Share News

ఎగుమతులు మళ్లీ డీలా

ABN , Publish Date - Jan 16 , 2025 | 05:55 AM

భారత వస్తు ఎగుమతులు వరుసగా రెండో నెలలోనూ క్షీణించాయి. గత డిసెంబరులో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన ఒక శాతం తగ్గి 3,801 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.3.27 లక్షల కోట్లు) పరిమితం అయ్యాయి...

ఎగుమతులు మళ్లీ డీలా

డిసెంబరులో రూ.3.27 లక్షల కోట్లకు పరిమితం

వాణిజ్య లోటు రూ.1.89 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: భారత వస్తు ఎగుమతులు వరుసగా రెండో నెలలోనూ క్షీణించాయి. గత డిసెంబరులో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన ఒక శాతం తగ్గి 3,801 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.3.27 లక్షల కోట్లు) పరిమితం అయ్యాయి. అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో అనిశ్చితుల నేపథ్యంలో పెట్రోలియం, వజ్రాభరణాలు, రసాయనాల ఎగుమతులు క్షీణించడం ఇందుకు కారణం. కాగా, గత నెలకు దిగుమతులు 5 శాతం పెరిగి 5,995 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5.16 లక్షల కోట్లు) చేరాయి. దాంతో వాణిజ్య లోటు 2,194 కోట్ల డాలర్లుగా (రూ.1.89 లక్షల కోట్లు) నమోదైంది. గత ఏడాది నవంబరులోనైతే వాణిజ్యలోటు ఆల్‌టైం రికార్డు గరిష్ఠ స్థాయికి పెరిగింది. ఎగుమతులు క్షీణించడంతోపాటు బంగారం, వెండి, వంటనూనెలు, ఎరువుల దిగుమతులు భారీగా పెరగడం ఇందుకు దోహదపడింది. కాగా, గతనెలకు సేవల ఎగుమతులు 3,266 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2.81 లక్షల కోట్లు) పెరిగి ఉండవచ్చని వాణిజ్య శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.


నవంబరు గణాంకాల్లో సవరణ

కేంద్ర వాణిజ్య శాఖ 2024 నవంబరు వాణిజ్య గణాంకాలను సవరించింది. ఎగుమతులను 5.06 శాతం తగ్గుదలతో 3,203 కోట్ల డాలర్లకు, దిగుమతులను 16 శాతం పెరుగుదలతో 6,386 కోట్ల డాలర్లకు కుదించింది. తద్వారా వాణిజ్య లోటు 3,183 కోట్ల డాలర్లకు తగ్గింది. పసిడి దిగుమతుల లెక్కింపులో తప్పిదం ఇందుకు కారణమైనట్టు తెలిపింది. నవంబరులో పసిడి దిగుమతులు సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయి 1,486 కోట్ల డాలర్లకు పెరిగాయని తొలుత వెల్లడించిన కేంద్రం.. తన తప్పిదాన్ని సరిదిద్దుకుంది. పసిడి దిగుమతులను 500 కోట్ల డాలర్ల మేర తగ్గించి 984 కోట్ల డాలర్లకు కుదించింది.

ఏప్రిల్‌-డిసెంబరు కాలానికి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరుతో ముగిసిన 9 నెలల కాలానికి ఎగుమతులు 1.6 శాతం వృద్ధితో 32,171 కోట్ల డాలర్లకు చేరగా.. దిగుమతులు 5.15 శాతం పెరుగుదలతో 53,248 కోట్ల డాలర్లకు ఎగబాకాయి. దాంతో వాణిజ్యలోటు 21,077 కోట్ల డాలర్లుగా నమోదైంది.


రెండేళ్ల గరిష్ఠానికి ఎలకా్ట్రనిక్స్‌ ఎగుమతులు

గత నెలలో ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పత్తుల ఎగుమతులు 35.11 శాతంవృద్ధితో 358 కోట్ల డాలర్లకు (రూ.30,788 కోట్లు) పెరిగాయని వాణిజ్య శాఖ వెల్లడించింది. ఇది రెండేళ్ల గరిష్ఠ స్థాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలతో దేశంలో ఎలకా్ట్రనిక్స్‌ తయారీ బాగా పుంజుకుందనడానికిదే నిదర్శనమని సునీల్‌ భరత్‌వాల్‌ అన్నారు. గత నవంబరులో ఎలకా్ట్రనిక్స్‌ ఎగుమతులు 347 కోట్ల డాలర్లుగా, అక్టోబరులో 343 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.

వాణిజ్య గణాంకాల కోసం

డేటా అనలిటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి

ఎగుమతి, దిగుమతి వాణిజ్య గణాంకాల్లో మెరుగైన అంతర్దృష్టి కోసం కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత మద్దతుతో డేటా అనలిటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వాణిజ్య కార్యదర్శి భరత్‌వాల్‌ వెల్లడించారు. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - Jan 16 , 2025 | 05:55 AM