శ్రమ జీవన సౌందర్యోత్సవం
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:46 AM
శ్రమైక జీవన సౌందర్యానికి అద్దంపట్టే పండుగ సంక్రాంతి. పంటలు చేతికొచ్చేటప్పుడు జరుపుకునే వేడుక సంక్రాంతి. ఉన్నత సంప్రదాయల్లో, ఆచార వ్యవహారాల్లో ప్రతి పండుగ వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. ఓపిగ్గా పరిశీలిస్తే..
శ్రమైక జీవన సౌందర్యానికి అద్దంపట్టే పండుగ సంక్రాంతి. పంటలు చేతికొచ్చేటప్పుడు జరుపుకునే వేడుక సంక్రాంతి.
ఉన్నత సంప్రదాయల్లో, ఆచార వ్యవహారాల్లో ప్రతి పండుగ వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. ఓపిగ్గా పరిశీలిస్తే.. పండుగల వెనుక జాతి చరిత్ర, శ్రమ మూలాలు కనిపిస్తాయి. వాతావరణం, జీవావరణం, పర్యావరణం, భావ చైతన్య మహా సమ్మేళనమే మన పండుగలు అని అనిపిస్తుంది.
పల్లె అందాలతో సరదాగా గడపాలి అంటే సంక్రాంతే సరైన సమయం. అలుకు చల్లిన వాకిళ్లు, నేల నలుచెరుగులా పరుచుకున్న ముగ్గులు, గొబ్బెమ్మలతో నిండిన వీథులు ఉంటాయి. ఆ ముగ్గులను చూసినప్పుడు నింగిలోని చుక్కలు దిగివచ్చి ముగ్గులై మురిశాయా.. హరివిల్లులోని వర్ణాలన్నీ ఆ ముగ్గుల్లో.. కొత్త అందాలు పరిచాయా అన్నట్టుగా.. ఆ రంగవల్లులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మధ్యలో గొబ్బెమ్మలు, రేగుపళ్లు, చెరుకు గడలతో ముగ్గులు మరింత సింగారించుకుని సంక్రాంతికి ఆహ్వానం పలుకుతాయి.
రంగురంగుల బట్టలు, గంటలు, గజ్జెలతో అలంకరించిన గంగిరెద్దులు, ధాన్యం నిండిన గరిసెలు, నువ్వుల బెల్లంతో చేసిన అరిసెలు, తీరొక్క దినుసులు, పసుపు కుంకుమ, పచ్చటి వాతావరణంలో నువ్వులు తిని నూరేండ్లు బతుకు.. చక్కెర తిని తీయగా మాట్లాడు అంటూ పంచిపెడతారు. సకినాలు, సర్వపిండి, సజ్జ రొట్టెలు, ఆకాశాన్ని తాకే గాలిపటాలతో పిల్లల ఆనందం అంబరమవుతుంది. ఏడాదిలో తొలి పండుగ. తెలుగువారి సొంతమైన పండుగ సంక్రాంతి. సొంత ఊరులో జరుపుకునే పండుగ. ఎక్కడ వున్నా ఈ పండుగకు మాత్రం ఊరికి పోవల్సిందే. అమ్మకోసం, ఊరమ్మ కోసమూ, మట్టివాసన, మధుర స్మృతుల కోసమూ పట్టణాల నుంచి పల్లెకు పరుగెడుతారు.
సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటినాడు భోగి. భోగం అంటే ప్రకృతికి నివేదించే నైవేద్యం. కొత్త బియ్యంతో వండిన పసుపు అన్నం సమర్పిస్తారు. రైతులు ఆ దినాన పశువులను చక్కగా కడిగి వాటి కొమ్ములకు రంగులు అద్దుతారు. ఆ మూగజీవాలను పూలదండలతోనూ అలంకరిస్తారు. ఎడ్లను గౌరవిస్తారు. వ్యవసాయ పరికరాలు, తమ బతుకులను నిలిపే పనిముట్ల పట్ల కృతజ్ఞతాభావం, అవి దైవ సమానాలనే నమ్మకం ప్రస్ఫుటంగా కనబడుతుంది. అందరి జీవితాలలో ఆనందోత్సాహాలను అందించడమే కాక కొత్త వెలుగుల్ని ఇవ్వమని ప్రకృతిని వేడుకునే పండుగ. ఇవన్నీ శ్రమ సంస్కృతిలో భాగమైనవి. పండుగలు అన్నీ మతపరమైనవి కావు. మానవుని ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించినవి. అంటే వ్యవసాయం, పశుపోషణ వంటివి. ప్రకృతి శక్తులను వశపరచుకున్నప్పుడు మానవుడు సాధించిన విజయాన్ని పురస్కరించుకొని ఈ పండుగలు జరుగుతుంటాయి. కరువు– కాటకాలు, విపత్తులు సంభవించినప్పుడు ప్రకృతిలోని వశంకాని శక్తులు అన్నింటిని దేవుడుగా, దెయ్యాలుగా కొలిచారు. కొన్ని పండుగలు పూర్తిగా మత నమ్మకాలపై పుక్కిటి పురాణ కథలతో ఆచార సంప్రదాయాలతో ఉన్నాయి. పండుగలు, జాతర్లు, ఉత్సవాలను మూఢనమ్మకాలనే పేరుతో కొట్టేయడం సరికాదు. తెలుగు రాష్ట్రాల్లో ‘సంక్రాంతి’, తమిళనాడులో ‘పొంగల్’ కేరళలో ‘ఓణం’ ..ఇలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో కళకళలాడే రోజు. బంతీ, చేమంతి పూలు, రేగుపండ్లు సమృద్ధిగా దొరికే కాలం. ఎడ్లను అలంకరించి, ఆటలు, పాటలతో కూడిన గ్రామీణ ఉత్పత్తితో ముడిబడిన వినోదాల సందర్భం. వీటిలో కూడా పెట్టుబడి ప్రవేశించింది. జూదంగా, వ్యసనంగా తాగుడు వంటి అనాచారాలు ప్రవేశించాయి. వినోదం కాస్తా విషాదమైపోయింది. పండుగల్లో ప్రజా దృక్పథం కొరవడింది. ప్రతి దాంట్లో మంచి సంస్కృతి, శ్రమ సంస్కృతిని గౌరవించాలి, ప్రోత్సహించాలి.
