Share News

YSRCP: వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్‌బై

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:57 AM

మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడిగా పేరుపొందిన మరో నాయకుడు వైసీపీకి దూరం కానున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు.

YSRCP: వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్‌బై

  • మర్రి రాజశేఖర్‌ రాజీనామా

  • జగన్‌ తీరుపై అసంతృప్తితో ఇప్పటికి

  • ఐదుగురు ఎమ్మెల్సీల రాజీనామాలు

అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడిగా పేరుపొందిన మరో నాయకుడు వైసీపీకి దూరం కానున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజును కలిసి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను అందించారు. వెంటనే ఆమోదించాలని కోరారు. ఆయన రాజీనామా చేస్తున్నారని తెలిసిన వెంటనే కొందరు వైసీపీ నేతలు అసెంబ్లీ లాబీల్లో ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. రాజీనామా యోచన మానుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అయితే నిర్ణయం తీసేసుకున్నానని రాజశేఖర్‌ తేల్చిచెప్పారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆయన వైదొలగడం గమనార్హం. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు.. పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి, మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజశేఖర్‌తో కలిపి వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది. మరికొందరు ఆ జాబితాలో చేరతారన్న ప్రచారం ముఖ్య నేతలను కలవరపరుస్తోంది. జగన్‌ వైఖరితో విసిగిపోయి.. విభేదిస్తున్న సన్నిహితులు ఒక్కరొక్కరుగా ఆయనకు దూరమవుతున్నారు. ఆయన అధికారంలో ఉండగానే.. తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిలారెడ్డి వైసీపీని వీడివెళ్లారు. జగన్‌కు దగ్గరి బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో సహ నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సైతం పార్టీకి, రాజ్యసభకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఎంపీలు బీద మస్తాన్‌రావు టీడీపీలో, ఆర్‌.కృష్ణయ్య బీజేపీలో చేరిపోయి మళ్లీ రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్నారు.. ఇవన్నీ ఒక్క ఎత్తయితే.. వ్యాపారాలు మొదలైనప్పటి నుంచి వైఎస్‌ కుటుంబంతో కలిసి నడచి వైసీపీలో నంబర్‌ టూగా చలామణి అయిన విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. రాజ్యసభకూ రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానన్న ఆయన.. ఇటీవలి కాలంలో జగన్‌ కంట్లో నలుసుగా మారారు. ‘ఎక్స్‌’ వేదికగా జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన చుట్టూ కోటరీ చేరిందని.. దానిని నమ్ముకుంటే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


వైసీపీలో ఇమడలేని మర్రి

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్‌ కొన్నాళ్లుగా వైసీపీలో ఇమడలేకపోతున్నారు. జగన్‌ పొమ్మనకుండా పొగ పెట్టి పంపే పరిస్థితి కల్పించారు. వాస్తవానికి ఆయనకు మంచి రాజకీయ నేపథ్యం ఉంది. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య ఆయనకు మేనమామ.. మామ కూడా. సాంబయ్య అక్కడి నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై మూడుసార్లు (1978, 1985, 1994లో) గెలుపొందారు. రాజశేఖర్‌ కూడా ఆయన బాటలోనే పయనించారు. 2004లో తనకు కాంగ్రెస్‌ టికెట్‌ లభించకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆయనకు టికెట్‌ ఇవ్వనందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. ఇండిపెండెంట్‌ అభ్యర్థి రాజశేఖర్‌కు మద్దతివ్వాలని ప్రజలకు పిలుపిచ్చారు. ఆ ఎన్నికల్లో రాజశేఖర్‌ 212ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు. 2009లో మాత్రం ఓడిపోయారు. 2014లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల విడదల రజినీకి జగన్‌ టికెట్‌ ఇచ్చారు. పార్టీ గెలిచిన వెంటనే రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని, మంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ విజయానికి రాజశేఖర్‌ కృషి చేశారు. తీరా జగన్‌ నాలుగేళ్ల వరకు ఊరించి ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మంత్రి పదవిని రజినీకి కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో కూడా రాజశేఖర్‌తో ఆడుకున్నారు. అదిగో ఇదిగో అంటూ గుంటూరు మేయర్‌ మనోహర్‌నాయుడికి టికెట్‌ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కూడా రాజశేఖర్‌ను కాదని మళ్లీ రజినీకే ఇచ్చారు. వరుస అవమానాలు భరిస్తూ వైసీపీలో కొనసాగడం ఎందుకని అనుచరుల నుంచి ఆయనపై ఒత్తిడి పెరిగింది. దీంతో మొదట ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే వైసీపీని వీడుతూ ప్రకటన చేస్తారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.


మా రాజీనామాలు ఆమోదించండి...

ఎమ్మెల్సీ పదవులకు తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని జయమంగళం వెంకటరమణ, బల్లి కల్యాణచక్రవర్తి, కర్రి పద్మశ్రీ బుధవారం చైర్మన్‌ మోషేన్‌రాజును కోరారు. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యలతో రాజీనామా చేశానని, వెంటనే ఆమోదించాలని వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఆగస్టు 30న రాజీనామా చేశామని, ఆమోదించాలని కల్యాణచక్రవర్తి, పద్మశ్రీ అభ్యర్థించారు. రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయని చైర్మన్‌ తెలిపారు.

Updated Date - Mar 20 , 2025 | 03:57 AM