Share News

భారత్‌లోనూ కార్ల తయారీ

ABN , Publish Date - Jan 20 , 2025 | 05:50 AM

చైనా విద్యుత్‌ వాహనాల (ఈవీ) సంస్థ బీవైడీ భారత్‌లోనూ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (ఈపీవీ) విభాగం బిజినెస్‌ హెడ్‌ రాజీవ్‌ చౌహాన్‌ ఈ విషయం...

భారత్‌లోనూ కార్ల తయారీ

వీసాల సమస్య లేదు: బీవైడీ

న్యూఢిల్లీ: చైనా విద్యుత్‌ వాహనాల (ఈవీ) సంస్థ బీవైడీ భారత్‌లోనూ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (ఈపీవీ) విభాగం బిజినెస్‌ హెడ్‌ రాజీవ్‌ చౌహాన్‌ ఈ విషయం వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పోకు హాజరైన ఆయన పీటీఐ వార్తా సంస్థతో ఈ విషయం చెప్పారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)తో కలిసి 100 కోట్ల డాలర్ల పెట్టుబడితో భారత్‌లో ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు బీవైడీ గతంలో ముందుకొచ్చింది. అయితే, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. దాంతో ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. రెండు దేశాల సంబంధాలు ఇప్పుడు కొద్దిగా గాడినపడ్డాయి.


ఈ నేపథ్యంలో బీవైడీ ఈ ఆలోచన చేయడం విశేషం. సరిహద్దు ఘర్షణలతో భారత-చైనా సంబంధాలు వేడెక్కినా ఆ ప్రభావం తమ కంపెనీపై ఏ మాత్రం లేదని చౌహాన్‌ తెలిపారు. చైనా పౌరులకు వీసాల మంజూరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం కఠినం చేసిన ప్రభావం కూడా తమపై లేదన్నారు. వివేకవంతులైన భారతీయులు తమ వాహనాలు కొంటూనే ఉన్నారన్నారు. గత ఏడాది బీవైడీ ఇండియా భారత్‌లో 3,500 వాహనాలు విక్రయించింది. కాగా ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్టు చౌహాన్‌ చెప్పారు.

రాజీవ్‌ చౌహాన్‌

బీవైడీ ఇండియా బిజినెస్‌ హెడ్‌

Updated Date - Jan 20 , 2025 | 05:50 AM