Loans: కన్జూమర్ డ్యూరబుల్స్ రుణాలతో పూనావాలా ఫిన్‌కార్ప్
ABN , Publish Date - Apr 22 , 2025 | 10:27 PM
సైరస్ పూనావాలా గ్రూప్ ఆధీనంలోని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్) కన్జూమర్ డ్యూరబుల్స్ రుణాల రంగంలోకి అడుగుపెట్టింది.
ముంబయి: సైరస్ పూనావాలా గ్రూప్ ఆధీనంలోని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్) కన్జూమర్ డ్యూరబుల్స్ రుణాల రంగంలోకి అడుగుపెట్టింది. కస్టమర్లకు సులభ కొనుగోళ్ల కోసం డిజిటల్ ఈఎంఐ కార్డులతో ముందస్తు-ఆమోదిత రుణ పరిమితులను అందిస్తూ, రిటైల్ రుణాలలో వేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో బలమైన స్థానం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతికత ఆధారిత తక్షణ రుణ సేవలు, డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ద్వారా కస్టమర్ బేస్‌ను విస్తరించేందుకు పీఎఫ్ఎల్ నిర్ణయించింది. ఈ రుణాలు తీసుకున్నవారు వ్యక్తిగత రుణాలు, బీమా వంటి ఇతర ఆర్థిక ఉత్పత్తులకు సంభావ్య క్లయింట్లుగా మారే అవకాశం ఉంది, ఇది బహుముఖ వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది. “ఈ కొత్త ఉత్పత్తి కేవలం రుణ ఆఫర్ కాదు. రిటైల్ వ్యాపారాన్ని వేగవంతంగా, లాభదాయకంగా విస్తరించే వ్యూహాత్మక ఆయుధం. కోట్లాది కొత్త కస్టమర్లకు చేరువై, విభిన్న ఆర్థిక సేవలను అందించే అవకాశం ఇది” అని పీఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో అరవింద్ కపిల్ పేర్కొన్నారు.
360 వన్ డబ్ల్యూఏఎం, యూబీఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం...
భారత్‌లో ప్రముఖ స్వతంత్ర వెల్త్, అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ 360 వన్ డబ్ల్యూఏఎం, స్విట్జర్లాండ్‌కు చెందిన గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్, యూనివర్సల్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. స్థానిక నైపుణ్యంతో 360 వన్, అంతర్జాతీయ అనుభవంతో యూబీఎస్ కలిసి క్లయింట్లకు వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను అందిస్తాయి. ఈ ఒప్పందం ద్వారా ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ వెల్త్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ రెండు సంస్థల క్లయింట్లకు అందుబాటులోకి వస్తాయి. అసెట్ మేనేజ్‌మెంట్ ఉత్పత్తులు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సేవలలో సహకారాన్ని కూడా పరిశీలిస్తాయి. 360 వన్ తన అనుబంధ సంస్థల ద్వారా భారత్‌లో యూబీఎస్ ఆన్‌షోర్ వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోనుంది.
ఓఎన్డీసీ నెట్‌వర్క్‌లోకి యూటీఐ మ్యూచువల్ ఫండ్...
మ్యూచువల్ ఫండ్ హౌస్‌లలో ఒకటైన యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సైబ్రిల్లా సహకారంతో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ నెట్వర్క్తో తన ఏకీకరణను ప్రకటించింది. యూటీఐ ఏఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వినయ్ లఖోటియా మాట్లాడుతూ... ఈ ఏకీకరణతో తొలిసారి పెట్టుబడిదారులకు సాధికారత కల్పించడం పట్ల తాము సంతోషిస్తున్నట్లు చెప్పారు.