Stock Market: కొనసాగుతున్న లాభాల జోరు.. సెన్సెక్స్ 900 పాయింట్లు జంప్..
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:53 PM
ఆకర్షణీయంగా ఉన్న హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లను పరుగులు తీయించాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ, చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో పయనించాయి.

ఇటీవల వరుస నష్టాలతో కునారిల్లిన దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. వరుసగా నాలుగో రోజు కూడా లాభాలతోనే ముగిశాయి. ముఖ్యంగా ఆకర్షణీయంగా ఉన్న హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లను పరుగులు తీయించాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ, చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా ఉండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో పయనించాయి. (Business News).
బుధవారం ముగింపు (75, 449)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 400 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫైనాన్స్ స్టాక్స్ భారీ లాభాలను ఆర్జించాయి. దీంతో సెన్సెక్స్ చాలా రోజుల తర్వాత 76 వేలను కూడా దాటింది. చివరకు సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 76, 348 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 283 పాయింట్ల లాభంతో 23, 190 వద్ద స్థిరపడింది. చాలా రోజుల తర్వాత 23 వేలకు పైన రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో భారత్ ఫోర్జ్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఫియోనిక్స్ మిల్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలను ఆర్జించాయి. కేఈఐ ఇండస్ట్రీస్, పాలీక్యాబ్, పేటీఎమ్, హావెల్స్ ఇండియా షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 327 పాయింట్లు ఎగబాకింది. బ్యాంక్ నిఫ్టీ 360 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.37 గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..