థాంక్యూ సీఎం సర్
ABN , Publish Date - Apr 20 , 2025 | 01:04 AM
మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫి కేషన్ ఖరారైంది. అధికారికంగా ఆదివారం జారీ చేస్తా రు. ఆదివారం నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, మాక్ టెస్టు మే 20 నుంచి ఉంటాయి.
మెగా డీఎస్సీ – 2025 నోటిఫికేషన్ నేడే విడుదల
పాఠశాల విద్యలో 1035 పోస్టులు, జువనైల్ హోం స్కూలులో 7 పోస్టులు
సంక్షేమ పాఠశాలల్లో మరో 348 జోనల్ పోస్టులు
ఉపాధ్యాయ అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి):మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫి కేషన్ ఖరారైంది. అధికారికంగా ఆదివారం జారీ చేస్తా రు. ఆదివారం నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, మాక్ టెస్టు మే 20 నుంచి ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లు జూన్ ఆరు నుంచి జూలై 6వ తేదీ వరకు జరుగు తాయి. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెలువడిన ఈ నోటిఫికేషన్‌తో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆనందోత్సాహాల్లో మురిసిపోయారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంతకం చేసిన తొలిఫైలు మెగా డీఎస్సీనే కాగా, తొలుత ప్రకటించిన పోస్టులకంటే అదనంగా మరిన్ని యాజమాన్యాల్లోకూడా ఉపాధ్యాయ ఖాళీల ను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌లో పోస్టులను చేర్చడం బంపర్ ఆఫర్‌గా చెప్పవచ్చు. ఆ ప్రకారం పాఠశాలవిద్యాశాఖలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో ఆయా యాజమాన్యాలు, సబ్జెక్టుల వారీగా మొత్తం 1035 పోస్టుల భర్తీకి శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీచేశారు. వీటితోపాటు జువనైల్ హోం(బాలురు) పాఠశాలలో మరో ఏడు పోస్టులు, మూడు జిల్లాల పరిధిలోని వివిధ సంక్షేమ వసతి గృహాల పాఠశాలకు ఉద్దేశించిన 348 జోనల్ పోస్టులను మెగా డీఎస్సీలో భర్తీ చేసేలా నోటిఫై చేశారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ/జడ్పీ/మండల పరిషత్/మున్సిపల్ యాజమా న్యాల పాఠశాలల్లో మొత్తం 1035 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో ఫస్ట్ లాంగ్వేజి 42 పోస్టులు, సెకండ్ లాంగ్వేజి 61, ఇంగ్లీషు 84, గణితం 40, ఫిజికల్ సైన్సు 40, బయోలాజికల్ సైన్సు 64, సోషల్ స్టడీస్ 103, ఫిజికల్ ఎడ్యుకేషన్ 181 పోస్టులు, ఎస్జీటీ కేడర్‌లో 420 పోస్టులను నోటిఫై చేశారు.
కొత్తగా మరిన్ని పోస్టులు ఇలా..
ప్రభుత్వ బాలుర వసతి గృహం (జువనైల్ హోం) లకు మంజూరైన ఎస్జీటీ పోస్టుల్లో దశాబ్దాల కాలంగా డిప్యూటేషన్లపై టీచర్లతో బోదిస్తుండగా, తొలిసారిగా ఈ పోస్టులను శాశ్వతప్రాతిపదికన భర్తీ చేస్తూ మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో నోటిఫై చేయడం విశేషం. ఏలూరు రూరల్‌మండలం శనివారపుపేటలో ప్రభుత్వ బాలుర వసతి గృహం పాఠశాలకు 6 ఎస్జీటీ, ఒక వ్యాయామోపాధ్యాయుడు పోస్టులను భర్తీచేయడానికి నిర్ణయించారు. తొలుత ఉమ్మడిజిల్లాకు ప్రకటించిన 1035 పోస్టులకు ఇవి అదనం. ఈ పోస్టులతో కలిపితే మెగా డీఎస్సీలో ఉమ్మడి జిల్లా నుంచి భర్తీఅయ్యే ఉపాధ్యాయ పోస్టులసంఖ్య 1042కి పెరుగుతుంది. రాష్ట్రంలో ఏలూరు, విశాఖపట్నం, కడపలలో మాత్రమే జువనైల్ హోం పాఠ శాలలున్నాయి. ఇవి పోలీసు, మహిళా శిశు సంక్షేమ సంస్థలకు అనుబంధంగా ఏర్పాటు కాగా, పాఠశాలలకు బోదనాసిబ్బందిని మాత్రం విద్యాశాఖ నియమిస్తుంది.
మూడు జిల్లాల పరిధిలో జోనల్ ఉపాధ్యాయ పోస్టులు 348
జోన్–2 జిల్లాలైన ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని ఏపీ రెసిడెన్షియల్/ ఏపీ సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/గిరిజన గురుకుల పాఠశా లల్లో భోదనకు ప్రత్యేకంగా 49 పీజీటీ, 272 టీజీటీ, 3 పీడీ, 24 పీఈటీ పోస్టులు కలిపి మొత్తం 348 టీచరు నియామకాలను నోటిఫికేషన్‌లో చేర్చారు. ఈ పోస్టుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఎన్ని లభిస్తాయో సంబందిత శాఖల హెచ్‌వోడీలు ప్రకటించాల్సి ఉంది. జోనల్ పోస్టులుగా వీటిని పరిగణి స్తున్నందున ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు మూడు జిల్లాల పరిధిలో ఎక్కడైనా నియమితులయ్యే అవకాశం ఉంటుంది.