కొత్త ఏడాదికి నయా పెట్టుబడి వ్యూహాలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:29 AM
కొత్త సంవత్సరం (2025) వచ్చేసింది. మరి ఈ ఏడాది మన పెట్టుబడుల వ్యూహం ఎలా ఉండాలి?. మన దగ్గర ఉన్న నిధుల్లో ఎంతెంత ఎందులో మదుపు చేయాలి? ఎందులో మదుపు చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం....
కొత్త సంవత్సరం (2025) వచ్చేసింది. మరి ఈ ఏడాది మన పెట్టుబడుల వ్యూహం ఎలా ఉండాలి?. మన దగ్గర ఉన్న నిధుల్లో ఎంతెంత ఎందులో మదుపు చేయాలి? ఎందులో మదుపు చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం.
ఈక్విటీ, బులియన్, డెట్..
ఏది బెటర్?
ఈక్విటీ
గత ఏడాది (2024) దేశీయ స్టాక్ మార్కెట్ మదుపరులకు బొటాబొటిగా 8 శాతం మాత్రమే లాభాలు పంచింది. డెట్ మార్కెట్ కంటే ఇది కొద్దిగా మెరుగు. అదే బంగారంలో మదుపు చేస్తే 23 శాతం, వెండిలో మదుపు చేస్తే 23 శాతం లాభాలు కళ్ల జూసేవాళ్లం. ఈ నేపథ్యంలో 2025లో మన పెట్టుబడుల వ్యూహం ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకుందాం.
ఎన్ని ఆటపోట్లు ఉన్నా, దీర్ఘకాలిక సంపద సృష్టిలో ఈక్విటీ మార్కెట్లదే అగ్రస్థానం. మదుపరులు ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం తమ పెట్టుబడుల్లో సగం మొత్తాన్ని అయినా మదుపరులు ఈక్విటీ మార్కెట్ కోసం కేటాయించాలి. ఇందుకోసం మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల కంటే లార్జ్ క్యాప్ షేర్లను ఎంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పటికీ మిడ్ క్యాప్ కంపెనీల షేర్లు, వాటి అసలు విలువ కంటే అధిక ధరల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు నయా సాల్‌లో ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్ రంగాలకు చెందిన లార్జ్ క్యాప్ షేర్లను ఎంచుకోవటం మంచిది. ప్రస్తుతం కరెక్షన్‌లో ఉన్న ఐటీసీ, డాబర్, మారికో వంటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లపైనా మదుపరులు దృష్టి పెట్టవచ్చు.
బులియన్ మార్కెట్
రాబడులపరంగా చూస్తే గత ఏడాది (2024) బులియన్ మార్కెట్.. స్టాక్ మార్కెట్‌ను మించిపోయింది. పసిడిపై 23.25 శాతం, వెండిపై 23.11 శాతం లాభాలు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా చల్లార లేదు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మరోవైపు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జమానాలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయోనని చైనాతో సహా అనేక దేశాలు భయపడుతున్నాయి. పరిస్థితులు దిగజారితే తమ ఆర్థిక, ద్రవ్య పరిస్థితులను కాపాడుకునేందుకు అనేక దేశాల కేంద్ర బ్యాంకులు పెద్దమొత్తంలో బంగారం కొనిపెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది (2025)లోనూ బంగారం, వెండి ధరలు మరింత చుక్కలనంటే అవకాశం ఉంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మదుపురులు తమ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 35 శాతమైనా నేరుగా బంగారం, వెండిలో లేదా వాటికి సంబంధించిన ఈటీఎఫ్‌ల్లో మదుపు చేయడం మంచిది. డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనమూ వచ్చే ఏడాది బంగారం, వెండిలకు మరింత కలిసి రానుంది.
డెట్
ఇవేవీ వద్దు. మేం ఏ మాత్రం రిస్క్ తీసుకోలేమనుకునే మదుపరులకు బ్యాంకు డిపాజిజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ అందించే డెట్ ఫండ్స్ తప్ప వేరే మార్గం లేదు. కొత్త ఏడాది కూడా ఈ ఫండ్స్ సగటున 6 నుంచి 7 శాతం రాబడులు అందించే అవకాశం ఉంది. అయితే ధరల సెగను పరిగణనలోకి తీసుకుంటే బ్యాంకు డిపాజిట్లు, డెట్ ఫండ్స్‌పై వచ్చేది ప్రతికూల రాబడులు మాత్రమే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు కొత్త ఏడాది తమ మొత్తం పెట్టుబడుల్లో 15 శాతానికి మించి వీటిలో మదుపు చేయకపోవడమే మంచిది.