New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:08 PM
ఏప్రిల్ 1, 2025 నుంచి ఇండియాలో కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) మొదలు కానుంది. ఈ నేపథ్యంలో పలు కీలక ఆర్థిక నియమాల్లో మార్పులు జరగనున్నాయి. ఈ వివరాలు తెలుసుకోవడం ద్వారా మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

భారతదేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) మొదలవుతుంది. ఇదే సమయంలో మార్చిలో ఉగాది పండుగ తర్వాత కొత్త సంవత్సరం కూడా మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి పలు కీలక ఆర్థిక నియమాల్లో మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల ఆర్థిక జీవితంలో పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్ పాయింట్ల సహా తదితర అంశాలపై ప్రభావం చూపిస్తాయి. ఈ మార్పుల గురించి మీరు ముందే తెలుసుకుంటే, మీ ఆర్థిక ప్రణాళికను ఇబ్బంది లేకుండా సిద్దం చేసుకోవచ్చు. అయితే మారనున్న అంశాలేంటనేది ఇక్కడ చూద్దాం.
1. ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు
ఆదాయపు పన్ను విధానంలో కొన్ని కీలక మార్పులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు కానున్నాయి. ప్రస్తుత పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో, వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) రూ. 75,000 కలుపుకొని, మొత్తం రూ. 12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. ఇది మధ్యతరగతి వర్గానికి ఒక మంచి ఊరటనిస్తుంది.
2. టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) నియమాల్లో మార్పులు
భారతదేశంలో డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ (Tax Deducted at Source) పరిమితి రూ. 5,000 నుంచి రూ. 10,000కి పెరుగుతుంది. ఇదే విధంగా, మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ పరిమితి రూ. 5,000 నుంచి రూ. 10,000కి చేరుతుంది. అలాగే, విద్యా రుణాలపై టీసీఎస్ (Tax Collected at Source) మినహాయింపు తొలగించబడింది. ఈ మార్పుల ప్రకారం, రూ. 7 లక్షలకు మించిన విద్యా లావాదేవీలపై 5% టీసీఎస్ విధించబడుతుంది. విదేశీ చెల్లింపుల పరిమితి కూడా మారుతుంది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (Liberalized Remittance Scheme) కింద, విదేశీ చెల్లింపుల పరిమితి రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెరుగుతుంది.
3. యూపీఐ సేవల్లో మార్పులు
జాతీయ చెల్లింపు సంస్థ (NPCI) ఆధ్వర్యంలో, 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఇకపై, ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్లకు లేదా ఇతరులకు కేటాయించిన నంబర్లకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా, తప్పుడు లావాదేవీలను నివారించవచ్చు.
4. జీఎస్‌టీ నియమాలు
2025-26 ఆర్థిక సంవత్సరంలో, ఇన్‌పుట్ టాక్స్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ (ISD) తప్పనిసరిగా అమలు చేయబడుతుంది. దీని ద్వారా వ్యాపారాలపై కొత్త పన్నుల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపవచ్చు.
5. ఎటీఎం, బ్యాంకింగ్ ఛార్జీలు
ఎటీఎం నగదు ఉపసంహరణ ఛార్జీలను మార్పు చేశారు. దీంతోపాటు పలు బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నియమాల్లో కూడా మార్పులు చేశాయి. ఈ క్రమంలో ఖాతాదారులు తమ ఖాతా నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
6. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లలో మార్పులు
భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు, ముఖ్యంగా ఎస్‌బీఐ (SBI), యాక్సిస్ బ్యాంక్, తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల నిబంధనల్లో మార్పులు చేస్తున్నాయి. దీంతో కొన్ని లావాదేవీలపై రివార్డులు తగ్గే అవకాశం ఉంది.
7. రూపే డెబిట్ కార్డ్ నియమాలు
NPCI, రూపే డెబిట్ సెలెక్ట్ కార్డులపై కొన్ని మార్పులు చేస్తోంది. ఈ మార్పులు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, బీమా కవర్, ప్రయాణం, ఫిట్‌నెస్ వంటి సౌలభ్యాలను యాడ్ చేయడం ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేలా ఉంటాయి.
8. గ్యాస్ సిలిండర్ ధరల మార్పు
ప్రతి నెల 1వ తేదీన, చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను మార్పు చేస్తాయి. ఈ మార్పు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా జరగుతుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది.
సరైన ఆర్థిక ప్రణాళిక
ఈ మార్పులు అన్ని వర్గాల ప్రజలపై వివిధ రకాల ప్రభావాలను చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం ద్వారా, మీరు మంచి మరింత సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. ఈ క్రమంలో పన్ను మినహాయింపులు పెరగడం లేదా క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లలో మార్పులు, బ్యాంకింగ్ ఛార్జీల వంటి అంశాల విషయంలో అప్రమత్తంగా ఉంటే మీ ఖర్చులను ఆదా చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
DA Hike 2025: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు గురించి అధికారిక ప్రకటన
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Read More Business News and Latest Telugu News