Share News

ఇసుక కష్టాలు తీర్చేలా

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:20 AM

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణాలకు వేసవి, వర్షా కాలాల్లో ఇసుకను అందుబాటులో ఉంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

ఇసుక కష్టాలు తీర్చేలా
పట్టిసీమ డీసిల్టేషన్‌ పాయింట్‌

పట్టిసీమ, గూటాలలో 43,201 మెట్రిక్‌ టన్నుల లభ్యత

పడవల ద్వారా వెలికితీత

ఏలూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణాలకు వేసవి, వర్షా కాలాల్లో ఇసుకను అందుబాటులో ఉంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పోలవరం మండ లంలో పట్టిసీమ డీసిల్టేషన్‌ పాయింట్‌ నుంచి గతంలో నిలిపివేసిన ప్రాంతం నుంచే మళ్లీ ఇసుకను బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా వెలికితీతకు జిల్లా యంత్రాంగం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గోదావరిలో నీటి ప్రవాహం తగ్గు ముఖం పట్టినందున పట్టిసీమ పాయింట్‌ నుంచి రెండు, మూడు రోజుల్లో ఇసుక వెలికితీత చేపట్టాలని జిల్లా ఇసుక కమిటీ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ జిల్లా పర్యటనలో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు ఇసుకను నిల్వ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు అడుగులు వేస్తున్నారు. పట్టిసీమ నుంచి బోట్స్‌మెన్‌ సోసైటీల ద్వారా పడవలపై ఇసుకను ఒడ్డుకు తేనున్నారు. జిల్లాలో డీసిల్టేషన్‌ పాయింట్‌ నుంచి 30 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలకు యంత్రాంగం పర్యావరణ అనుమతులను సాధించగా, ఫిబ్రవరి 23 నాటికి 1799 మెట్రిక్‌ టన్నులను వెలికి తీశారు. ఇప్పుడు మిగిలిన బ్యాలెన్స్‌ నిల్వలు 28,201 మెట్రిక్‌ టన్నులను ఇసుకను ప్రజా అవసరాలకు వినియోగించనున్నారు. ఇక్కడ ఒక మెట్రిక్‌ టన్ను ఇసుక ధరను రూ.229 జిల్లా కమిటీ నిర్దేశించింది. ఇక్కడ తీసిన ఇసుక రెండు నెలల అవసరాలకు సరి పోతుందని అంచనా. దీంతో పాటు గూటాల –1 పాయింట్‌ నుంచి మరో 15వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలకు యంత్రాంగం అనుమతులు పొందినట్లు జిల్లా గనులశాఖ డీడీ రవికుమార్‌ తెలిపారు. మొత్తం మీద 43,201 మెట్రిక్‌ టన్నుల ఇసుక జిల్లా అవసరాలకు అందుబాటులోకి రానుంది.

Updated Date - Apr 24 , 2025 | 01:20 AM