Share News

మూడు రోజుల ముందుగానే విద్యార్థుల ‘బదలాయింపు’!

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:01 AM

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఒక్కరు కూడా ప్రైవేటు పాఠశాలలవైపు తరలిపోకుండా చేయడం, అదేసమయంలో కొత్తగా అడ్మిషన్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంలో భాగంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది.

మూడు రోజుల ముందుగానే విద్యార్థుల ‘బదలాయింపు’!

నేటి నుంచి కొత్త క్లాసుల్లో బాలబాలికలు !

కొత్త అడ్మిషన్ల బాధ్యత టీచర్లదే

అంగన్‌వాడీ చిన్నారులంతా ప్రభుత్వ పాఠశాలల్లోకి ‘బదిలీ’

23 వరకు ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌

ఏలూరు అర్బన్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఒక్కరు కూడా ప్రైవేటు పాఠశాలలవైపు తరలిపోకుండా చేయడం, అదేసమయంలో కొత్తగా అడ్మిషన్ల సంఖ్యను పెంచుకునే లక్ష్యంలో భాగంగా సోమవారం నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతీ ఉపాధ్యాయుడు ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొనేలా ఆదేశాలు, మార్గదర్శకాలు జారీచేసింది. దీనికి ఎంఈవోలు, స్కూల్స్‌ హెచ్‌ఎంలను పర్యవేక్షకులుగా బాధ్యతలు అప్పగించింది. ఆ ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలను తదుపరి పైతరగతుల్లో సోమవారం నుంచి బుధవారం వరకు కూర్చోబెట్టే బాధ్యతలను క్లాసు టీచర్లకు నిర్ధేశించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి చివరి పనిదినం బుధవారమేనన్న విషయం విధితమే. ఆ వెంటనే వేసవి సెలవులు ఉంటాయి. ఈ విధంగా వేసవి సెలవులకు ముందే తదుపరి పైతరగతుల్లో విద్యార్థులను కూర్చోబెట్టడంతో పాటు, వార్షిక పరీక్షల ప్రోగ్రెస్‌ రిపోర్టులను బాలబాలికల తల్లిదండ్రులకు ఇవ్వాలని సూచించింది. కొత్త క్లాసుల్లో కూర్చున్న విద్యార్థులంతా వేసవిసెలవులు ముగిసిన అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున (జూన్‌12) ప్రమోటైన క్లాసులోనే కూర్చునేలా పర్యవేక్షించాల్సిన బాధ్యతలు టీచర్లే తీసుకోవాలని కోరింది.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతివరకు చదువుతున్న మొత్తం విద్యార్థులు 2,27,629 మంది కాగా, వీరిలో 1,609 ప్రభుత్వ పాఠశాలల్లో బాలబా లికలు 1,11,483 మంది ఉన్నారు. వీరంతా తదుపరి పైతరగతుల్లో కూర్చున్న సమాచారం, ఒకవేళ పాఠశాల మారితే ఏయే స్కూళ్లలో అడ్మిషన్‌ తీసుకుంటున్నారో సమగ్ర సమాచారం హెచ్‌ఎంల వద్ద ఉండాల్సిందేనని ఆదేశించారు. స్థానికంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అడ్మిషన్లు పెరగడానికి టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి చేర్చుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

అంగన్‌వాడీ బాలలకు ఒకటో తరగతిలో అడ్మిషన్లకు చర్యలు

ప్రాథమిక విద్యకు పునాదిగా భావించే ఒకటో తరగతిలో అడ్మిషన్లు సంతృప్తికరస్థాయిలో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్య (ప్రీ ప్రైమరీ–1,2/ ఎల్‌కేజీ, యూకేజీ) చదువుతున్న బాలల్లో ఐదేళ్ల వయస్సు దాటిన వారందరినీ సోమవారమే సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్చాల్సిన బాధ్యతలను అంగన్‌వాడీ టీచర్లకు అప్పగించింది. ఈ ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ను పర్యవేక్షించాల్సిందిగా ఎంఈవోలు, సీఎంఆర్‌టీలను ఆదేశించింది. జిల్లాలో 1,959 మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు, 266 మినీ అంగన్‌వాడీ కేంద్రాలుండగా, వీటిలో మొత్తం 13,052మంది బాలలు పూర్వ ప్రాథమికవిద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించే మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌లో కూడా ఒకటో తరగతిలోకి కొత్త అడ్మిషన్లపై దృష్టిసారించాలని సూచించారు.

Updated Date - Apr 21 , 2025 | 12:02 AM