Share News

మార్జిన్లకు ద్రవ్యోల్బణం గండి

ABN , Publish Date - Jan 06 , 2025 | 01:52 AM

మూడో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల మార్జిన్లకు ద్రవ్యోల్బణం గండి కొట్టనుంది. ద్రవ్యోల్బణం, అధిక ముడిసరకు వ్యయాల కారణంగా అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో తమ మార్జిన్లు ఒక మోస్తరుగానే...

మార్జిన్లకు ద్రవ్యోల్బణం గండి

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆందోళన

న్యూఢిల్లీ: మూడో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల మార్జిన్లకు ద్రవ్యోల్బణం గండి కొట్టనుంది. ద్రవ్యోల్బణం, అధిక ముడిసరకు వ్యయాల కారణంగా అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో తమ మార్జిన్లు ఒక మోస్తరుగానే ఉండవచ్చునని ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ప్రతినిధులంటున్నా రు. ఈ త్రైమాసికంలో మార్జిన్లు ఒక అంకెకే పరిమితం కావచ్చునని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. కొబ్బ రి, వెజిటబుల్‌ ఆయిల్‌, పామాయిల్‌ వంటి ముడిసరకు ధరలు 30 శాతం వరకు పెరిగిన కారణంగా ఆ ప్రభావాన్ని తట్టుకునేందుకు డిసెంబరు త్రైమాసికంలో చాలా కంపెనీ లు ఉత్పత్తుల ధరలు పెంచాయి. పట్టణ మార్కెట్లలో వినియోగం తగ్గిన సమయంలో ధరలు పెంచడం వల్ల అమ్మకాలు కొంతమేరకు ప్రభావితం కావచ్చునంటున్నారు. అయి తే గ్రామీణ మార్కెట్లలో మాత్రం పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంది. ఒకపక్క ఆధునిక ట్రేడ్‌, ఇ-కామర్స్‌, క్విక్‌ కామర్స్‌ విభాగాలు బలమైన వృద్ధిని నమోదు చేయగా పరిసర కిరా ణా దుకాణాలు మాత్రం అమ్మకాలపరంగా అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఒత్తిడిని ఎదుర్కొన్నట్టు డాబర్‌ ప్రతినిధి చెప్పారు. ముడి సరకు ధరల భారం కారణంగా రెండో త్రైమాసికంతో పోల్చితే తమ నిర్వహణా మార్జిన్‌ ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావచ్చునని మారికో ప్రతినిధి అన్నారు. స్థూల మార్జిన్లలో క్షీణత ఊహించిన దాని కన్నా అధికంగానే ఉండవచ్చునన్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిడులు, వేతనాల్లో స్వల్ప వృద్ధి, ఇళ్ల అద్దెల పెరుగుదల కారణంగా పట్టణ ప్రాంతాల డిమాండు వృద్ధి కాస్తంత ప్రతికూలంగానే ఉన్నదని నువామా చెబుతోంది. సబ్బులు, స్నాక్స్‌, టీ ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు చిన్న ప్యాక్‌ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారంటున్నారు. ఇది తమ అమ్మకాలను ప్రతికూలంగా ప్రభావితం చేసిందని కంపెనీలు వెల్లడించాయి.


చలికాలం ఆలస్యంగా ప్రారంభం కావడం కూడా తమ మార్జిన్లకు గండి కొట్టిందని కంపెనీలంటున్నాయి. చలి ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ఆ కాలంలో అధిక డిమాండు గల బాడీ లోషన్లు, చ్యవన్‌ప్రాశ్‌ విక్రయాలు జోరందుకోలేదని చెబుతున్నాయి. డీ2సీ బ్రాండ్లు అమ్మకాల్లో ఎదురీదుతున్నాయని, అదే సమయంలో క్విక్‌ కామర్స్‌ విక్రయాలు జోరందుకోవడం వల్ల కంపెనీల మార్జిన్లు ఒత్తిడికి లోనయ్యాయని డెలాయిట్‌ ఇండియా పార్టనర్‌ ఆనంద్‌ రామనాథన్‌ అన్నారు. అయితే జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఉండే పంటల కాలం వ్యవసాయ కమోడిటీల మార్జిన్ల ఒత్తిడిని కొంత మేరకు తగ్గించవచ్చునని, ఇది కమోడిటీ ధరలపై కూడా ఒత్తిడి తగ్గడానికి దారి తీస్తుందని ఆయన చెప్పారు.

Updated Date - Jan 06 , 2025 | 01:52 AM