రూపాయి ఢమాల్
ABN , Publish Date - Jan 14 , 2025 | 05:35 AM
భారత కరెన్సీ సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ఏకంగా 66 పైసలు క్షీణించి రూ.86.70 వద్ద ముగిసింది. దాదాపు రెండేళ్లలో రూపాయికిదే అతి పెద్ద క్షీణత....
ఒక్కరోజే 66 పైసలు డౌన్
రెండేళ్లలో ఇదే అతిపెద్ద పతనం
భారత కరెన్సీ సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ఏకంగా 66 పైసలు క్షీణించి రూ.86.70 వద్ద ముగిసింది. దాదాపు రెండేళ్లలో రూపాయికిదే అతి పెద్ద క్షీణత. డాలర్ క్రమంగా బలపడుతుండటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు వేగంగా పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ఫారెక్స్ వర్గాలు వెల్లడించాయి. ఈక్విటీల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను తరలిస్తుండటం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచింది. గత శుక్రవారం డాలర్-రూపాయి మారకం విలువ 18 పైసల నష్టంతో రూ.86.04 వద్ద ముగిసింది. దాంతో పోలిస్తే సోమవారం రూపాయి 8 పైసల నష్టంతో రూ.86.12 వద్ద ప్రారంభమైంది.
వెంటనే కాస్త కుదురుకుని రూ.86.11 వద్దకు బలపడినప్పటికీ, డాలర్ల కోసం ట్రేడర్లు ఎగబడటంతో ఇంట్రాడేలో నష్టాలు భారీగా పెరిగాయి. చివరికి 66 పైసలు తగ్గి రూ.86.70 వద్ద స్థిరపడింది. 2023 ఫిబ్రవరి 6న నమోదైన 68 పైసల నష్టం తర్వాత రూపాయికిదే అతిపెద్ద పతనం. గత ఏడాది చివరినాటికి రూ.85.52గా ఉన్న మారకం విలువ.. గడిచిన రెండు వారాల్లో 118 పైసలు క్షీణించింది.
మున్ముందు మరింత క్షీణత..!
డాలర్ దెబ్బకు రూపాయి మరింత క్షీణించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మున్ముందు మారకం విలువ రూ.86.25-86.80 శ్రేణిలో కదలాడవచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి అభిప్రాయపడ్డారు.
ఎగుమతిదారులకు ప్రయోజనం పరిమితమే..
రూపాయి విలువ భారీగా క్షీణించినప్పటికీ మన ఎగుమతిదారులకు కలిగే ప్రయోజనం పరిమితమేనని విశ్లేషకులంటున్నారు. మన ఎగుమతిదారులు వస్తు తయారీకి అవసరమైన ముడిసరుకుల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుండటం ఇందుకు కారణమన్నారు. రూపా యి పతనం కారణంగా దిగుమతి వ్యయం పెరగడంతో అంతగా ప్రయోజనం లభించడం లేదన్నారు.
అంతా అమెరికా వల్లే..
ఈ నెల 20న అమెరికా అఽధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై వాణిజ్యపరమైన ఆంక్షలు విధిస్తానని హెచ్చరించడంతో అంతర్జాతీయంగా దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. తాజాగా అమెరికా మార్కెట్ గత నెలలో కొత్తగా 2..56 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించగలిగింది. మార్కెట్ విశ్లేషకులు అంచనా వేసిన 1.55 లక్షల ఉద్యోగాల కంటే ఇది చాలా అధికం. జాబ్ మార్కెట్ బలంగా పుంజుకోవడంతో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీరేట్లను గతంలో ఆశించిన స్థాయిలో తగ్గించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో డాలర్ విలువతోపాటు యూఎస్ బాండ్ల రేట్లు మరింత పెరిగాయి. ఆరు అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే, డాలర్ ఇండెక్స్ మరో 0.29 శాతం పెరిగి 109.80కి చేరింది. 10 ఏళ్ల కాలపరిమితి గల యూఎస్ బాండ్ల రేటు సైతం 0.48 శాతం పెరిగి 2023 అక్టోబరు నాటి గరిష్ఠ స్థాయి 4.79 శాతానికి ఎగబాకింది.
కాగా, రష్యా ముడిచమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించడంతో బ్రెంట్ క్రూడాయిల్ రేటు 4 నెలల గరిష్ఠ స్థాయి 80 డాలర్లకు చేరింది. సోమవారం ఒకదశలో 80.74 డాలర్ల స్థాయి లో ట్రేడైంది. దాంతో చమురు దిగుమతిదారులు పెద్దఎత్తున డాలర్ల కొనుగోళ్లకు పాల్పడ్డారని ఫారెక్స్ వరా ్గలు తెలిపాయి. గత కొన్నివారాలుగా విదేశీ మారకం నిల్వలు గణనీయంగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ జోక్యం చేసుకోకపోవడం కూడా రూపాయి భారీ క్షీణతకు మరొక కారణమని వారన్నారు.