స్వర్ణ భారతం
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:23 AM
ధరలు ఎప్పటికప్పుడు రికార్డు స్థాయికి ఎగబాకుతూ పోతున్నప్పటికీ బంగారం కొనుగోలు విషయంలో భారతీయులు ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. గత ఏడాది భారత్‌లో పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి 802.8 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది...

2024లో పసిడి గిరాకీ 803 టన్నులు
2025 డిమాండ్ అంచనా
800 టన్నులు..డబ్ల్యూజీసీ నివేదిక
ముంబై: ధరలు ఎప్పటికప్పుడు రికార్డు స్థాయికి ఎగబాకుతూ పోతున్నప్పటికీ బంగారం కొనుగోలు విషయంలో భారతీయులు ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. గత ఏడాది భారత్‌లో పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి 802.8 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతోపాటు పండగలు, పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లు డిమాండ్ వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయని ఆ నివేదికలో తెలిపారు. ఈ ఏడాదిలోనూ భారత్‌లో బంగారం డిమాండ్ 700-800 టన్నుల స్థాయిలో ఉండవచ్చని అంచనా వేశారు. ధరల అనూహ్య పెరుగుదలతో మందగించిన ఆభరణాల కొనుగోళ్లు పెళ్లిళ్ల సీజన్‌లో మళ్లీ పుంజుకోవచ్చని డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ, ఇండియా సచిన్ జైన్ అన్నారు. 2023లో బంగారం గిరాకీ 761 టన్నులుంది.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
2024లో భారత పసిడి గిరాకీ విలువపరంగా 31 శాతం పెరిగి రూ.5,15,390 కోట్లకు పెరిగింది. 2023లో ఇది రూ.3,92,00 కోట్లుగా ఉంది.
2024 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో గిరాకీ ఎలాంటి వృద్ధి లేకుండా 265.8 టన్నులుగా నమోదైంది.
గత సంవత్సరంలో స్వర్ణాభరణాల కొనుగోళ్లు మాత్రం వార్షిక ప్రాతిపదికన 2 శాతం తగ్గి రూ.563.4 టన్నులకు పరిమితమయ్యాయి. 2023లో 575.8 టన్నుల కొనుగోళ్లు జరిగాయి. అయినప్పటికీ, భారత్ చైనా కంటే అధిక నగలు కొనుగోలు చేసింది. 2024లో చైనాలో గోల్డ్ జువెలరీ డిమాండ్ 511.4 టన్నులుగా నమోదైంది.
క్రితం ఏడాది బంగారంలో పెట్టుబడులు 29 శాతం పెరిగి 239.4 టన్నులకు చేరాయి. 2023లో ఇది 185.2 టన్నులుగా ఉంది. అనిశ్చితి సమయా ల్లో బంగారం భద్రమైన పెట్టుబడి సాధనం అనడానికిదే నిదర్శనమని జైన్ పేర్కొన్నారు.
2024లో 114.3 టన్నుల గోల్డ్ రీసైక్లింగ్ (పునర్వినియోగం) జరిగింది. 2023లో జరిగిన 117.1 టన్నులతో పోలిస్తే 2 శాతం తగ్గింది.
గత సంవత్సరం భారత్‌లోకి బంగారం దిగుమతులు 4 శాతం తగ్గి 712.1 టన్నులుగా నమోదైంది. 2023లో 744 టన్నులు దిగుమతైంది.
1045 టన్నులు కొనుగోలు చేసిన
సెంట్రల్ బ్యాంక్‌లు
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా పసిడి గిరాకీ 4,974 టన్నులుగా నమోదైంది. అందులో 1,044.6 టన్నుల బంగారాన్ని వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లే కొనుగోలు చేశాయి. అంటే, ప్రపంచ డిమాండ్‌లో 20 శాతానికి పైగా వాటా వీటిదే. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు ఒక సంవత్సరంలో 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేయడం వరుసగా ఇది మూడోసారి. ఆర్‌బీఐ గత ఏడాది మరో 73 టన్నుల బంగారం సమకూర్చుకుంది. 2023లో 16 టన్నులు కొనుగోలు చేసింది.
గోల్డ్ ఈటీఎ్‌ఫలకు ఆదరణ
గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. గత ఏడాదంతా వీటికి డిమాండ్ నెలకొంది. అక్టోబరు-నవంబరు కాలంలో ధనత్రయోదశి, దీపావళి సీజన్‌లో ఈటీఎఫ్ యూనిట్ల కొనుగోళ్లు మరింత పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎ్‌ఫలు, డిజిటల్ గోల్డ్, నాణేలు, బార్‌ల కొనుగోలుకు అధిక ఆసక్తి చూపుతున్నారు.
డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ, ఇండియా సచిన్ జైన్
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణ మిల్క్ యూనియన్... ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే..
రెచ్చిపోతున్న పావురాళ్ల పందాల నిర్వాహకులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News