పరిశ్రమిద్దాం
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:48 AM
కేంద్ర పరిశ్రమల మంత్రి హోదాలో శ్రీనివాసవర్మ ఏదో ఒక్క పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయించ గలరన్న నమ్మకం తీర ప్రాంత వాసుల్లో నెలకొంది. ఇదే జరిగితే.. తీర ప్రాంతం కారిడార్‌గా అభివృద్ధితోపాటు నిరుద్యోగులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.
పరిశ్రమల ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు
జాతీయస్థాయిలో కేంద్ర మంత్రి వర్మ మంతనాలు
కేంద్ర పరిశ్రమల మంత్రి హోదాలో శ్రీనివాసవర్మ ఏదో ఒక్క పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయించ గలరన్న నమ్మకం తీర ప్రాంత వాసుల్లో నెలకొంది. ఇదే జరిగితే.. తీర ప్రాంతం కారిడార్‌గా అభివృద్ధితోపాటు నిరుద్యోగులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కలిపి మొత్తం విస్తీర్ణం 140 కిలోమీటర్లు. ఈ ప్రాంతాల్లో కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినా.. పశ్చిమ ఇందుకు భిన్నంగా ఉంది. వందల ఎకరాల స్థలాలు, రహదారులు, రైలు మార్గాలు వంటి మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నప్పటికి పారిశ్రామికంగా వెనుకబడే వుంది. గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన కృష్ణంరాజు, దాసరి నారాయణరావు పరిశ్రమల ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కారణంగా తీర ప్రాంతంలో కోస్టల్ కారిడార్ కలగానే మిగిలింది. తాజాగా కేంద్ర మంత్రి వర్మ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
నరసాపురం, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్రాల్లోని ఎన్‌డీఏ ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాసవర్మ వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతంపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఇక్కడ ఉన్న మౌలిక వసతు లు, వనరులపై అవగాహన ఉన్న కేంద్ర మంత్రి ఎలాగైనా తీరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో సుమారు 19 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. వందల ఎకరాల సీఆర్‌జెడ్ భూములు ఉన్నాయి. మౌలిక వసతుల విషయా నికి వస్తే 216 జాతీయ రహదారి తీరం వెంబడే వెళుతుం ది. ఇటు రైల్వేస్టేషన్ త్వరలో జంక్షన్‌గా మారబోతుంది. నరసాపురం నుంచి విజయవాడ, ఇటు భీమవరం నుంచి విశాఖపట్నం వరకు డబ్లింగ్ లైన్ విస్తరించింది. కాకినాడ పోర్టు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటు మచిలీపట్నం పోర్టు పూర్తయితే ఈ దూరం మరింత దగ్గరవుతుంది. ఇన్ని మౌలిక వసతులువున్న ఈ ప్రాంతం కోస్టల్ కారిడార్‌కు అన్నివిధాలుగా అనుకూలమైన ప్రతిపాదనను తెరమీదకు
తీసుకొచ్చారు. పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రాంతంపై అవగాహన కల్పించి కనీసం ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి ఆహ్వానం మేరకు నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ ఢిల్లీ వెళ్లారు. అయితే ఏ పరిశ్రమను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న దానిపై మాత్రం బయటకు వెల్లడించడం లేదు.
గతంలో హామీలకే పరిమితం
నరసాపురం తీర ప్రాంతం కేజీ బేసిన్‌కు కేంద్రంగా నిలిచింది. 1977లో ఈ ప్రాంతంలో గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు బయట పడ్డాయి. వీటిని వెలికి తీసేందుకు ఓఎన్‌జీసీ నరసాపురం పట్టణ శివారులో టెంపుల్ ల్యాండ్‌ను ఏర్పాటు
చేసింది. ఇక్కడ ఆయిల్ గ్యాస్ తవ్వకాలకు కావాల్సిన సామగ్రికి నిల్వ ఉంచుతారు. కేజీ బేసిన్ కేంద్ర కార్యాలయం మాత్రం రాజమండ్రిలో ఏర్పాటుచేశారు. ఇంత పెద్ద మొత్తంలో గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డా ఒక్క పరిశ్రమ కూడా నోచుకోలేదు. చివరికి చమురు శుద్ధి చేసే కర్మాగారమూ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చారు. అది విజ్జేశ్వరం వెళ్లిపోయింది. చివరికి కేంద్ర మంత్రిగా ఉన్న కృష్ణంరాజు పేరుపాలెం ప్రాంతంలో ఆయిల్ శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అది కూడా ఫలించలేదు. ఆ తర్వాత కేంద్ర కేబినేట్‌లో మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావు ఈ ప్రాంతంలో ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఇది ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఓడ రేవు కడతామని ప్రకటించింది. సర్వే జరిగింది. అయితే అది నోచుకోలేదు. ఇలా తీర ప్రాంతాన్ని కారిడార్‌గా మార్చేందుకు చేసిన ప్రయత్నాలన్ని కలగానే మిగిలిపోయాయి.