Zodiac Sign 2025: ఈ కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉందంటే
ABN , Publish Date - Jan 01 , 2025 | 01:12 PM
మేషరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గృహనిర్మాణం, స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు చదువుల కోసం వెళ్లేందుకు,
జన్మ నక్షత్రం ప్రకారం రాశిఫలాలు - 2025
మేషం
(అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)
మేషరాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. గృహనిర్మాణం, స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు చదువుల కోసం వెళ్లేందుకు, విదేశీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. బాంధవ్యాలు పెంపొందుతాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
మీ జన్మరాశి నుంచి 2, 3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా స్థిరచరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. తోబుట్టువుల వ్యవహారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. సంవత్సరం ప్రారంభం నుంచి ఫిబ్రవరి 5 వర కు, ఆ తరువాత నవంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉంటాడు. ఆ సమయంలో ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. ఉద్యోగ, వ్యాపారాల్లో నిదానం పాటించాలి. రవాణా, కన్సల్టెన్సీ, విద్యారంగాల వారు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు కుంభంలో ఆ తరువాత మీనంలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. రుణబాధలు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. మోకాళ్లు, కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. జూలై14 నుంచి నవంబర్ 28 వరకు శని వక్రగమనంలో ఉన్న సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువైనా చివరకు విజయం సాధిస్తారు.
ఈ ఏడాది 12-6 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. అపార్థాలు, ఆవేశాల కారణంగా సంబంధాలు దెబ్బ తింటాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణ ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని మాటపడాల్సి వస్తుంది.
శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభఫలితానిస్తుంది.
వృషభం
(కృత్తిక 2,3,4; రోహిణి;
మృగశిర 1,2 పాదాలు)
వృషభ రాశి వారు ఈ ఏడాది అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారు పురోగతి సాధిస్తారు. సంతానం విషయంలో శుభపరిణమాలు చోటుచేసుకుంటాయి. స్నేహానుబంధాలు పెంపొందుతాయి. రాజకీయ, సినీరంగాలు, వ్యవసాయ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహారాలు సంవత్సరాంతంలో పరిష్కారం అవుతాయి. విలాసాలకు ఖర్చులు అధికం.
ఈ ఏడాది గురువు మీ జన్మరాశితో పాటు 2వ స్థానంలో సంచరిస్తాడు. ఫలితంగా మీ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. పై అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇతరుల నుంచి మాటపడాల్సి రావచ్చు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 5 వరకు, ఆ తరువాత నవంబర్ 12 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉంటాడు. ఆ సమయంలో సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాంధవ్యాలు బలపడతాయి. సంతతి విషయంలో శుభ పరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది.
మీ జన్మరాశి నుంచి 10, 11 స్థానాల్లో శని సంచారం కారణంగా విద్య, వ్యాపారం, టెలివిజన్, పత్రికలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఐరన్, గృహోపకరణాలు, కిరాణా రంగాల వ్యాపారులు, ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు మంజూరవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాలు నెమ్మదిగా పరిష్కారం అవుతాయి. ఖర్చులు అధికంగా ఉన్నా సకాలంలో అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. నూనెలు, పెట్రోల్, పెయింట్స్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. శని వక్రగమనంలో ఉన్న జూలై-నవంబర్ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికం. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి.
ఈ ఏడాది 11-5 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనసు చికాకుగా ఉంటుంది. ఉన్నతవిద్యకై చేసే యత్నాలు వాయి దావేసుకోవడం మంచిది. స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. కొత్త స్నేహాలకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. షేర్లు, భాగస్వామ్యాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.
