ప్రజా సమస్యలు తక్షణ పరిష్కారం
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:43 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
237 అర్జీల స్వీకరణ : కలెక్టర్ నాగరాణి
భీమవరంటౌన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 237 అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులను విన్నవించిన సమస్యలలో కొన్ని..
తమ కుమారుడికి ఎకరం పొలం రాసి ఇచ్చామని, అతడు హైదరాబాద్‌లో ఉంటూ తమను చూడడం లేదని తిరిగి ఆస్తి మాకు అప్పగింగి న్యాయం చేయాలని తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామానికి చెందిన పెరుమళ్ళ సత్యనారాయణ దంపతులు అర్జీని సమర్పించారు.
ఆకివీడు మండలం సిద్ధాపురం, చిన్నమిల్లి గ్రామాల పరిధిలో జిరాయితీ పట్టా భూములు ఫిషర్‌మెన్ సొసైటీ భూములలో కేంద్ర ప్రభుత్వం పరిష్కారంలో ఎన్‌బీడబ్ల్యు ఎల్ ఆమోదం మేరకు తమ భూములు ఇప్పించాలని కోనాల ఏసు పాదం, కర్ర మోషే, ఉచ్చుల చెల్లయ్య కోరారు.
తన భూమి ఆక్రమణకు గురైందని, సర్వే చేయించి హద్దులు చూపాలని పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన బొక్క చంద్రావతి కోరారు.
ఇరగవరం మండలం తూర్పు విప్పర్రులో కాలువ గట్టును ఆక్రమించుకుని ట్రాక్టర్లు వెళ్లకుండా, వ్యవసాయ పనులకు ఆటంకం కల్పిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని రైతులు ఎ.సూర్యనారాయణ, ఎ.లక్ష్మీనరసింహరావు కోరారు. రహదారికి తూములు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
పెంటపాడు మండలం పరిమెళ్లలో రహదారికి అక్రమంగా మురుగు తూములను పెట్టి ఇబ్బందులు కలిగిస్తున్నారని గ్రామానికి చెందిన చవ్వాకుల వెంకటలక్ష్మి కోరారు.
జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నా రాయణ రెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసి రెడ్డి, మేళం దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కార్యాలయంలో 23 అర్జీల స్వీకరణ
భీమవరం క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సోమవారం నిర్వహించారు. అర్జీదారులతో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, ఆస్తి వివాదాలు, నకిలీ పతాల్రు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం, ఇతర సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి విచారణ చేపట్టాలని, తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 23 ఫిర్యాదులు స్వీకరించారు. ఏఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.