరఖాస్తులు చేస్తూనే ఉన్నారు. కొత్తవి మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది.

వితంతు పింఛన్లు 71,800

జిల్లాలో ఇప్పటివరకు వితంతు పింఛన్‌ లబ్ధిదారులు 68,200 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో 3,600 మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ సంఖ్య 71,800 వరకు పెరిగింది. కొత్తగా మంజూరు చేసిన వితంతు పింఛన్లు మేనెల నుంచి పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించి జాబితాలను మండలాలకు పంపించను న్నారు. కాగా జిల్లాకు కొత్తగా వితంతు పింఛన్‌లు మంజూరు చేయడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. ఒక్కొక్క పింఛన్‌ నాలుగు వేలు కాగా 3,600 పింఛన్‌లకు సంబంధించి కోటి 44 లక్షల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేశారు.

నిబంధనల్లో మార్పులు

ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వితంతు పింఛన్‌ పథకం నిబంధనలలో మార్పులు చేసింది. గతంలో భర్త మరణిస్తే భార్య వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చేది. పరిశీలనల మీద పరిశీలనలు జరిపి అన్ని అర్హతలు ఉన్నా మంజూరు అవుతుందో లేదో తెలియని పరి స్థితి ఉండేది. వలంటీర్ల వ్యవస్థ ద్వారానే గత ప్రభుత్వ హయాంలో పింఛ న్లు మంజూరు చేసేవారు. దీంతో ప్రజా ప్రతినిధులు చెబితేనే మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం వితంతు పింఛన్‌ల నిబంధనలలో మార్పులు చేసింది. భర్త మరణిస్తే భార్యకు వితంతు పింఛన్‌ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి దరఖాస్తు లేకుండానే మంజూరు చేయాలని నిర్ణయించింది. గతంలో మాదిరిగా పింఛన్‌ రావడానికి నిర్దిష్టమైన గడువు తేదీలను నిర్ణయించలేదు. ఇది పింఛన్‌దారులకు ఊరట నిచ్చే అంశం.

Updated Date - Apr 26 , 2025 | 12:46 AM