Share News

Uber India: ఉబర్ క్యాబ్ డ్రైవర్ వల్ల ఫ్లైట్ మిస్.. రూ.54 వేలు చెల్లించాలని ఆదేశం..

ABN , Publish Date - Jan 04 , 2025 | 06:58 PM

మొబైల్‌లో యాప్ ద్వారా బుక్ చేస్తే నిమిషాల వ్యవధిలో వచ్చే క్యాబ్‌లు నిర్దిష్ట సమయానికే గమ్య స్థానానికి చేర్చుతాయి. అయితే కొందరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులపాలవుతున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడు.

Uber India: ఉబర్ క్యాబ్ డ్రైవర్ వల్ల ఫ్లైట్ మిస్.. రూ.54 వేలు చెల్లించాలని ఆదేశం..
Uber India

ప్రస్తుతం మహానగరాల్లో ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా చాలా మంది ఓలా, ఉబర్ (Uber) వంటి ఆన్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ సేవలను వాడుకుంటున్నారు. మొబైల్‌లో యాప్ ద్వారా బుక్ చేస్తే నిమిషాల వ్యవధిలో వచ్చే క్యాబ్‌లు నిర్దిష్ట సమయానికే గమ్య స్థానానికి చేర్చుతాయి. అయితే కొందరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులపాలవుతున్నారు. ఢిల్లీ (Delhi) కి చెందిన ఓ వ్యక్తి అలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడు. దాంతో సదరు సంస్థపై న్యాయపోరాటానికి దిగాడు. మూడేళ్ల పోరాటం తర్వాత అతడికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది.


ఢిల్లీకి చెందిన ఓ వైద్యుడు తెల్లవారుఝామున మూడు గంటలకు ఉబర్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. బుక్ అయిన క్యాబ్ ఎంతకీ రాలేదు. కాల్ చేస్తే సదరు క్యాబ్ డ్రైవర్ రాలేదు. ఉబర్ ఇండియా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా ఎలాంటి స్పందనా లేదు. దీంతో అప్పటికప్పుడు వేరే ట్యాక్సీ మాట్లాడుకుని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే అప్పటికే అతడు ఎక్కాల్సిన విమానం వెళ్లిపోయింది. దీంతో ఆ తర్వాత విమానానికి టికెట్ బుక్ చేసుకుని వెళ్లాడు. తాను సకాలంలో విమానం అందుకోలేకపోవడానికి కారణమైన ఉబర్ ఇండియాపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.


ఈ కేసు మీద మూడేళ్ల పాటు కోర్టులో విచారణ జరిగింది. ఉబర్ ఇండియా సేవా లోపం కారణంగానే వినియోగదారుడికి సమస్య ఎదురైందని కోర్టు అంగీకరించింది. విమానాన్ని అందుకోలేకపోవడమే కాకుండా, అధిక ధరకు మరో టిక్కెట్టు కొనుక్కోవాల్సి వచ్చిందని, దీనికి ఉబర్ ఇండియా సేవా లోపం కారణమని కోర్టు ఓ అభిప్రాయానికి వచ్చింది. దాంతో అదనపు టిక్కెట్టు ధర రూ.20 వేలు, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నందుకు రూ.30 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఆ డబ్బులను 45 రోజుల్లోగా చెల్లించాలని సూచించింది. ఆ గడువు లోగా చెల్లించలేకపోతే రూ.6 శాతం వడ్డీతో కట్టాల్సి ఉంటుందని పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 04 , 2025 | 06:58 PM