పసిడి జోరు.. ఆపతరమా!
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:25 AM
ప్రపంచాన్ని అస్థిరతలు ఆవరించినప్పుడల్లా సురక్షితమైన రాబడులు అందించిన ఘనత బంగారానికి ఉంది. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అస్థిరతలు ఆవరించి ఉన్న ప్రస్తుత కాలంలో కూడా అది నిజమని రుజువైంది...
కొత్త ఏడాదిలో రూ.90,000 చేరే చాన్స్
2024లో పసిడి 23ు, వెండి 30ు వృద్ధి
ప్రపంచాన్ని అస్థిరతలు ఆవరించినప్పుడల్లా సురక్షితమైన రాబడులు అందించిన ఘనత బంగారానికి ఉంది. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అస్థిరతలు ఆవరించి ఉన్న ప్రస్తుత కాలంలో కూడా అది నిజమని రుజువైంది. తెరమరుగవుతున్న 2024 సంవత్సరంలో మంచి రాబడులు అందించిన బంగారం నూతన సంవత్సరంలో కూడా అదే జోరును కొనసాగిస్తుందని బులియన్ మార్కెట్ నిపుణులంటున్నారు. 2025 సంవత్సరంలో బంగారం 10 గ్రాములు రూ.90,000 తాకే ఆస్కారం ఉన్నదని వారు జోస్యం చెబుతున్నారు. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉపశమించి, ద్రవ్య విధానం విషయంలో కాఠిన్యం తగ్గితే మాత్రం బంగారం ధర తగ్గినా ఆశ్చర్యపోనక్కరలేదని వారు చెబుతున్నారు. ఆ పరిస్థితే గనుక ఏర్పడితే మాత్రం రూ.85,000 వరకు వెళ్లవచ్చంటున్నారు. అలాగే కిలో వెండి పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే రూ.1.25 లక్షలు తాకవచ్చని, ప్రతికూల మొగ్గులో రూ.1.10 లక్షలకు పరిమితం కావచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.79,350, ఎంసీఎక్స్‌లో ఫ్యూచర్స్ ట్రేడ్‌లో 10 గ్రాములు రూ.76,600 పలుకుతోంది.
2024లో 23% లాభం
దేశీయ మార్కెట్లో 23 శాతం లాభంతో బంగారం 2024 సంవత్సరంలో మంచి రాబడి అందించింది. అక్టోబరు 30వ తేదీన 10 గ్రాముల బంగారం జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.82,400ని తాకింది. వెండి కూడా కిలో రూ.1 లక్ష దాటింది. 1979 తర్వాత బులియన్ మార్కెట్ నమోదు చేసిన అత్యుత్తమ ర్యాలీ ఇదే అని బులియన్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ విపణిలో చూసినా ఔన్సు బంగారం 2,062 డాలర్ల వద్ద ప్రారంభమై అక్టోబరు 31న రికార్డు గరిష్ఠ స్థాయి 2,790 డాలర్లు తాకింది. అంతర్జాతీయంగా ఏడాదిలో బంగారం పెట్టుబడిపై 28 శాతం రాబడి అందించింది.
ఆభరణాల డిమాండూ ప్రధానమే
ఆభరణాల డిమాండ్ బంగారం ధరలను ప్రభావితం చేసే మరో అంశం. ఒక పక్క పండగలు, వివాహాల సీజన్, మరో పక్క గత జూలైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం 0.90 శాతం మేరకు తగ్గించడం వంటి చర్యలతో దేశంలో బంగారం వినియోగం 17 శాతం పెరిగిందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి చెప్పారు. 2019-2024 సంవత్సరాల మధ్య కాలంలో దేశీయ ఆభరణాల పరిశ్రమ 11 శాతం సమీకృతవార్షిక వృద్ధిని నమోదు చేసిందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకుమార్ కృష్ణమూర్తి తెలిపారు. పండగలు, వివాహాల సీజన్ కారణంగా నవంబరులో బంగారం దిగుమతులు నాలుగు రెట్లు పెరిగి రికార్డు గరిష్ఠ స్థాయి 1,486 కోట్ల డాలర్లకు చేరాయి.
నూతన సంవత్సరంలో కూడా ఆభరణాల డిమాండు బలంగానే ఉంటుందని అఖిల భారత వజ్రాభరణాల వ్యాపారుల మండలి (జీజేసీ) చైర్మన్ సాయం మెహ్రా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, యువత బులియన్ మార్కెట్ వృద్ధికి చోదకంగా నిలుస్తారని చెబుతున్నారు. అలాగే వివాహాభరణాల మార్కెట్ కూడా డిమాండు వృద్ధికి దోహదపడుతుందంటున్నారు. ఇవన్నీ కలిసి 2025 సంవత్సరంలో భారత వజ్రాభరణాల మార్కెట్ 10 వేల కోట్ల డాలర్లను చేరవచ్చని అంచనా.
సెంట్రల్ బ్యాంకుల వైఖరే కీలకం
కొత్త సంవత్సరంలో బంగారం ధరలకు వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన వైఖరే దిక్సూచి అంటున్నారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించినట్టయితే మార్కెట్లో లిక్విడిటీ పెరిగి అమెరికన్ డాలర్ బలహీనపడుతుందని, ఇది బంగారం ధరల వృద్దికి దోహదపడే అంశమని విశ్లేషకులంటున్నారు. ఒక వేళ కేంద్ర బ్యాంకులు అప్రమత్త ధోరణి ప్రదర్శించినట్టయితే మాత్రం బంగారం ధర పెరుగుదలకు దోహదకారి అవుతుందని వారంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కేంద్ర బ్యాంకులు నిల్వలు పెంచుకునే లక్ష్యంతో బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తూ కరెన్సీ స్థిరత్వంపై ఆందోళనలు నెలకొంటే మాత్రం బంగారం ధరల పెరుగుదలను ఆపే శక్తి ఏదీ ఉండదని వ్యాఖ్యానించారు. 2024లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సహా వివిధ కేంద్ర బ్యాంకులు 500 టన్నులకు పైబడిన బంగారం కొనుగోలు చేశాయి.