Share News

3 భారతీయ సంస్థలపై అమెరికా ఆంక్షల తొలగింపు

ABN , Publish Date - Jan 16 , 2025 | 05:42 AM

అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ సెక్యూరిటీ(బీఐఎస్‌) తన ఆంక్షల జాబితా నుంచి 3 భారతీయ అణు రంగ సంస్థల పేర్లను తొలగించింది. అమెరికా జాతీయ భద్రత, విదేశీ విధాన ప్రయోజనాలకు....

3 భారతీయ సంస్థలపై అమెరికా ఆంక్షల తొలగింపు

న్యూయార్క్‌: అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ సెక్యూరిటీ(బీఐఎస్‌) తన ఆంక్షల జాబితా నుంచి 3 భారతీయ అణు రంగ సంస్థల పేర్లను తొలగించింది. అమెరికా జాతీయ భద్రత, విదేశీ విధాన ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్న కారణంగా 11 చైనా కంపెనీలను కొత్తగా ఈ లిస్ట్‌లో చేర్చింది. అమెరికా ఆంక్షల జాబితా నుంచి తొలగించిన భారత సంస్థల్లో ఇండియన్‌ రేర్‌ ఎర్త్‌, ఇందిరా గాంధీ ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఐజీసీఏఆర్‌), బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌) ఉన్నాయి. భారత్‌-అమెరికా మధ్య అణు సహకారానికి ఉన్న అవరోధాలను తొలగించే దిశగా చర్యలు చేపట్టబోతున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎ్‌సఏ) జేక్‌ సుల్లివన్‌ వ్యాఖ్యానించిన వారం రోజులకే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. 16 ఏళ్ల క్రితం భారత్‌తో అమెరికా కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా అమెరికా తాజా చర్యను చూడవచ్చు.


అగ్రరాజ్యం తాజా నిర్ణయంతో అణు రంగంలో భారత్‌-అమెరికా పరస్పరం సహకరించుకోవడంతోపాటు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

Updated Date - Jan 16 , 2025 | 05:42 AM