సజ్జల భార్గవరెడ్డి చెప్పినట్లు చేశా!
ABN , Publish Date - Jan 09 , 2025 | 06:03 AM
వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, ఆయన తండ్రి, అప్పటి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి చెబితేనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్టు ఎంపీ

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టా
మా పేరు చెప్పి భార్గవే సొమ్ములు కొట్టేశారు... రవీంద్ర రెడ్డి వెల్లడి
కడప, జనవరి 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, ఆయన తండ్రి, అప్పటి ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి చెబితేనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్టు ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రరెడ్డి చెప్పినట్టు తెలిసింది. వారి ప్రోద్బలంతోనే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, అనిత, షర్మిల, విజయలక్ష్మి ఇతరులపై అసభ్య పోస్టులు పెట్టినట్టు వైసీపీ సోషల్ మీడియా కడప జిల్లా కోకన్వీనర్ వర్రా పోలీసులకు వెల్లడించారని సమాచారం. కోర్టు అనుమతితో వర్రాను రెండురోజులపాటు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ నేతృత్వంలో బుధవారం కడప సెంట్రల్ జైలు నుంచి వర్రాను సైబర్ స్టేషనుకు తీసుకువచ్చి విచారించారు. ‘‘సజ్జల భార్గవరెడ్డి, రామకృష్ణారెడ్డి సూచనల మేరకే పోస్టులు పెట్టాం. మాకు డబ్బులు ఇవ్వలేదు. మా పేరు చెప్పి సజ్జల భార్గవరెడ్డే సొమ్ములు కొట్టేశారు. రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడంతో పోస్టులు పెట్టాను. అయితే, వీటిలో 18 నావి కాదు. నా పేరిట ఫేక్ ఖాతాలు సృష్టించి పోస్టులు పెట్టారు’’ అని విచారణలో వర్రా చెప్పినట్లు తెలిసింది.