Share News

గిఫ్ట్‌ కార్డుల మీద జీఎ్‌సటీ ఎంతంటే..

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:32 AM

ఏదైనా శుభకార్యానికి వెళ్లినప్పుడు గిఫ్ట్‌ తీసుకుని వెళ్లటం పరిపాటి. అయితే చాలా సందర్భాల్లో ఎలాంటి గిఫ్ట్‌ ఇవ్వాలో అర్ధం కాదు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది గిఫ్ట్‌ కార్డ్స్‌ లేదా గిఫ్ట్‌ కూపన్స్‌ కొని ఇస్తుంటారు. అంటే....

గిఫ్ట్‌ కార్డుల మీద జీఎ్‌సటీ ఎంతంటే..

ఏదైనా శుభకార్యానికి వెళ్లినప్పుడు గిఫ్ట్‌ తీసుకుని వెళ్లటం పరిపాటి. అయితే చాలా సందర్భాల్లో ఎలాంటి గిఫ్ట్‌ ఇవ్వాలో అర్ధం కాదు. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది గిఫ్ట్‌ కార్డ్స్‌ లేదా గిఫ్ట్‌ కూపన్స్‌ కొని ఇస్తుంటారు. అంటే, ఉదాహరణకు షాపర్స్‌ స్టాప్‌కి సంబంధించి రూ.1,000 గిఫ్ట్‌ కూపన్‌ లేదా గిఫ్ట్‌ కార్డు కొని అవతలి వ్యక్తికి ఇస్తే.. సదరు వ్యక్తి ఈ గిఫ్ట్‌ కార్డు తీసుకుని ఆ షాప్‌కు వెళ్లి రూ.1,000కి సరిపోను వస్తువులు లేదా బట్టలు తీసుకోవచ్చు. ఇలాంటి గిఫ్ట్‌ కార్డులను ఆన్‌లైన్‌లో కూడా అమ్ముతుంటారు. వీటిని గిఫ్ట్‌గా ఇవ్వటం సులభం. ఈ గిఫ్ట్‌ కార్డు పొందిన వ్యక్తి కూడా తనకు కావాల్సిన వస్తువులను తన అభిరుచి మేరకు కొనుగోలు చేయవచ్చు.


ఈ గిఫ్ట్‌ కార్డులనే వోచర్స్‌గా వ్యవహరిస్తారు. నిజానికి ఈ వోచర్స్‌ బిజినెస్‌ చాలా పెద్దది. అంటే ఇందులో వివిధ కంపెనీల వోచర్స్‌.. వివిధ విలువలకు సంబంధించినవి అమ్ముతుంటారు. వీటిని అమ్మటం కోసం డిస్ట్రిబ్యూటర్స్‌, హోల్‌సేలర్స్‌, రిటైలర్స్‌తో కూడిన నెట్‌వర్క్‌ ఉంటుంది. ఈ వోచర్‌ అమ్మకాలకు సంబంధించి జీఎ్‌సటీలో కొంత గందరగోళం ఉండేది. ఉదాహరణకి రూ.1,000 విలువ ఉన్న వోచర్స్‌ను హోల్‌సేలర్‌ రూ.900కి కొని రిటైలర్‌కు రూ.950కి అమ్మాడనుకుందాం. సదరు రిటైలర్‌ తిరిగి కస్టమర్‌కు రూ.980కి విక్రయించాడనుకుందాం. అంటే హోల్‌సేలర్‌కి వచ్చిన రూ.50 లాభం మీద, అలాగే రిటైలర్‌ పొందిన రూ.30 మీద లాభం మీద పన్ను చెల్లించాలా? అసలు దీన్ని గూడ్స్‌ కింద పరిగణించాలా లేదా సర్వీస్‌ కిందకు వస్తుందా? అనే సందేహాలు కూడా చాలా మందికి ఉండేవి. ఎందుకంటే జీఎ్‌సటీ అనేది గూడ్స్‌ లేదా సర్వీసెస్‌ మీద అమలవుతుంది. ఏదైనా ఒక లావాదేవీ ఈ రెండు విభాగాల్లో ఏదో ఒక దాంట్లో చేపడితేనే జీఎ్‌సటీ వర్తిస్తుంది.


