తూతూ మంత్రంగా..
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:55 AM
వైసీపీ ప్రభుత్వం గుండేరు వాగు మరమ్మతు పనులను తూతూ మంత్రంగా చేయడం వల్ల సాగునీరు సాఫీగా కాల్వలో వెళ్లడం లేదని రైతులు వాపోతున్నారు. వాగులో తూడు,పిచ్చి మొక్కలు పెరగడంతో సాగునీరు కాల్వ ద్వారా కిందకు సక్రమంగా వెళ్లే అవకాశం లేకుండా పోయింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.కోటి వ్యయంతో గుండేరు వాగు ఆధునికీకరణ
మొక్కుబడి పనులతో నిండా మునిగిన రైతులు
టీడీపీ ప్రభుత్వ హయాంలోనైనా పటిష్టంగా పనులు చేపట్టాలని రైతుల విజ్ఞప్తి
దెందులూరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వం గుండేరు వాగు మరమ్మతు పనులను తూతూ మంత్రంగా చేయడం వల్ల సాగునీరు సాఫీగా కాల్వలో వెళ్లడం లేదని రైతులు వాపోతున్నారు. వాగులో తూడు,పిచ్చి మొక్కలు పెరగడంతో సాగునీరు కాల్వ ద్వారా కిందకు సక్రమంగా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇరిగేషన్ అధికారులకు ముందుచూపు లేక పోవడంతో సాగునీరు సక్రమంగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది సెప్టెంబరులో కురిసిన వర్షాలకు జోగన్న పాలెం సమీపంలో గుండేరు వాగులోకి భారీ గా వరద నీరు చేరడంతో దెందులూరు –సత్యనాయణ పురం వద్ద జాతీయ రహ దారి పైకి వరద నీరు పొంగింది. వాహనాల రాకపోకలు నిలిచి పోయా యి. ఈ ఏడాది పంటలకు సక్రమంగా సాగునీరు అందలేదు. లింగపాలెం మండలం కె.గోకవరంలో గుండేరు వాగు ప్రారంభమై కామవరపుకోట కళ్ల చెరువు దగ్గర నుంచి పెదవేగి మండలం మండూరు మీదుగా జోగన్నపాలెం కనక దుర్గమ్మగుడి సమీపంలోని రెగ్యులేటర్ నుంచి గంగన్నగూడెం, దెందు లూరు,శ్రీరామవరం పరిధిలోని సత్యనారా యణపురం వరకు చెరువులను నింపు తుంది. మిగులు జలాలు జాతీయ రహదారి కింద నుంచి ఏలూరు గోదావరి కాల్వ దాటి అండర్ కెనాల్ ద్వారా కొల్లేరు లో కలుస్తాయి. దీనికి తోడు సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలవరం కుడి కాల్వను గుండేరు వాగుకు అనుసంధానం చేశారు. అయితే కాల్వ వెడల్పు తగ్గడం, కాల్వ పూడికపోవడం,పిచ్చి మొక్కలతో కాల్వ సాఫీగా సాగక తుఫాన్ వచ్చిన ప్రతిసారి గంగన్నగూడెం, దెందు లూరు,శ్రీరామవరం, దెందు లూ రు,సత్యనారాణయపురం గ్రామాల్లోకి, పొలాల్లోకి వరద నీరు చేరు తోంది. 2023 లో వైసీపీ ప్రభుత్వం రూ.కోటి నిధులతో జోగన్నపాలెం రెగ్యులేటర్ దగ్గర నుంచి సత్యనారాణపురం వరకు కాల్వ పనులు చేశారు. అయితే పనులను మొక్కుబడిగా చేయడంతో 2023లో వాగుకు వచ్చిన వరదతో రైతులు భారీగా నష్టపోయారు. ప్రస్తుతం మళ్లీ కాల్వ గట్లు అక్కడక్కడ బలహీనంగా ఉండడంతో పాటుగా పిచ్చి మొక్కలు, తూడు పెరిగి పోయి నీరు సక్రమంగా కిందకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. అధికారులు స్పందించి వరద కష్టాలు మరోసారి ఎదురుకాకుండా వర్షాకాలం రాకముందే ఈ వేసవిలోనే వాగును ఆధునికీకరించాలని మండల ప్రజలు, రైతులు కోరుతున్నారు.