అమ్మోనియా గ్యాస్ లీక్.. ఐదుగురికి గాయాలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:16 AM
మోగల్లులోని వశిష్ట మెరైన్ రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకై మంగళవారం రాత్రి ఐదుగురికి గాయాలయ్యాయి.
పాలకోడేరు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి):మోగల్లులోని వశిష్ట మెరైన్ రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకై మంగళవారం రాత్రి ఐదుగురికి గాయాలయ్యాయి. రోజులానే కార్మికులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి ఒక్కసారిగా అమ్మోనియా గ్యాస్ లీకవడంతో ఆ ప్రాంతంలోని శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురికి బలమైన గాయాలయ్యాయి. వీరిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒక యువతిని ఐసీయులో ఉంచి చికిత్స చేస్తున్నారు. పాలకోడేరు పోలీసులను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారని, తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నట్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిందని తమకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.