Share News

నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం

ABN , Publish Date - Apr 26 , 2025 | 01:14 AM

వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఏపీఈసీడీసీఎల్‌ దృష్టి పెట్టింది.

 నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి రూ.170 కోట్లతో ప్రతిపాదనలు

లోఓల్టేజీ నివారణకు చర్యలు

3చోట్ల 33/11 కెవి సబ్‌స్టేషన్లు

సోలార్‌ విద్యుత్‌ వినియోగించాలి

వినియోగదారుల సమస్యలపై అధికారులకు తక్షణ ఆదేశాలు

వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఏపీఈసీడీసీఎల్‌ దృష్టి పెట్టింది. జిల్లాలో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి రూ.170 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు చేశారు. లోఓలోల్టేజీ సమస్య పరిష్కారానికి జిల్లాలో 315 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికి 242 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. మరో 73 ట్రాన్స్‌ఫార్మర్లు రావాల్సి ఉంది. వేసవిలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ అందించడానికి ఏర్పాట్లు చేశారు.

1912కు ఫోన్‌ చేయండి

ఏవిధమైన విద్యుత్‌ సమస్యలకు అయిన 1912కి పోన్‌ చేస్తే తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటారు. సమస్య పరిష్కారం అయిన తరువాత కూడా మీకు పోన్‌ చేసి పరిష్కార వివరాలు తెలియజేస్తారు. 24గంటలు ఈ నెంబరు అందుబాటులో ఉంటుంది.అలాగే 9490610152 నెంబరుకు పోన్‌ చేసి మీ సమస్యను తెలుపవచ్చు.

3 సబ్‌ స్టేషన్లకు ప్రతిపాదనలు

జిల్లాలో పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా అందించేందుకు కొత్తగా 33.12కేవీ సబ్‌ స్టేషన్లు ప్రతిపాదించాం. యలమంచిలి మండలం మేడపాడు, కాళ్ళ మండలం కోనలపల్లిలో ఏర్పాటు చేయబోతున్నాం. మూడు చోట్ల సబ్‌స్టేషన్‌ నిర్మాణాలు పూర్త య్యాయి. పాలకొల్లు బ్రాడీపేటలో సబ్‌ స్టేషన్‌ ఈ నెల 30 నుంచి అందుబాటులోకి రానుంది. తాడేపల్లిగూడెం కస్పాపెంటపాడులో కొత్త సబ్‌స్టేషన్‌ వచ్చేనెల 15 నుంచి అందుబాటులోకి రానుంది. భీమవరం మండలం లోసరిలో సబ్‌స్టేషన్‌ మే నెలా ఖరునాటికి అందుబాటులోకి రానుంది.

భీమవరం టౌన్‌/అర్బన్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సరఫరాలో సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతాం, ఆయా ప్రాంతాలను డివిజన్‌ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఆలపాటి రఘునాథబాబు తెలిపారు. జిల్లాలో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి రూ.170 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. అవసరమైతే కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఆంధ్రజ్యోతి శుక్రవారం నిర్వ హించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమంలో విద్యుత్‌ వినియోగదా రుల సమస్యలపై ఆయన స్పందించారు. కొన్ని సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చారు. మరి కొన్ని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

జూ వేసవిలో విద్యుత్‌ ఇబ్బందులతో నరకం చూస్తున్నాం. ఐదేళ్లుగా లోఓల్టేజ్‌ సమస్య ఉంది. తణుకు పట్టణంలో సుదర్శన్‌ నగరంలో సమస్య పరిష్కరించాలి.

– వీరలక్ష్మి, తణుకు

ఎస్‌ఈ: అధికారులను పంపించి సమస్యకు కారణాలు తెలుసుకుని సమస్యకు పరిష్కారం చేస్తాం.

మారుతీ నగర్‌ కాలనీలో చిన్న పార్కు బయట ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పార్క్‌లోకి ఎందుకు మారుస్తున్నారు.

– సూర్యారావు మారుతీనగర్‌, భీమవరం

ఎస్‌ఈ: అధికారులతో మాట్లాడతాం. ట్రాన్స్‌ఫార్మర్‌ మార్పుకు గల కారాణాలు తెలుసుకుని తెలియజేస్తాం.

సత్యనారాయణపురం ఏరియాలో వీధిలైట్లు వెలగడం లేదు.. రాత్రి పుట ఇబ్బందిగా ఉంటుంది. విద్యుత్‌ సరఫరా ఇబ్బందులతో మోటార్లు కాలిపోతున్నాయి.

– దొడ్డిపట్ల రామలింగం, లంకలకోడేరు

ఎస్‌ఈ: విద్యుత్‌ లైన్‌ మార్పులపై తక్షణ చర్యలకు ఆదేశిస్తాం. ఓల్టేజీ ఎక్కువ ఎందుకు వస్తుందో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం.

లోఓల్టేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మారినా సమస్య పరిష్కారం కాలేదు.

– ఎ.కాంతారావు, తణుకు

ఎస్‌ఈ: లోఓల్టేజీ సమస్యకు కారణాలు పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడతాం.

పెద తాడేపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌ అపహరించారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయలేదు.

– జి.మురళీకృష్ణ, పెద తాడేపల్లి

ఎస్‌ఈ: గ్రామంలో తొందరలోనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయిస్తాం.

బేతపూడిలో సీసీ రోడ్డు నిర్మాణంతో ఎత్తు పెరిగి విద్యుత్‌ వైర్లు చేతికందుతున్నాయి.

– కొట్టి పద్మరావు బేతపూడి

ఎస్‌ఈ: వెంటనే పరిశీలించి వైర్లు పైకి ఉండేలా చర్యలు చేపడతాం.

ఆక్వాసాగు జోన్‌లో లేని రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను ఎప్పుడు అందిస్తారు. – నాగేంద్ర, ఆకివీడు

ఎస్‌ఈ: ఆక్వా రైతులందరికీ విద్యుత్‌ సబ్సిడీపై ప్రస్తుతానికి ఎటువంటి ఆదేశాలు లేవు, ఆక్వా జోన్‌లో ఉన్న ఆక్వా రైతులకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుంది.

దువ్వ 1వ వార్డులో ఓల్టేజి సమస్య ఉంది. విద్యుత్‌ అంతరాయంపై అధికారులకు ఫిర్యాదు చేశాను.

ఆలపాటి ఉమాశేషగిరి దువ్వ

ఎస్‌ఈ: లోఓల్టేజి సమస్య ఎందుకు వస్తుందో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. విద్యుత్‌ అంతరా యం లేకుండా చర్యలు చేపడతాం.

భారతీయ విద్యాభవన్స్‌ దగ్గర పవన్‌ వెంచర్స్‌ కాలనీ లో రాత్రులు విద్యుత్‌ సరఫరా సరిగా ఉండడం లేదు.

– చెన్నమిల్లి శ్రీనివాస్‌, భీమవరం

ఎస్‌ఈ: వెంచర్‌ యజమానితో మాట్లాడి మెరుగైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటాం.

నరసాపురం స్టీమర్‌ రోడ్డులో కరెంటు వైర్లు పాత కాలం నాటివి కావడంతో తెగిపోతున్నాయి.

– చెరుకూరి వెంకటరాజు, స్టీమర్‌ రోడ్డు, నరసాపురం

ఎస్‌ఈ: సమస్యను పరిశీలించి అవసరమైతే వైర్లు మార్చేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Apr 26 , 2025 | 01:14 AM