మనిషి ఎప్పుడూ ఒంటరిగా లేడు. సమిష్టిగా పోరాడాడు. ప్రకృతిపై విజయాలను సమిష్టిగానే పంచుకున్నారు. నిప్పుపై మానవుని విజయమే, చీకటి నుంచి వెలుగుల ప్రయాణంగా చూశారు. ప్రకృతి ముందు ఓడిపోయినప్పుడు అతీత శక్తుల వైపు, నమ్మకాల వైపు అల్లుకున్నారు. సూర్యుడు, చంద్రుడు, చెట్టు, పుట్ట, పాము దేవుడిగా కొలిచారు. మొదట మానవుడు చెట్టును పుట్టను ప్రసన్నం చేసుకోవడానికి క్రతువులు ఆచరించాడు. వ్యవసాయ సమాజంలో ఋతుచక్రాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రత్యేక పూజలు చేశాడు. ధాన్యం జీవనాధారం కనుక ధాన్యలక్ష్మీ, ధనం జీవితంలో భాగమయ్యాక ధనలక్ష్మి పేరుతో కొలిచారు. వ్రతాలు, యాగాలు, దీక్షలు చేశారు. అర్థంకాని ప్రతి సమస్య ఆధ్యాత్మికం వైపు మరలింది.
స్వార్థంతో ఒక జాతిని మరొక జాతి పీడించడం మొదలైనప్పుడే... ఆ పీడన నుండే విముక్తి కోసం పోరాటాలు జరిగాయి. జయాపజయాలు, పర్వదినాలు, దుర్దినాలుగా మారి మన సంస్కృతిలో భాగమయ్యాయి. పరాయి పీడన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో నేలకొరిగిన వీరుల జన్మదినాలు పర్వదినాలైనాయి. పరాయి పాలన నుంచి విముక్తి జరిగిన దినాలు ముఖ్యమైన జాతీయ పండుగలయ్యాయి. ‘కప్పం కట్టనుపో..’ అన్న ప్రతి వారికి కత్తిలాంటి జ్ఞాపకం సమ్మక్క, సారక్కలు, గిరిజన వీరుడు కొమరం భీం, కేశ్లాపురం జాతర, కేవల్ కిషన్ జాతర, పండుగ సాయన్న, అమరుల శౌర్యాన్ని జాతర రూపంలో ప్రతి ఏడాది స్మరించుకుంటారు. నృత్యం, సంగీతం, ఆట, పాటలతో సంబురపడతారు. ఇదంతా మానవుడు సమిష్టి కృషితో సంపాదించిన భౌతిక సంపద, సాంస్కృతిక వారసత్వం.
శ్రమ ఫలించి గాదెలు, గరిసెలు నిండిన రోజు సంక్రాంతి ఉత్పత్తితో ముడిబడింది. ఇది పూర్తిగా వ్యవసాయదారుల పంటల పండుగ. దేశ జనాభాలో 70 శాతం గ్రామీణ జనాభా. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. విదేశీ, స్వదేశీ, కార్పొరేట్ వినిమయ సంస్కృతి నుంచి కూడా పండుగలు ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజా సంస్కృతిని వికృతపరుస్తున్నాయి. ప్రజా కళలను ప్రచార సరుకులుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రగతిశీలురు, అభ్యుదయ వాదులు ఈ నీతి బాహ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి. జాతి జనులు అభివృద్ధి నిరోధక మార్గం పట్టకుండా నిత్యం కనిపెడుతూ వుండాలి.
అభివృద్ధి నిరోధక శక్తులు, మతతత్వ శక్తులు ఆయా సందర్భాల్లో ఆధిపత్యం వహించి తమ భావజాలాన్ని వ్యాపింపజేయకుండా అడ్డుకోవాలి. కార్పొరేట్ సంస్కృతి, వినిమయ సంస్కృతి వికృత మార్గం నుండి కాపాడాలి. మార్పులను అభివృద్ధికర మార్గం వైపు జరిగే విధంగా కృషి చేయాలి. ప్రజా సంస్కృతి, ప్రత్యామ్నాయ సంస్కృతికి అవసరమైన పరిస్థితులు కల్పించాలి. శ్రమకు గౌరవం దక్కాలి. శ్రమ సంస్కృతిని ప్రోత్సహించాలి. శాంతి క్రాంతుల పతంగులను విశ్వవీథిన ఎగరవేద్దాం! అదే నిజమైన సంక్రాంతి.
భూపతి వెంకటేశ్వర్లు
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం,
రాష్ట్ర అధ్యక్షుడు