మార్కెట్లలో చమురు మంటలు
ABN , Publish Date - Jan 14 , 2025 | 05:38 AM
దలాల్‌స్ట్రీట్ మళ్లీ బేర్‌మంటోంది. ఈక్విటీ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టపోయాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ మరో 1,048.90 పాయింట్లు క్షీణించి 76,330.01 వద్దకు జారుకుంది. దాంతో సూచీ 77,000 కీలక స్థాయిని...
4 రోజుల్లో రూ.25 లక్షల కోట్లు ఫట్
ఒక్కరోజే రూ.12.61 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్ మరో 1,049 పాయింట్లు డౌన్
ముంబై: దలాల్‌స్ట్రీట్ మళ్లీ బేర్‌మంటోంది. ఈక్విటీ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టపోయాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ మరో 1,048.90 పాయింట్లు క్షీణించి 76,330.01 వద్దకు జారుకుంది. దాంతో సూచీ 77,000 కీలక స్థాయిని కూడా కోల్పోయింది. నిఫ్టీ 345.55 పాయింట్లు పతనమై 23,085.95 వద్ద ముగిసింది. అమ్మకాల హోరులో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.12.61 లక్షల కోట్లు తగ్గింది. గడిచిన నాలుగు సెషన్లలో ఇది రూ.24.69 లక్షల కోట్లు తగ్గి రూ.417.06 లక్షల కోట్లకు (4.82 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,869.1 పాయింట్లు కోల్పోయింది.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో నాలుగు మినహా అన్నీ నష్టపోయాయి. జొమాటో షేరు 6.52 శాతం క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. పవర్‌గ్రిడ్, అదానీపోర్ట్స్ 4 శాతానికి పైగా పతనమవగా.. టాటాస్టీల్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్ 3 శాతానికి పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి.
చిన్న, మధ్య స్థాయి కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి తీవ్రతరమైంది. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 4.17 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4.14 శాతం నష్టపోయాయి. రంగాలవారీ సూచీలన్నీ నెగిటివ్‌గానే ముగిశాయి. రియల్టీ అత్యధికంగా 6.59 శాతం పతనమవగా.. యుటిలిటీస్, సర్వీసెస్, పవర్, ఇండస్ట్రియల్స్, కన్స్యూమర్ డిస్‌క్రెషనరీ సూచీలు 4 శాతానికి పైగా నష్టపోయాయి.
గత శుక్రవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.2,254.68 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు రూ.22,194 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు.
పతనానికి
కారణాలివే.. డిసెంబరులో అమెరికాలో ఉద్యోగాల కల్పన బలంగా పుంజుకోవడంతో ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీరేట్లను గతంలో అంచనా వేసిన స్థాయిలో తగ్గించకపోవచ్చన్న ఆందోళనలతో యూఎస్ సహా ప్రపంచ మార్కెట్లలో ఈక్విటీల అమ్మకాలు పోటెత్తాయి. ముడిచమురు ధరలు మళ్లీ ఎగబాకుతుండటం, రూపాయి భారీ క్షీణత, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తరలిపోతుండటం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత కుంగదీశాయి.
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్‌కు 17% లిస్టింగ్ లాభం
ప్రతికూలతలో సైతం సోమవారం లిస్టయిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ మాత్రం ఇన్వెస్టర్లకు రెండంకెల లాభాలు పంచింది. ఐపీఓ ధర రూ.140తో పోలిస్తే బీఎ్‌సఈలో కంపెనీ షేరు 16.67 శాతం లాభంతో రూ.163.35 వద్ద ముగిసింది. ఈ ఇష్యూ 182.57 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది.