SEBI Chairperson : ఈ ఏడాది రూ.14.27 లక్షల కోట్లు
ABN , Publish Date - Jan 11 , 2025 | 04:25 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈక్విటీ, డెట్ పథకాల ద్వారా క్యాపిటల్ మార్కెట్ నుంచి కంపెనీల నిధుల సమీకరణ వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగి రూ.14.27 లక్షల కోట్లకు చేరుకోవచ్చని సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ అన్నారు.
క్యాపిటల్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణలో 21% వృద్ధి
సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈక్విటీ, డెట్ పథకాల ద్వారా క్యాపిటల్ మార్కెట్ నుంచి కంపెనీల నిధుల సమీకరణ వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగి రూ.14.27 లక్షల కోట్లకు చేరుకోవచ్చని సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బుచ్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో నిధుల సేకరణ రూ.11.8 లక్షల కోట్లుగా నమోదైంది. 2024-25లో గడిచిన 9 నెలల్లో (ఏప్రిల్-డిసెంబరు) కంపెనీలు ఈక్విటీ జారీ ద్వారా రూ.3.3 లక్షల కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.7.3 లక్షల కోట్లు కలిపి మొత్తం రూ.10.7 లక్షల కోట్ల వరకు సమీకరించాయని బుచ్ తెలిపారు. ఈ మూడు నెలల్లో (జనవరి-మార్చి) సేకరించనున్న నిధులతో కలిపితే మొత్తం విలువ రూ.14 లక్షల కోట్లు దాటవచ్చని ఎన్‌ఐఎ్‌సఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఓ సదస్సులో ఆమె అంచనా వేశారు. మరిన్ని విషయాలు..
గడిచిన 9 నెలల్లో క్యాపిటల్ మార్కెట్ నుంచి సమీకరించిన మొత్తంలో రియల్ ఎస్టేట్ ఇన్వె్‌స్టమెంట్స్ ట్రస్ట్ (రీట్స్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్), మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా పోగేసిన నిధుల వాటా చాలా స్వల్పంగా రూ.10,000 కోట్లకు పరిమితమైందని బుచ్ అన్నారు. కానీ, ఈ సాధనాల ద్వారా నిధుల సేకరణ వేగంగా పెరుగుతోందని.. వచ్చే దశాబ్ద కాలంలో ఈక్విటీ, డెట్ మార్కెట్లను మించిపోవచ్చన్నారు.
అనుమతుల జారీని వేగవంతం చేసే దిశగా సెబీ కృషి చేస్తున్నదని, ఎస్‌ఎంఈ బోర్డుల ప్రతిపాదనలకు అనుమతుల సమయాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎస్‌ఎంఈ ఇష్యూలకు అనుమతిచ్చేందుకు ప్రస్తుతం 3 నెలల వరకు సమయం పడుతోందన్నారు. కాగా, బ్యాంకులు కేవ లం 15 నిమిషాల్లో సూత్రపాయ అనుమతులిస్తున్నాయన్నారు.
చాలా కంపెనీలు పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు ఆసక్తి చూపుతున్నాయని, సెబీకి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయన్నారు. కానీ, ప్రిఫరెన్షియల్ ఇష్యూలు, ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్, రైట్స్ ఇష్యూలు వంటి ప్రత్యామ్నాయ మార్గాలూ ముఖ్యమేనని.. ఐపీఓల మోజులో వాటిని గమనించకపోయే ప్రమాదం ఉందన్నారు.
రైట్స్ ఇష్యూలకు వేగంగా అనుమతులిచ్చేందుకు నియంత్రణ మండలి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. మ్యూచువల్ ఫండ్ల కొత్త ఆఫర్లకు చాలా వేగంగా అనుమతులిస్తున్నామన్నారు.
కేవలం రూ.250తో క్రమానుగుత పెట్టుబడి పథకాన్ని (సిప్) ప్రారంభించే వెసులుబాటును త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. గత కొన్నేళ్లలో మ్యూచువల్ ఫండ్లు వంటి దేశీయ సంస్థాగత ఇన్వెసర్లు (డీఐఐ) ప్రజల నుంచి చిన్న మొత్తాల్లో నిధులు సమీకరిస్తుండటాన్ని బుచ్ ప్రశంసించారు. వీరి నుంచి సమీకరించిన నిధులతో డీఐఐలు భారీగా పెట్టుబడులు పెట్టడం వల్లే మన మార్కెట్ ఒడుదుడుకులను తట్టుకోగలిగిందన్నారు.