లక్ష మార్కు దాటేసింది
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:09 AM
బ్యాంకులో డిపా జిట్ చేసుకుంటే ఏడాదికి రూ.లక్షకు రూ.6 వేలు మాత్రమే వడ్డీ వస్తుంది. అదే రియల్‌ఎస్టేట్‌లో లక్షలు పెట్టుబడి పెట్టి స్థలం కొంటే వచ్చే మొత్తానికి గ్యారెంటీ ఉండదు.
నరసాపురానికి చెందిన ఓ మధ్య తరగతి కుటుంబం వచ్చే ఏడాది తమ కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి రెండేళ్ల నుంచి బంగారం కొంటూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ధర పెరగడంతో తగ్గినప్పుడు కొందామని వాయిదా వేశారు. ఒక్కసారిగా గ్రాముకు మూడు నెలల్లో రూ.3 వేలు పెరగడంతో అవాక్కయ్యారు.
గత ఏడాది వరలక్ష్మి వ్రతానికి భీమవరానికి చెందిన ఓ మహిళ చెరువుల్లో వచ్చిన సొమ్ముతో 50 కాసులు పెట్టి వడ్డానం చేయించుకుంది. అప్పుడు ఈ ధర గ్రాము రూ.6,300 ఉంది. ఇంత ధర పెట్టి కొనాలా ? తగ్గినప్పుడు కొనచ్చులే..! అని కుటుంబ సభ్యులు చెప్పినా.. ఆమె పట్టు పట్టి కొనిపించింది. ఇప్పుడు పెరిగిన ధర చూసి షాక్ తింటు న్నారు. ఆ రోజు కొనకుంటే ఇప్పుడు రూ.12 లక్షలు అదనంగా పెట్టి కొనాల్సి వచ్చేది కదా ! అంటూ కుటుంబ సభ్యులంతా ఆమెను మెచ్చుకుంటున్నారు.
ఎక్కడ చూసినా.. పసిడిపైనే చర్చ
ఇంకా పెరగవచ్చంటున్న బులియన్ వర్గాలు
నరసాపురం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి):బ్యాంకులో డిపా జిట్ చేసుకుంటే ఏడాదికి రూ.లక్షకు రూ.6 వేలు మాత్రమే వడ్డీ వస్తుంది. అదే రియల్‌ఎస్టేట్‌లో లక్షలు పెట్టుబడి పెట్టి స్థలం కొంటే వచ్చే మొత్తానికి గ్యారెంటీ ఉండదు. మార్కెట్ బాగుంటే పది నుంచి 20 శాతం లాభం మిగులుతుంది. స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే ఎప్పుడు ఎలా ఉంటుందో.. చెప్పలేని పరిస్థితి. మార్కెట్ పెరిగితే లక్షకు రూ.10 వేలు లాభం, లేకపోతే పెట్టిన సొమ్ములో సగం కూడా మిగలదు. డాలర్ పరిస్థితి ఇంతే. ఐదేళ్లల్లో ఈ మార్కెట్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన మదుపుదారులు, ప్రజ లు రూటు మార్చారు. బంగారంపై పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఇలా పెట్టిన వారికి ఏటా 15 నుంచి 19 శాతం లాభాలు చవిచూశారు. అయితే ఈ జనవరి నుంచి బంగా రం అంచనాలకు మించి పెరిగింది. డిసెంబరు నాటికి బంగారం బిస్కెట్ పది గ్రాములు రూ.లక్షకు వెళ్లవచ్చని అంచనా వేశారు. నాలుగు నెలల్లోనే రూ.లక్ష దాటేసింది. ఇదే విధంగా పెరిగితే.. ఈ ఏడాది చివరికి గ్రాము బంగా రం రూ.12 వేలయ్యే అవకాశం ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆ రోజుల్లో కొని ఉండాల్సింది!
