టాప్‌గేర్‌లో ఆటో
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:00 AM
గత ఏడాది (2024) దేశంలో ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 43 లక్షల యూనిట్లకు పెరిగాయి. మార్కెట్ దిగ్గజం మారుతి సుజుకీతో పాటు హ్యుండయ్, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం), కియా అత్యుత్తమ వార్షిక అమ్మకాలను...
2024లో 43 లక్షల కార్ల విక్రయం
ప్రయాణికుల వాహన రంగం కొత్త రికార్డు
న్యూఢిల్లీ: గత ఏడాది (2024) దేశంలో ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 43 లక్షల యూనిట్లకు పెరిగాయి. మార్కెట్ దిగ్గజం మారుతి సుజుకీతో పాటు హ్యుండయ్, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం), కియా అత్యుత్తమ వార్షిక అమ్మకాలను నమోదు చేశాయి. ఎస్‌యూవీలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో పాటు గ్రామీణ మార్కెట్లో పుంజుకుంటున్న గిరాకీ విక్రయాల జోరుకు దోహదపడ్డాయి. 2023లో వాహనాల టోకు అమ్మకాలు 41.1 లక్షల యూనిట్ల స్థాయిలో ఉన్నాయి. 2023తో పోలిస్తే 2024లో అమ్మకాలు 4.5-4.7 శాతం స్థాయిలో పెరిగాయని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. మారుతి సుజుకీ సైతం 2024లో ఆల్‌టైం గరిష్ఠ టోకు, రిటైల్ విక్రయాలను నమోదు చేసిందన్నారు. వార్షిక టోకు విక్రయాల రికార్డును మారుతి ఆరేళ్ల తర్వాత బద్దలు కొట్టిందని ఆయన చెప్పారు. 2024లో కంపెనీ టోకు విక్రయాలు 17,90,977 యూనిట్లకు చేరుకున్నాయని, దాంతో 2018లో నమోదైన 17,51,919 యూనిట్ల గత రికార్డును అధిగమించామని ఆయన తెలిపారు.
రిటైల్ అమ్మకాల విషయానికొస్తే, 2024లో 17,88,405 యూనిట్ల విక్రయాలతో కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పారు. 2023లో నమోదైన 17,26,661 యూనిట్ల విక్రయాల గత రికార్డును తుడిచిపెట్టింది. కాగా, డిసెంబరులో మారుతి సుజుకీ దేశీయ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 24.18 శాతం వృద్ధితో 1,30,117 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఎస్‌యూవీల్లో హ్యుండయ్ హవా
దేశంలో రెండో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీ హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ విక్రయాలు సైతం 2024లో సరికొత్త జీవనకాల గరిష్ఠం 6,05,433 యూనిట్లకు పెరిగాయి. 2023లో కంపెనీ 6,02,111 కార్లు విక్రయించింది. గత ఏడాది వాహన మార్కెట్లో అమ్ముడైన మొత్తం ఎస్‌యూవీల్లో 67.6 శాతం తమ కంపెనీవేనని హ్యుండయ్ వెల్లడించింది. గతనెలలో మాత్రం హ్యుండయ్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం తగ్గి 42,208 యూనిట్లకు పరిమితమయ్యాయి.
2024లో టాటా మోటార్స్ టోకు విక్రయాలు సరికొత్త రికార్డు స్థాయి 5.65 లక్షల యూనిట్లకు ఎగబాకాయి. టాటా మోటా ర్స్ రికార్డు వార్షిక విక్రయాలను నమోదు చేయడం వరుసగా ఇది నాలుగోసారి. గత నెలలో కంపెనీ సేల్స్ 1 శాతం వృద్ధితో 44,289 యూనిట్లుగా నమోదయ్యాయి.
టయోటా సైతం గత ఏడాదిలో అత్యుత్తమ వార్షిక విక్రయాల రికార్డును నమోదు చేసింది. 2023లో నమోదైన 2,33,346 యూనిట్లతో పోలిస్తే, 2024లో 40 శాతం వృద్ధితో 3,26,329 యూనిట్ల అమ్మకాలు జరిపింది. ఎస్‌యూవీ, ఎంపీవీ విభాగాలు ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయని టయోటా సేల్స్-సర్వీ్‌స-యూజ్డ్ కార్ల విభాగ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు.
గత ఏడాది కియా ఇండియా సేల్స్ 6 శాతం పెరిగి 2,55,038 యూనిట్లకు చేరాయి. 2023లో కంపెనీ 2,40,919 యూనిట్ల అమ్మకాలు జరిపింది.
మహీంద్రా అండ్ మహీంద్రా టోకు అమ్మకాలు గతనెలలో 18 శాతం వృద్ధితో 41,424 యూనిట్లకు చేరగా.. జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ 55 శాతం పెరిగి 7,516 యూనిట్లుగా నమోదయ్యాయి. గతనెలలో కంపెనీ రికార్డు ఈవీ విక్రయాలను నమోదు చేసిందని, మొత్తం సేల్స్ లో 70 శాతం వాటా వీటిదేనని జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ తెలిపింది. కాగా, గతనెలలో నిస్సాన్ మోటార్ హోల్ సేల్స్ 51.42 శాతం పెరిగి 11,676 యూనిట్లకు చేరాయి.
గత ఏడాది దేశీయ విక్రయాలు 18.55 శాతం వృద్ధితో 68,650 యూనిట్లకు పెరిగాయని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఎగుమతులు మాత్రం రెండింతలకు పైగా పెరిగి 63,221 యూనిట్లకు చేరాయంది.
లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ గత ఏడాదిలో 5,816 యూనిట్లను విక్రయించింది. 2023లో నమోదైన 7,931 యూనిట్లతో పోలిస్తే, 2024లో సేల్స్ 26.6 శాతం తగ్గాయి. సరఫరా సమస్యలు ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది.