ఆగని మట్టి మాఫియా
ABN , Publish Date - Apr 20 , 2025 | 01:05 AM
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామ సమీపంలోని పంగిడమ్మ చెరువు మట్టిని సైతం ఆగిరిపల్లి మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు గత ఇరవై రోజుల నుంచి రాత్రివేళల్లో టిప్పర్ల ద్వారా అక్రమ మైనింగ్ జరుపుతూ మట్టిని అమ్ముకుంటున్నారు.
ఈదర పంగిడమ్మ చెరువును కొల్లగొడుతున్న వైనం.. కలెక్టర్‌కు గ్రామస్థుల ఫిర్యాదు
నూజివీడు, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి):ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామ సమీపంలోని పంగిడమ్మ చెరువు మట్టిని సైతం ఆగిరిపల్లి మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు గత ఇరవై రోజుల నుంచి రాత్రివేళల్లో టిప్పర్ల ద్వారా అక్రమ మైనింగ్ జరుపుతూ మట్టిని అమ్ముకుంటున్నారు. నరసింగపాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి శనివారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో శనివారం సాయంత్రం ఈదర, సీతారామపురం గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్థులు పంగిడమ్మ చెరువు అక్రమ మట్టి తవ్వకాల గురించి కలెక్టర్ వెట్రిసెల్వికి ఫిర్యాదు చేశారు. టిప్పర్ మట్టి రూ.12 వేలకు అమ్మి నట్టు సమాచారం. దీనిలో టిప్పర్, ఎక్స్‌కవేటర్ ఖర్చు, అధికారుల మామూళ్ళు రూ.6వేలు పోగా మిగిలిన రూ.6వేలను జేబులో వేసుకుంటున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. కనీసం ఇరవై టిప్పర్‌లు రాత్రివేళల్లో ఒక్కొక్కటి రెండు ట్రిప్పుల మట్టిని మాదాలవారిగూడెం, వెల్వడం గ్రామాల్లోని ఇటుకబట్టీలకు తరలిస్తున్నట్టు గ్రామస్థులు తెలిపారు.
డీఫారం పట్టా భూమిని తవ్వేశారు
నరసింగపాలెం అక్రమ క్వారీయింగ్‌లో, తవ్వకం దారులు ఈ గట్టుకు ఆనుకుని ఉన్న డీఫారం పట్టా భూమిలోని మట్టిని సైతం ఆ రైతుకు తెలియకుండానే తవ్వి అమ్మేశారు. ఈ విషయం శనివారం గ్రహించిన భూమి యజమానికి నరసింగపాలెం గ్రామస్థులు మద్దతు నిలిచారు. ఈ మేరకు శుక్రవారం పట్టుకున్న ఎక్స్‌కవేటర్‌ను వదలకుండా పట్టా భూమిలోని తవ్విన మట్టికి డబ్బు చెల్లించాలని స్పష్టం చేశారు. విడతలుగా రూ.2.50 లక్షలు ఇస్తానని అక్రమ మైనింగ్ దారుడు ప్రతిపాదించగా ఒకేసారి రైతుకు చెల్లించి ఎక్స్‌కవేటర్‌ను తీసుకెళ్ళాలని గ్రామస్థులు తెలిపారు.