మిథునం
(మృగశిర 3,4; ఆరుద్ర;
పునర్వసు 1,2,3 పాదాలు)
మిథున రాశి వారు ఈ ఏడాది ఆస్తులు పెంపొందించుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ గమన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, పత్రికలు, టెలివిజన్, న్యాయవాదులు, జడ్జిలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యంతో వ్యవహరించి లాభాలు, మంచి పేరు తెచ్చుకుంటారు. వైద్యం, అంతరిక్ష పరిశోధన రంగాల్లో ఉన్న వారికి అనుకూలం. ఆదాయం పెంపొందించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
గురువు ఈ ఏడాది వ్యయస్థానంతో పాటు మీ జన్మ స్థానంలో సంచారం చేస్తాడు. ఫలితంగా విద్య, న్యాయ, రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలాసాలకు ఖర్చులు అధికం. దూరప్రయాణాలకు అనుకూలం. విద్యార్థులు, పరిశోధకులకు అనుకూల సమయం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 5 వరకు, నవంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించినందున ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. కొత్త పరిచయాల కారణంగా అనుకోని చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి 9, 10వ స్థానాల్లో శని సంచారం జరుగుతున్నందున ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనయోగం ఉంది. ప్రమోషన్లు లభిస్తాయి. ఆస్తులకు సంబంధించిన కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూనెలు, ధాన్యాలు, పప్పులు, కిరాణా, మెడికల్, ఆహార రంగాలకు చెందిన వ్యాపారులు, ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త స్నేహాలకు దూరంగా ఉండటం మేలు. అప్పులు ఇస్తే తిరిగి రావడం కష్టం. జూలై 14 - నవంబర్ 28 తేదీల మధ్య శని వక్రించిన కారణంగా ఏకాగ్రత, పట్టుదలతో అవరోధాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పాటించాలి. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపాలి.
ఈ ఏడాది 10, 4 స్థానాల్లో రాహు కేతువుల సంచారం ఫలితంగా ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. షేర్‌మార్కెట్ లావాదేవీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రియతములకు సంబంధించిన బాధాకరమైన విషయాలు చోటుచేసుకుంటాయి. సన్నిహితుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పై చదువులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
శ్రీ ఇంద్రాక్షీ దేవి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం
(పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష)
కర్కాటక రాశి వారు ఈ ఏడాది ఆస్తులు పెంపొందించుకుంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. సినిమాలు, రాజకీయ, బోధన, న్యాయ, పరిశోధన, పత్రికారంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. సంతానం విషయంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. విదేశీ గమన యత్నాలకు అనుకూలం.
గురువు ఈ ఏడాది 11, 12 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. రుణాలు మంజూరవుతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూ వేరే వ్యాపారం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించి విజయం సాధిస్తారు. డిజైనర్లు, పరిశోధనలు, ప్రచురణలు, న్యాయ, సినీ, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 5 వరకు, నవంబర్ 12 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రించి ఉండటంతో ఈ సమయంలో విదేశీ గమన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉన్నత చదువుల కోసం ఖర్చులు అఽధికం. కొత్త ఆలోచనలు అమలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
ఈ సంవత్సరం శని 8, 9 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా కార్లు, ఇనుము, మరమ్మత్తుల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభకార్యాలకు మొదట ఆటంకాలు ఎదురైనా చివరకు ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్నేహబాంధవ్యాలు పెరుగుతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో నేర్పుతో విజయం సాధిస్తారు. జూలై 14 నుంచి నవంబరు 28 వరకు శని వక్రగమనంలో ఉన్నందున శుభకార్యాలకు విఘ్నాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చికాకులు పెరుగుతాయి. ఖర్చులు అధికం. చిన్నపాటి బదిలీలు, మార్పులకు అవకాశం ఉంది.
ఈ ఏడాది 9-3 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ వ్యవహారాలు అశాంతిని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. తోబుట్టువులు, బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు అధికం. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి.
శ్రీరామచంద్రమూర్తి ఆరాధన వల్ల శుభం కలుగుతుంది.
సింహం
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)
సింహ రాశి వారు ఈ ఏడాది వ్యాపార రంగంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీ యత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. బాంధవ్యాలు పెంపొందుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని చిక్కులు ఎదురవుతాయి. ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. పై అధికారుల నుంచి మాటపడాల్సి రావచ్చు. కొత్త వ్యాపారాలను కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది.
గురుగ్రహం ఈ ఏడాది మీ జన్మ రాశి నుంచి 10, 11 స్థానాల్లో సంచరిస్తుంది. ఫలితంగా ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తినష్టం జరుగుతుంది. శతృబాధ అధికం. ఉద్యోగులు పై అధికారుల నుంచి మాటపడాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలకు ఇది తగిన సమయం కాదు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఏడాది ప్రారంభం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు, ఆ తరువాత నవంబర్ 12 నుంచి సంవత్సరాంతం వరకు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపార రంగంలోని వారు లాభాలు అందుకుంటారు. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయరంగం వారు ఉన్నత పదవులు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.
