Share News

టెన్త్‌ ఉత్తీర్ణత 82.12%

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:36 AM

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రభుత్వ పాఠశాలలు గణనీయమైన ఉత్తీర్ణత సాధించాయి.

 టెన్త్‌ ఉత్తీర్ణత 82.12%

ఫలితాల్లో సత్తా చాటిన బాలికలు

అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

జిల్లాలో 21,539 మందికి 17,695 మంది ఉత్తీర్ణులు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రభుత్వ పాఠశాలలు గణనీయమైన ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో 21,539 మంది పరీక్షలు రాయగా 17,695 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 82.15. బాలురు 10,924 మందికి 8,612 (78.84 శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 10,615 మందికి 9,083 (85.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఫస్ట్‌ క్లాస్‌లో 14,174, సెకండ్‌ క్లాస్‌లో 2,340, థర్డ్‌ క్లాస్‌లో 1,181 మంది ఉన్నారు. జిల్లాలో గతం కంటే ఈ ఏడాది విద్యార్థులు అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 81.82 శాతం మంది పాస్‌ కాగా ఈసారి ఆ ఉత్తీర్ణత శాతం 82.15 శాతానికి పెరిగింది. గతంలో రాష్ట్రంలో 23వ స్థానంలో నిలవగా ఇప్పుడు ఏడు స్థానాలు పైకి ఎగబాకి 16వ ర్యాంకు సాధించింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించి టాప్‌ 10 మంది బాలికలే ఎక్కువ మంది ఉన్నారు. జిల్లాలో ప్రథమ స్థానంలో నరసాపురం ఎంజేపీఏపీబి సీడబ్ల్యు ప్రభుత్వ రెసిడెన్స్‌ స్కూల్‌ విద్యార్థిని రవి అశ్విని 592 మార్కులు సాధించి జిల్లా టాప్‌గా నిలిచి సత్తా చాటింది. ఆమెతోపాటు టాప్‌టెన్‌లో 8 మంది బాలికలే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలుగా నాలుగు ఉండగా 500లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 1,485 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 12,610 మంది విద్యార్థులకు గాను 9,090 మంది పాస్‌ కాగా, వారిలో ఉత్తీర్ణత 72.09 శాతంగా నిలిచారు. ప్రైవేటు పాఠశాలల్లో 8929 మంది పరీక్షలు రాయగా 8,605 మంది ఉత్తీర్ణతలో 96.37 ఉత్తీర్ణత సాధించారు.

రీ వెరిఫికేషన్‌ కోసం..

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఏదైనా అనుమానాలు ఉన్న విద్యార్థులు పరీక్ష పత్రాల రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 24 నుంచి మే ఒకటో తేదీ మధ్యాహ్నం 11 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో నారాయణ తెలిపారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.1000 సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ మున్సిపల్‌ జిల్లా పరిషత్‌ ఆన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉత్తీర్ణత కాని విద్యార్థుల నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజులు కట్టించుకునేందుకు ఏప్రిల్‌ 24 నుంచి 30 వరకు అవకాశం ఉందని డీఈవో తెలిపారు. అపరాధ రుసుం రూ.50 అదనంగా మే 1 నుంచి 18 వరకు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయా ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల టాపర్స్‌

స్థానం విద్యార్థి మార్కులు పాఠశాలలు

1. ఆర్‌.అశ్విని 592 నరసాపురం రెసిడెన్షియల్‌ స్కూల్‌

2. కొల్లి శాన్వి 590 ఆకివీడు జడ్పీ బాలుర హైస్కూల్‌

3. ఏఎస్‌ఎస్‌వీ కార్తీక్‌ 589 చిన అమిరం జడ్పీ హైస్కూల్‌

4. పడాల కావ్యశ్రీ 587 తణుకు బాలుర జడ్పీ హైస్కూల్‌

5. ఆకిరి ఝాన్సీ 587 అలంపురం జడ్పీ హైస్కూల్‌

6. సీహెచ్‌ వెంకటలక్ష్మి 587 ఆరుగొలను జడ్పీ హైస్కూల్‌

7. వటాది ప్రభాకర్‌ 587 సిద్దాపురం జడ్పీ హైస్కూల్‌

8. గొబ్బిళ్ల తేజస్విని 586 తాడేపల్లిగూడెం మున్సిపల్‌ హైస్కూల్‌

9. రెడ్డి నవ్య 586 వీరంపాలెం జడ్పీ హైస్కూల్‌

10 లిఖిత దుర్గ 586 కోపల్లె జడ్పీ హైస్కూల్‌

Updated Date - Apr 24 , 2025 | 01:36 AM