రెగ్యులేటర్‌ల కథ కంచికేనా ?
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:08 AM
ఉప్పుటేరు రెగ్యులేటర్‌ల నిర్మాణం దశాబ్దాల కలగా మారిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా సరే రెగ్యులేటర్‌లకు మోక్షం లభించడం లేదు.
ఉప్పుటేరుపై ప్రతిపాదనలు
గత ప్రభుత్వంలో హడావుడి
రూ. 420 కోట్లతో అంచనాలు
టెండర్‌లపై స్పందించని కాంట్రాక్టర్‌లు
కూటమి ప్రభుత్వంలో ప్రతిపాదనలు తెరమరుగు
ఉప్పుటేరు రెగ్యులేటర్‌ల నిర్మాణం దశాబ్దాల కలగా మారిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా సరే రెగ్యులేటర్‌లకు మోక్షం లభించడం లేదు. పశ్చిమ, కృష్ణా డెల్టాలు ఉప్పు కయ్యగా మారకుండా ఉండాలన్నా, కొల్లేరు మంచినీటి సరస్సును సంరక్షించాలన్నా రెగ్యులేటర్ల నిర్మాణం తప్పనిసరి. ఉప్పుటేరుపై మూడు రెగ్యులేటర్‌లు నిర్మిస్తేనే కొల్లేరుతో పాటు, పశ్చిమ, కృష్ణా డెల్టాలకు మనుగడ.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వైసీపీ హయాంలో మూడు రెగ్యులేటర్‌లు నిర్మించను న్నట్టు హడావుడి చేశారు. దాదాపు రూ.420 కోట్లతో అంచనాలు వేశారు. టెండర్‌లు పిలిచారు. కాంట్రాక్టర్‌లు స్పందించ లేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభానికి నోచుకోని పనులను రద్దు చేశారు. ఆ క్రమంలో ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ల ప్రతిపాదనలు తెరమరుగయ్యాయి. వేసవిలో కొల్లేరు నీరు నిల్వ ఉండాలంటే దుంపగడప వద్ద ఒక రెగ్యులేటర్ అవసరం ఉందని గుర్తించారు. అలాగే సముద్ర ముఖద్వారం వద్ద ఉప్పుటేరు కలిసే ప్రాంతంలో రెగ్యులేటర్ నిర్మిస్తే సముద్రపు నీరు ఎగదన్నకుండా ఉంటుంది. తద్వారా ఉప్పుటేరుకు ఇరువైపులా డెల్టా ప్రాంతాన్ని ఉప్పుకయ్యగా మారకుండా పరిరక్షించే అవకాశం ఉంటుంది. కొల్లేరులో వరద నీరు అంతా ఉప్పుటేరు ద్వారానే సముద్రంలో కలుస్తుంది. వాస్తవానికి వైసీపీ హయాంలో మోళ్లపర్రు వద్ద రెగ్యులేటర్‌ను నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వంలో గత ప్రతిపాదనలు రద్దయిపోయాయి. కొత్తగా మళ్లీ రెగ్యులేటర్‌లపై దృష్టి సారించాలి.
ఆక్రమణ చెరలో ఉప్పుటేరు
ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయి. ఈ క్రమంలో ఉప్పుటేరు ఆక్రమణలకు గురవుతోంది. క్రమేపీ పిల్ల కాలువగా మారిపోతోంది. అధికార యంత్రాంగం కూడా దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు.ఉప్పుటేరు ఆక్రమణలు కూడా డెల్లా ప్రాంతానికి ముప్పుగా మారనుంది. ఉప్పుటేరులోనే పశ్చిమడెల్టా పరిఽధిలోని ప్రధాన డ్రెయిన్‌లు కలుస్తున్నాయి. ముఖ్యంగా యనమ దుర్రు డ్రెయిన్ ఉప్పుటేరులో కలుస్తుంది. మరోవైపు కొల్లేరులో వరద నీరు ఉప్పుటేరు ద్వారానే సముద్రంలోకి విలీనం అవుతుంది. ఉప్పుటేరు ఆక్రమణలతో నీటి ప్రవాహానికి అవరోధం కలుగుతుంది. అదే జరిగితే డెల్టా ప్రాంతానికి ముప్పు తప్పదు. ఒకప్పుడు కొల్లేరు ఎగదన్ని పశ్చిమడెల్టా పరిధిలో పంటపొలాలు నీటమునిగాయి. కొల్లేరులో చెరువులను ధ్వంసం చేయడం ద్వారా ముంపును అరికట్టారు. ఇప్పుడు మళ్లీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కొల్లేరులో వరద నీరు ఉప్పుటేరు మీదుగా సముద్రం లోకి ఎటువంటి అవరోధం లేకుండా ప్రవహించాలి. ఆక్రమణలను అరికడితేనే అది సాధ్యపడుతుంది. యనమదుర్రు డ్రెయిన్‌దీ అదే పరిస్థితి. ఒక్కోసారి యనమదుర్రు ఉగ్రరూపం దాలుస్తుంది. ఉప్పుటేరు ప్రవాహానికి అవరోధం కలిగితే యనమదర్రు ఎగదన్నుతుంది. దానివల్ల పశ్చిమ డెల్టా పంట పొలాలకు నష్టం వాటిల్లనుంది. ఆక్రమణల వల్ల ఇలా ఎన్నో సమస్యలు ఉత్పన్నం కానున్నాయి.
రెగ్యులేటర్లు తప్పనిసరి
సముద్ర ముఖద్వారం వద్ద ఉప్పుటేరు మేట లతో పూడుకు పోవడంతో గతంలో డ్రెడ్జింగ్ నిర్వహిం చారు. దాంతో సహజ సిద్ధంగా ఆటుపోట్లకు గురైనప్పుడు సముద్రపు ఉప్పుటేరులోకి సముద్రపు నీరు చొచ్చుకు వస్తుంది. దీనివల్ల మంచినీటి సరస్సుకు ముప్పు ఏర్పడు తుంది.దీనిని అరికట్టేందుకు మోళ్లపర్రు వద్ద సముద్ర ముఖద్వారం సమీపంలో ఉప్పుటేరు రెగ్యులేటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఏశారు. మరోవైపు వేసవిలో చుక్కనీరు లేకుండా కొల్లేరు ఎడారిని తలపిస్తోంది. వేసవిలోనూ కొల్లేరులో నీరు నిల్వ ఉండేలా దుంపగడప ప్రాంతంలో మరో రెగ్యులేటర్ నిర్మించాల్సి ఉంది. అలాగే ఉప్పుటేరు మధ్యభాగంలో మూడో రెగ్యులేటర్ నిర్మాణానికి ప్రణాళిక చేశారు. ఇవేమీ నెరవేరలేదు. కూటమి ప్రభుత్వంలో దీనిపై ఇప్పటిదాకా చర్చలేదు.గోదావరి డెల్టా కోసం రూ.200 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ప్రభుత్వ స్థాయిలోనే రెగ్యులేటర్‌ల నిర్మాణంపై కసరత్తు చేస్తేనే ఫలితం ఉంటుంది.