ఈ ఏడాది 7, 8 స్థానాల్లో శని సంచారం ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. అన్ని పనుల్లో ఆటంకాలు, ఆలస్యాలు చికాకుపెడతాయి. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. రుణ భారం పెరుగుతుంది. అపనిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. గౌరవ, మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారంలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. జూలై 14 - నవంబర్ 28 తేదీల మధ్య ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూమి/ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రమోషన్ అందుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. రుణ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.
8-2 స్థానాల్లో రాహు, కేతువుల సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. అపనిందలకు గురికావాల్సి వస్తుంది. అన్ని విషయాల్లో దూకుడు తగ్గించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. క్రయవిక్రయాలకు అనుకూలం కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆహార నియమాలు పాటించాలి.
శ్రీ దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
కన్య
(ఉత్తర 2,3,4; హస్త; చిత్త1,2 పాదాలు)
2025లో కన్యారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత చదువులకు అనుకూలం. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో ఉన్నత పదవులు అందుకుంటారు. నూతన భాగస్వామ్యాలు లాభిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెంపొందుతాయి. ప్రత్యర్థులు కూడా సఖ్యతతో వ్యవహరిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితం ఆనందమయంగా సాగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్‌మార్కెట్ లావాదేవీలలో దూకుడు తగ్గించాలి.
గురువు 9, 10 స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలుంటాయి. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, పోలీసులు, మిలటరీ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్, కళా రంగాల వారికి ప్రోత్సాహకరం. సంతానప్రాప్తికి అనుకూలం. రవాణా, ప్లానింగ్, శిక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. నవంబర్ 12 నుంచి ఏడాది చివరి దాకా మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి.
ఈ ఏడాది 6, 7 స్థానాల్లో శని సంచారం ఫలితంగా న్యాయరంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహం విషయంలో పెద్దల సలహాలకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. వ్యాపార విస్తరణ యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. సంకల్ప సాధనలో ఆలస్యమైనా చివరకు ఫలితం సాధిస్తారు. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ద్ధ చూపించాలి. అనుకోని బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి రావచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. జూలై14 - నవంబరు 28 తేదీల మధ్య వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ ఏడాది 7-1 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. వివాహ యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్పెక్యులేషన్లలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉంది. ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.
తుల
(చిత్త 3,4; స్వాతి;
విశాఖ 1,2,3 పాదాలు)
తులా రాశి వారు 2025లో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఆస్తులు పెంపొందించుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. పైచదువులు చదివేందుకు, విదేశీ గమనానికి అనుకూలం. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. వివాహయత్నాలు సఫలమవుతాయి. వైద్యం, ఫార్మా, ప్రకటనలు, కన్సల్టెన్సీలు, ఏజెన్సీలు, రాజకీయ, కళ, సినీ, రక్షణ, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. రుణ యత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు ఓరిమితో పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగం చేస్తూ చిన్న వ్యాపారం చేసేందుకు అనుకూలం. షేర్ మార్కెట్ లావాదేవీల్లో ఫలితాలు మధ్యమంగా ఉంటాయి.
ఈ సంవత్సరం గురువు 8, 9 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే అందుకోసం అధికంగా ఖర్చులు చేయాల్సి వస్తుంది. న్యాయ వివాదాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలం. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. నవంబరు 12 నుంచి రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మీ గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. విద్యార్థుల చదువులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్యం, ఔషధ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు.
శని ఈ సంవత్సరం 5, 6 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా రక్షణ, సైనిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు అధికం. ప్రమోషన్‌ల కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు, బాంధవ్యాల్లో అపార్థాలు చోటు చేసుకుంటాయి. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆస్పత్రులు సందర్శించాల్సి రావచ్చు. మంచి చేసేందుకు ప్రయత్నించి మాటపడతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. జూలై 14 నుంచి నవంబర్ 28 వరకు వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వైద్యం, ఫార్మా రంగాల వారికి ప్రోత్సాహకరం.
ఈ ఏడాది 6-12 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. రుణబాధలు అధికమవుతాయి. ఆర్థికంగా నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెడతాయి.
శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.
