Share News

చిత్తశుద్ధితో పని చేయండి

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:26 AM

సమన్వయం, చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.

చిత్తశుద్ధితో పని చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

అధికారుల తీరుపై కేంద్ర మంత్రి అసహనం

భీమవరం టౌన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): సమన్వయం, చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ (దిశ) సమావేశంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షించారు. సమీక్ష సమావేశాలకు కొంతమంది జిల్లా అధికారులు హాజరు కాకపోవడం, కింది స్థాయి అధికారులను పంపడంపై కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించే సమావేశాలకు జిల్లా స్థాయి హాజరు కాలేని పక్షంలో కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలన్నారు. అధికారులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోకుండా ప్రొటోకాల్‌ ప్రకారం నిబంధన మేరకు పనిచేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖ, ఆర్డబ్ల్యూఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖల ద్వారా చేపట్టిన పనులు ప్రగతి, ఖర్చు వివరాలపై కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అధికారుల వివరణ కోరారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి జడ్డు వెంకటేశ్వరరావు, సీపీవో కె.శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ ఎంఎస్‌ఎస్‌ వేణుగోపాల్‌, డీఈవో ఇ.నారాయణ, జిల్లా వైద్యాధికారి జి.గీతాబాయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రూ.23.75 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌

పీఎం ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ పథకంలో భీమవరం ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు రూ.23.75 కోట్లు మంజూరయ్యాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చేనెలలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. భీమవరంలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటుకు సహకరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు శ్రీని వాసవర్మ కృతజ్ఞతలు తెలిపారు. అమృత్‌ భారత్‌ పథకంలో తాడేపల్లిగూడెం, భీమవరం టౌన్‌, నరసాపురం రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. భీమవరం టౌన్‌ స్టేషన్‌లో రూ.32.37 కోట్లతో చేపట్టిన పనులు 55 శాతం పూర్తయ్యాయన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సీఎస్‌ఆర్‌ నిధులను తీసుకురావడం జరిగిందని, మరిన్ని నిధులను సాధించి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - Mar 29 , 2025 | 12:26 AM