Share News

ప్రైవేటు విద్య.. ఫీజుల మోత

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:22 AM

పిల్లల చదువులతో పెద్దలకు వేసవిలో కూడా చలి జ్వరం వస్తుంది. ప్రవేశాలకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ప్రచారం ఊదర గొడుతున్నాయి.

ప్రైవేటు విద్య.. ఫీజుల మోత

తల్లిదండ్రుల ఆశలతో విద్యా వ్యాపారం

సౌకర్యాలు నిల్‌.. నిబంధనలు బేఖాతరు

ప్రచార హోరు.. పీఆర్వోల దండయాత్ర

కొరవడిన అధికారుల నియంత్రణ

పిల్లల చదువులతో పెద్దలకు వేసవిలో కూడా చలి జ్వరం వస్తుంది. ప్రవేశాలకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ప్రచారం ఊదర గొడుతున్నాయి. ఇప్పటికే ప్రవేశాలు ముగిసిపోయాయనే ప్రచారంతో తల్లిదండ్రులు ఆలోచించుకునే అవకాశం కూడా లేదు. ఇంగ్లీషు మీడియం చదువుల ఆరాటంతో తల్లిదండ్రులు ప్రైవేటు విద్యా సంస్థల వైపు చూస్తున్నారు. ఫీజుల భారంతో కొందరు వెనుదిరిగితే పిల్లల భవిష్యత్‌ బాగుంటుందని కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

పాలకొల్లు టౌన్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతుంటే కార్పొరేట్‌, ప్రైవేటు విద్యా సంస్థలు కళకళలాడుతున్నాయి. పేద వారు సైతం వాటి వైపే ఆకర్షితులవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివే వారికి, తల్లికి వందనం, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ తదితర రాయితీల ను నిలిపివేస్తే తప్ప ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతం కావని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పదిలో అడుగు పెట్టాలంటే రూ.లక్షలు!

ప్రభుత్వం ఎన్ని నిబంధనలున్నా.. జీవోలున్నా కార్పొరేట్‌, ప్రెవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యా వ్యాపారం సాగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు, కళాశాలలు ప్రవేశ సమయం లో ఒకేసారి మొత్తం ఫీజు చెల్లించాలని పీడిస్తున్నాయి. కొన్నిచోట్ల 10వ తరగతికి రూ.70 వేలు, ఇంటర్‌ కు రూ.లక్ష వరకూ ఫీజులు వసూలు చేస్తు న్నారు. ఇది కాకుండా హాస్టల్‌, ఇతర సౌక ర్యాలకు రూ.లక్ష అదనం. 2024– 2025 విద్యా సంవత్సరం ఫీజులను 7 నుంచి 10శాతం పెంచినట్లు సమాచారం.

పాలకొల్లు పట్టణ పరిధిలోని కార్పొ రేట్‌ కళాశాలలో ట్యూషన్‌ ఫీజు పేరు తో రూ.80 నుంచి రూ.90వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం, హాస్టల్‌ పేరుతో మరో రూ.60వేలు బాదేస్తున్నారు. ఇరుకు గదుల్లో తరగతుల నిర్వహణ, పేరుకే ల్యాబ్‌లు ఉన్నా కనీస వసతు లు ఉండవు. ఫీజులు మాత్రం షాక్‌ కొట్టిస్తున్నాయి. ఇతర ప్రైవేటు కలాశాలలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఫీజులు తక్కువ, మూడు, నాలుగు వాయిదాల్లో ఫీజులు కట్టే సదుపాయం ఉందని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇంటింటా తిరిగి ప్రచారం చేసుకుంటున్నారు. విద్యా సంస్థల్లో సమర్ధవంతులైన అధ్యాపకులు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు వినవస్తున్నాయి.

నియంత్రణ ఏది?

ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థ ల్లో ఫీజుల నియంత్రణ చేస్తామని, కార్పొరేట్‌ స్కూళ్లు, కళాశాలలో ఫీజు ల ప్రక్షాళన చేస్తామంటున్న ప్రభుత్వ ప్రకటనలు నీటి మూటలుగానే మారా యి. విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే విద్యాశాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవ హరిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజల కష్టార్జితాన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు జలగల్లా పీల్చేవేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల స్థాపన, నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకునే వారు లేరని పలువురు విమర్శిస్తున్నారు.

ప్రత్యేక వ్యవస్థ

పాలకొల్లులోని ఒక కార్పొరేట్‌ కళాశాలలో యాజమాన్యం కేవలం అడ్మిషన్స్‌ నిమిత్తమే 20 మందికి పైగా పీఆర్వోలను నియమించుకుని వారికి నెలకు రూ.25వేల వరకూ జీతం, అడ్మిషన్‌కు రూ.5వేలు చొప్పున కమిషన్‌ ఇవ్వడం గమనార్హం. ప్రవేశ సమయంలో పీఆర్వోలను 2, 3 నెలలు ఉపాధి కల్పిస్తున్నారు. 3 నెలలో సుమారు రూ.15లక్షల వరకూ పీఆర్వోలకు వెచ్చిస్తున్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:22 AM