వృశ్చికం
(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం పెంపొందుతుంది. సంకల్పం సిద్ధిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. బ్యాంకు డిపాజిట్లు, షేర్ల లావాదేవీలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు వల్ల లబ్ధి పొందుతారు. న్యాయ విషయాల్లో విజయం సాధిస్తారు. భాగస్వాముల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వారసత్వ సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఈ ఏడాది 7, 8 స్థానాల్లో గురుసంచారం ఫలితంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, బంధువులు లక్ష్య సాధనలో సహకరిస్తారు. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. రుణాలు తీర్చగలుగుతారు. ఉమ్మడి వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు శుభప్రదమైన కాలం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం. రాజకీయ, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్ర గమనంలో ఉన్న జనవరిలో ఆ తరువాత నవంబరు 12 నుంచి ఏడాది చివరి వరకు వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. షేర్ల లావాదేవీల్లో నెమ్మది అవసరం.
ఈ ఏడాది 4, 5స్థానాల్లో శని సంచారం కారణంగా సంతానయోగం కలుగుతుంది. విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్దల సహకారం అందు తుంది. ప్రేమ వ్యవహారాలు, చిన్నారులకు సంబంధించిన చికాకులు పెరుగుతాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. వ్యాపారాల విస్తరణకు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం కాదు. డబ్బు సకాలంలో చేతికి అందదు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శని వక్రగమనంలో ఉన్న జూలై 14 - నవంబర్ 28 తేదీల మధ్య వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫార్మా, వైద్యం, రిటైల్, హోటల్ రంగాల వారికి శుభప్రదం. క్రీడాకారులకు అనుకూలం.
ఈ ఏడాది 5-11 స్థానాల్లో రాహు కేతువుల సంచారం వల్ల వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని విషయాల ద్వారా లాభపడతారు. సంతానం నుంచి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. అయితే లక్ష్య సాధనకు శ్రమించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిళ్లు అధికమౌతాయి.
శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
ధనుస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)
ధనుస్సు రాశి వారికి 2025లో స్థిరాస్తి సమకూర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. బ్యాంకింగ్, షేర్‌మార్కెట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.
మీ జన్మరాశి నుంచి 6, 7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేసే యత్నాలు సఫలమవుతాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. హోటల్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత చదువుల్లో విజయం సాధిస్తారు. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. రుణాలు తీరుస్తారు. జనవరిలో, ఆ తరువాత నవంబరు 12 నుంచి సంవత్సరాంతం వరకు సన్నిహితుల నుంచి మాటపడాల్సి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో నెమ్మదిగా ఫలితాలు సాధిస్తారు.
ఈ ఏడాది 3, 4 స్థానాల్లో శని గ్రహ సంచారం ఫలితంగా అనుకున్న చోటికి బదిలీ అవుతారు. ప్రమోషన్లు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. తోబుట్టువుల మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రోత్సాహకరం. హార్డ్‌వేర్, కలప, ఫర్నిచర్, పెట్రోలు, ఇనుము వ్యాపారులకు ప్రోత్సాహకరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. శని వక్రించిన జూలై 14 - నవంబర్ 28 మధ్య ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. చదువుల పట్ల అశ్రద్ధ చూపుతారు. ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.
ఈ ఏడాది 4-10 స్థానాల్లో రాహుకేతువుల సంచార ఫలితంగా వాహనయోగం కలుగుతుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి ఎదురైనా లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇల్లు, స్థలసేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ చూపాలి.
శ్రీ పార్వతీదేవి ఆరాధన శుభప్రదం.
మకరం
(ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు)
మకర రాశి వారు ఈ సంవత్సరం ఉద్యోగ, వ్యాపారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. భూమి కొనుగోలు చేస్తారు. బదిలీలకు అనుకూలం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తికి అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కొత్త కోర్సులు చదివి ఉద్యోగంలో రాణిస్తారు. రుణాలు తీరుస్తారు.
వృషభ, మిథున రాశుల్లో గురువు సంచారం వల్ల ఈ ఏడాది ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞానరంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. స్నేహానుబంధాలు బలపడతాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, విద్యాసంస్థలు, సినిమాలు, ప్రకటనలు, టెలివిజన్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువు వక్ర గమనంలో ఉన్న జనవరితో పాటు నవంబర్ 12 నుంచి సంవత్సరాంతం వరకు విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లోపిస్తుంది. ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు.