జిల్లాలో మంగళవారం ఎక్కడ చూసినా.. బంగారంపైనే చర్చ సాగింది. ధర రూ.లక్షకు చేరడం ప్రజలు ఆసక్తిగా చర్చించుకున్నారు. మహిళల దగ్గర నుంచి పురుషుల వరకు ఎక్కడ నలుగురు కలిసినా.. దీనిపైనే చర్చ. గత ఏడాదిలో అనవసరంగా రూ.50 లక్షలు పెట్టి సైట్ కొన్నాం. ఆ ధర అలాగే ఉంది. అదే బంగారం కొనుంటే.. రూ.15 లక్షలు లాభం ఉండేది. ఇప్పుడు ఈ రేటుకు బంగారం కొనగలమా ? అన్న సంభాషణ ఎక్కడ చూసినా.. వినిపించింది. మరికొందరు కొందామని సిద్ధమయ్యాం. కానీ ధర తగ్గుతుందని చెప్పడంతో వెనక్కి వచ్చాం. అనవసరంగా కొనలేకపోయాం. పెరిగిన ధరతో వస్తువులు చేయించుకోగలమా అన్న నిరాశను వెలిబుచ్చారు.
మళ్లీ షాపులు కళకళ
వచ్చే నెలలో అక్షయ తృతీయ వస్తుంది. దీనికితోడు ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందన్న వాదనలు బులియన్ మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. దీంతో రెండు రోజుల నుంచి బులియన్ బజార్లలో సందడి నెలకొంది. గతంలో కొందామని ధరను చూసి వెనక్కి వెళ్లిన వారు ఇంకా పెరుగుతుందన్న భయంతో రేటును సైతం లెక్క చేయకుండా వస్తువులను కొనేందుకు మార్కెట్‌కు వస్తున్నారు. మరికొందరు బంగారాన్ని కొని దాచుకునేందుకు రెండు, మూడు గ్రాముల చొప్పున స్థోమతను బట్టి కొనుగోలు చేస్తున్నారు. దీంతో షాపుల్లో కస్టమర్ల కళ కనిపించింది.
ఈ రేటుకు అసలు కొనలేం
చెరుకూరి అన్నపూర్ణ, నరసాపురం
ధర ఇంత పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఏదో పెరిగి తగ్గుతుందని భావించాం. కానీ మూడు నెలల్లో రూ.లక్షకు వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఽధరలో గ్రాము బంగారం కొనాలంటే రూ.10 వేలు ఉండాలి. సామాన్య, మధ్య తరగతులకు ఇది చాలా కష్టం. గతంలో మాదిరి మూడు, నాలుగు కాసులతో వస్తువులు చేయించుకోవడం సాధ్యం కాని పని..
మరింత పెరగొచ్చు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల భయం, డాలర్, అమెరికాలో బాండ్ల రేట్ల పతనం, స్టాక్ మార్కెట్ లో ఒడి దుడుకులతో మదుపుదారులు పెట్టుబడుల రూట్లను మార్చారు. బంగారంపై పెట్టుబడి పెడితే రాబడికి ఢోకా ఉండదన్న ధీమాకు వచ్చారు. దీనికి అనుగుణంగానే బంగారం కూడా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గినా.. అది నామమాత్రమే, మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంది.
అజిత్‌కుమార్ జైన్, జిల్లా, బులియన్ అసోసియేషన్ మాజీ అఽఽధ్యక్షుడు
2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకూ
బంగారం ధర పెరిగిన క్రమం..
పది గ్రాములు 24 క్యారెట్లు 22 క్యారెట్లు
ఏప్రిల్ 25 1,01,350 92,900
మార్చి 25 94,000 86,000
ఫిబ్రవరి 25 84,890 80,850
జనవరి 2025 84,330 78,000
డిసెంబరు 24 78,000 71,500
నవంబరు 24 80,560 73,850
అక్టోబరు 24 76,910 70,500
సెప్టెంబరు 24 73,040 66,950
ఆగస్టు 24 70,360 64,500
జూలై 24 72,280 66,250
జూన్ 24 72,550 66,500
మే 24 71,510 65,550
ఏప్రిల్ 2024 69,380 63,600