ఈ గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇటీవల దీని మీద వివరణ ఇచ్చింది. దీని ప్రకారం గిఫ్ట్‌ కార్డ్స్‌ లేదా గిఫ్ట్‌ కూపన్స్‌ అనేవి ‘ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ కిందకు వస్తాయి. అంటే, ఆ విలువకు సరిపోను డబ్బును ఆ కార్డులో ముందే నింపుతారని అర్ధం. కాబట్టి దీన్ని కూడా ‘డబ్బు’ కిందనే భావించవచ్చు. జీఎస్‌టీ నియామవళి ప్రకారం డబ్బు అనేది ‘గూడ్స్‌’ కిందకు గానీ, ‘సర్వీస్‌’ కిందకు గానీ రాదు. ఎప్పుడైతే, ఈ రెండు విభాగాల కిందకు రాదో అప్పుడు జీఎ్‌సటీ వర్తించదు. అంటే గిఫ్ట్‌ కార్డు అమ్మినప్పుడు ఎలాంటి జీఎ్‌సటీ వర్తించదు. దీని ప్రకారం గిఫ్ట్‌ కార్డ్స్‌ అమ్మకందారులు ఎలాంటి జీఎ్‌సటీ చెల్లించనవసరం లేదు. కానీ, ఇలా గిఫ్ట్‌ కార్డు అమ్మకం, కొనుగోలు కాకుండా మధ్యవర్తిగా ఉంటూ అంటే.. ఏజెంట్‌ లేదా బ్రోకర్‌లా ఉంటూ కమీషన్‌ తీసుకుంటే మాత్రం.. పొందిన కమీషన్‌ మీద జీఎ్‌సటీ వర్తిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఇతర సర్వీసులు లేదా సేల్స్‌ ప్రమోషన్స్‌ మొదలైన వాటికి సంబంధించి జీఎస్‌టీ వర్తిస్తుంది.


ఇకపోతే, ఈ గిఫ్ట్‌ కార్డు అనేది డబ్చుల కిందనే భావిస్తారు. కాబట్టి ఈ కార్డు ఇచ్చి వస్తువులు లేదా సేవలు పొందేటప్పుడు మొత్తం విలువ మీద ఆయా వస్తువులను బట్టి జీఎ్‌సటీ చెల్లించాలి. ఉదాహరణకు , ఒక వ్యక్తి రూ.1,000 గిఫ్ట్‌ కార్డు తీసుకుని షోరూమ్‌కి వెళ్లి రూ.1,000 విలువైన వస్తువు తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ వ్యక్తి.. డబ్బు చెల్లించే బదులు గిఫ్ట్‌ కార్డు ఇస్తాడు. కానీ గిఫ్ట్‌ కార్డు కూడా డబ్బు లాగానే భావించాం కాబట్టి ఈ రూ.1,000 వస్తువును డబ్బు చెల్లించే తీసుకున్నట్లు భావించి తగిన జీఎ్‌సటీ చెల్లించాలి. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో ఫిజికల్‌ కరెన్సీ వాడకుండా వివిధ రకాల కార్డుల ద్వారా, ఫోన్‌ ద్వారా చెల్లింపులు ఎలా జరుపుతుంటారో.. ఈ గిఫ్ట్‌ కార్డు ఇవ్వటం కూడా ఇలాంటి చెల్లింపు కిందనే భావించాలి. కాబట్టి ఆయా వస్తువులకు ఎంత శాతం జీఎ్‌సటీ వర్తిస్తుందో.. అదే జీఎ్‌సటీ గిఫ్ట్‌ కార్డుతో కొన్నా వర్తిస్తుంది.

తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణతో దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

Updated Date - Jan 12 , 2025 | 01:32 AM