మీ జన్మరాశి నుంచి 2, 3 స్థానాల్లో శని సంచారం వల్ల బదిలీలు, సీట్ల మార్పిడి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. తోబుట్టువులు, సన్నిహితులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. పెట్రోలు బంకుల వ్యాపారులకు అనుకూలం. శని వక్ర గమనంలో ఉన్న జూలై 14 - నవంబర్ 28 తేదీల మధ్య కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. ఆస్తి సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి.
ఈ ఏడాది 3 - 9 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా రవాణా రంగంలోని వారికి అనుకూలం. పాతపరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యంపై అశ్రద్ధ చూపితే ఆస్పత్రి సందర్శించాల్సి వస్తుంది. ఆస్తినష్టం వాటిల్లే ప్రమా దం ఉంది. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. ఊహించని ఖర్చులు వస్తాయి. డ్రైవింగ్‌లో నిదానం పాటించాలి. బంధు మిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురుకావడం చికాకు కలిగిస్తుంది.
శ్రీ హయగ్రీవ స్తోత్ర పారాయణ శుభఫలితాలనిస్తుంది.
కుంభం
(ధనిష్ఠ 3,4; శతభిషం;
పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుంభ రాశి వారు 2025లో ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. వాహనయోగం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. జీతభత్యాలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్, నిర్మాణ సామగ్రి వ్యాపారులు పురోగతి సాధిస్తారు. కుటుంబ విషయాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. స్నేహానుబంధాలు బలపడతాయి. అందరినీ ఆకట్టుకుని లక్ష్యాలు సాధిస్తారు.
ఈ ఏడాది 4, 5 స్థానాల్లో బృహస్పతి సంచరిస్తున్న ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. స్టీలు, సిమెంట్ ఇతర నిర్మాణ సామగ్రి వ్యాపారులు, ఫర్నిచర్ రంగాల వారు లాభాలు అందుకుంటారు. పై చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. న్యాయ పోరా టాల్లో విజయం సాధిస్తారు. గురువు వక్రగమనంలో ఉండే జనవరి మాసంతో పాటు నవంబర్ 12 నుంచి ఏడాది చివరి వరకు రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చు. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. సంతానం వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
జన్మరాశి నుంచి 1, 2 స్థానాల్లో శని సంచారం ఫలితంగా వేతనాలు పెరుగుతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సి రావచ్చు. అకారణంగా కలహాలు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితులతో విరోధం ఏర్పడవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. జూలై-నవంబర్ మాసాల మధ్య ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో మొదట ఇబ్బందులెదురైనా చివరకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది.
2-8 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా ఉద్యోగం మారే ఆలోచన ఉంటే దాన్ని వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ప్రయోగాలకు తగిన సమయం కాదు. ఆస్తిపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తుల కొనుగోలు విషయంలో అనుభవం ఉన్న వారి సలహాల మేరకు నడుచుకోవాలి. వివాదాల జోలికి వెళ్లవద్దు.
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.
మీనం
(పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి)
మీన రాశి వారు ఈ ఏడాది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కీర్తిప్రతిష్ఠలు పెంపొందుతాయి. విదేశాలకు వెళ్లే యత్నాలు ఫలిస్తాయి. టెలివిజన్, ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, స్టేషనరీ, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగం చేస్తూ పై చదువుల కోసం ప్రయత్నించి విజయం సాధిస్తారు. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
గురువు 3, 4 స్థానాలలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలుంటాయి. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం అందుకుంటారు. స్టేషనరీ, రవాణా, పాఠశాలలు, మార్కెటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. విదేశీ ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివేందుకు అనుకూలం. ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. రుణబాధలు ఒక కొలిక్కి వస్తాయి. గురువు వక్రగమనంలో ఉన్న జనవరి మాసంతో పాటు నవంబరు 12 నుంచి ఏడాది చివరి వరకు వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి.
వ్యయ రాశితో పాటు మీ జన్మరాశిలో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల ఆర్థిక విషయాలలో తల దూర్చి చిక్కుల్లో పడతారు. జూలై 14 నుంచి నవంబర్ 28 వరకు ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా ప్రయత్నించి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ ఏడాది 1, 7 స్థానాల్లో రాహు కేతు సంచారం ఫలితంగా ఉన్నత పదవులు లభిస్తాయి. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. భాగస్వామి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంఽధించిన నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రుబాధ అధికంగా ఉంటుంది. వివాహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి.
శ్రీకృష్ణ భగవానుడి ఆరాధన శుభప్రదం.